Telugu Global
Sports

కొహ్లీ స్థానంలో 20 వేల పరుగుల మొనగాడికి చోటు దక్కేనా?

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనే భారతజట్టులో నయావాల్ చతేశ్వర్ పూజారా కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

కొహ్లీ స్థానంలో 20 వేల పరుగుల మొనగాడికి చోటు దక్కేనా?
X

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనే భారతజట్టులో నయావాల్ చతేశ్వర్ పూజారా కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విరాట్ కొహ్లీ స్థానంలో పూజారా భారతజట్టులో చేరే అవకాశం ఉంది..

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా..హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా 25న ఇంగ్లండ్ తో ప్రారంభంకానున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో భారతజట్టులోకి చతేశ్వర్ పూజారా పునరాగమనం పై ఊహాగానాలు జోరందుకొన్నాయి.

2023 సిరీస్ లో భారతజట్టు సభ్యుడిగా తన చిట్టచివరి టెస్టు మ్యాచ్ ఆడిన 34 ఏళ్ల పూజారా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడం ద్వారా తిరిగి భారతజట్టులో చేరాలన్న పట్టుదలతో ఉన్నాడు.

విరాట్ స్థానం కోసం ముగ్గురి పోటీ...

ఇంగ్లండ్ తో సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకు వ్యక్తిగత కారణాలతో విరాట్ కొహ్లీ అందుబాటులో లేకపోడంతో ఆ స్థానం కోసం మూడుస్తంభాలాట మొదలయ్యింది.

100 టెస్టుల మొనగాడు చతేశ్వర్ పూజారాతో యువ బ్యాటర్లు రజత్ పాటిదార్, సర్ ఫ్రాజ్ ఖాన్ పోటీపడుతున్నారు.

దేశవాళీ రంజీ క్రికెట్లో పూజారా ఓ వైపు పరుగుల మోత మోగిస్తుంటే..మరోవైపు..ఇంగ్లండ్ తో జరిగిన సన్నాహాక మ్యాచ్ ల్లో రజత్ పాటిదార్ బ్యాక్ టు బ్యాక్ శతకాలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

ముంబై మిడిలార్డర్ బ్యాటర్ సర్ ఫ్రాజ్ ఖాన్ గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడం ద్వారా భారత టెస్టు జట్టులో తనవంతు స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు.

20వేల పరుగుల క్లబ్ లో పూజారా....

గత కొద్దిమాసాలుగా సెలెక్టర్లు తనను పక్కనపెట్టి చిన్నచూపు చూస్తున్నా..పూజారా మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతో తిరిగిజట్టులో చేరడానికి తనవంతు పోరాటం చేస్తున్నాడు.

2024 రంజీసీజన్ ను భారీ డబుల్ సెంచరీతో మొదలు పెట్టాడు. విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ రాణించడం ద్వారా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

నాగపూర్ వేదికగా సౌరాష్ట్ర్ర తరపున ఆడిన పూజారా తొలి ఇన్నింగ్స్ లో 105 బంతుల్లో 43 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 137 బంతుల్లో 66 పరుగుల స్కోర్లు సాధించడం ద్వారా తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20వేల పరుగుల మైలురాయిని చేరిన భారత నాలుగో బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.



260 మ్యాచ్ ల్లో 20, 013 పరుగులు..

విదర్భతో రంజీమ్యాచ్ వరకూ తన కెరియర్ లో 260 మ్యాచ్ లు ఆడిన పూజారా 20, 013 పరుగులు సాధించడం ద్వారా మాస్టర్ సచిన్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్ ల తర్వాతి స్థానంలో నిలిచాడు. పూజారా 61 సెంచరీలు, 78 హాఫ్ సెంచరీలతో పాటు 352 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 51. 98 సగటు నమోదు చేశాడు.

భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 20వేలకు పైగా పరుగులు సాధించిన దిగ్గజ బ్యాటర్లలో ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ (25,834 పరుగులు ), మాస్టర్ సచిన్ టెండుల్కర్ (25,356 పరుగులు )రాహుల్ ద్రావిడ్ ( 23,794 పరుగులతో )మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నారు. 20వేల 013 పరుగులతో పూజారా నాలుగోస్థానంలో నిలిచాడు.

2023 జూన్ తర్వాత నుంచి భారత టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన పూజారాకు గత దశాబ్దకాలంలో భారత్ తరపున ఆడిన 103 టెస్టుల్లో 7వేల 195 పరుగులతో 43.60 సగటు సాధించిన ఘనత ఉంది. 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో పాటు 206 పరుగుల నాటౌట్ స్కోరును అత్యధిక వ్యక్తిగత స్కోరుగా సాధించాడు.

ఇంత ఘనత, అపారఅనుభవం ఉన్న పూజారాను విరాట్ స్థానంలో మన సెలెక్టర్లు తీసుకొంటారా? లేక రజత్ పాటిదార్, సర్ ఫ్రాజ్ ఖాన్ లాంటి యువ బ్యాటర్ల వైపు మొగ్గు చూపుతుందా? తెలుసుకోవాలంటే కొద్దిగంటలపాటు వేచి చూడక తప్పదు.

First Published:  23 Jan 2024 8:36 AM GMT
Next Story