Telugu Global
Sports

ఐసీసీ టోర్నీలలో ఆస్ట్ర్రేలియా కళకళ- భారత్ వెలవెల!

ప్రపంచ క్రికెట్ కు ఆస్ట్ర్రేలియా, భారత్ రెండు కళ్ళు లాంటివి. ఆస్ట్ర్రేలియా తన వినూత్న వ్యూహాలు, శిక్షణ విధానాలు, ప్రొఫెషనలిజమ్ తో క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కిస్తుంటే.

ఐసీసీ టోర్నీలలో ఆస్ట్ర్రేలియా కళకళ- భారత్ వెలవెల!
X

ఐసీసీ టోర్నీలలో ఆస్ట్ర్రేలియా కళకళ- భారత్ వెలవెల!

ఐసీసీ ప్రపంచ క్రికెట్ టోర్నీలలో ఆస్ట్ర్రేలియా కళకళ లాడుతుంటే...భారత్ మాత్రం వెలవెలబోతోంది.

ప్రపంచ క్రికెట్ కు ఆస్ట్ర్రేలియా, భారత్ రెండు కళ్ళు లాంటివి. ఆస్ట్ర్రేలియా తన వినూత్న వ్యూహాలు, శిక్షణ విధానాలు, ప్రొఫెషనలిజమ్ తో క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కిస్తుంటే.

క్రికెట్, క్రికెటర్ల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను భారత్ వివిధ రూపాలలో సమకూర్చి పెడుతూ దన్నుగా నిలుస్తోంది.

అయితే..ఈ రెండుజట్లు, ఈ రెండుదేశాలలోని క్రికెట్ వ్యవస్థలు, రికార్డుల నడుమ ఎంతో వ్యత్యాసం ఉంది. ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి ) నిర్వహించే ప్రపంచ క్రికెట్ టోర్నీలలో ఆస్ట్ర్రేలియా అన్ని విభాగాలలోనూ విశ్వవిజేతగా నిలుస్తూ కళకళ లాడుతోంది. మరోవైపు భారత్ మాత్రం ఐసీసీ టోర్నీలలో పిల్లిమొగ్గలేస్తూ వెలవెల బోతోంది.

ప్రతి ఫార్మాట్లోనూ విజేతగా ఆస్ట్ర్రేలియా...

లండన్ లోని ఓవల్ వేదికగా ముగిసిన 2023 ఐసీసీ ప్రపంచటెస్టు లీగ్ ఫైనల్లో భారత్ ను 209 పరుగులతో చిత్తు చేయడం ద్వారా ఆస్ట్ర్రేలియా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగింది.

ఐసీసీ ప్రపంచ స్థాయిలో నిర్వహించే మొత్తం అన్ని రకాల టోర్నీలలోనూ విజేతగా నిలిచిన తొలిజట్టుగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఐసీసీ వన్డే ప్రపంచకప్, ఐసీసీ టీ-20 ప్రపంచకప్, ఐసీసీ మినీ ప్రపంచకప్ ( చాంపియన్స్ ట్రోఫీ ) టోర్నీలు నెగ్గిన ఆస్ట్ర్రేలియా..ప్రస్తుత 2023 ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ సైతం నెగ్గడం ద్వారా..నాలుగు రకాల ఐసీసీ ట్రోఫీలు అందుకొన్న తొలి, ఏకైక జట్టుగా రికార్డు నెలకొల్పింది.

భారత్ వైఫల్యాలు ఇంకెంత కాలం?

మరోవైపు అన్ని హంగులూ ఉన్న భారత క్రికెట్ పరిస్థితి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నతీరుగా ఉంది. తరాలు మారినా, కెప్టెన్లు, కోచ్ లు మారినా ఐసీసీ ప్రపంచ టైటిల్స్ సాధించడంలో మాత్రం భారత్ విఫలమవుతూనే వస్తోంది.

1983 వన్డే ప్రపంచకప్ ను కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారిగా గెలుచుకొన్న భారతజట్టుకు అదే తొలి ఐసీసీ టైటిల్. ఆ తరువాత మరో టైటిల్ కోసం 2007 టీ-20 ప్రపంచకప్ వరకూ వేచి చూడాల్సి వచ్చింది.

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ 2007 టీ-20 ప్రపంచ టైటిల్ సాధించడం ద్వారా తన ఖాతాలో రెండో ఐసీసీ ప్రపంచ టైటిల్ ను జమచేసుకోగలిగింది. ఆ తర్వాత నాలుగేళ్లకే 2011 వన్డే ప్రపంచకప్ ను మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోనే సాధించింది.

2013 చాంపియన్స్ ట్రోఫీ ( మినీ ప్రపంచకప్ )ని ధోనీ కెప్టెన్సీలోనే నెగ్గిన భారత్ కు ఆ తర్వాత నుంచి ఐసీసీ ప్రపంచ ట్రోఫీలు అందనిద్రాక్షలా మారాయి.

అభిమానుల సహనానికి పరీక్ష....

ఐసీసీ ప్రపంచ టోర్నీ ఫైన‌ల్స్‌లో భార‌త జట్లు గత దశాబ్దకాలంగా తడబడుతూనే వస్తున్నాయి. మరికొద్దిమాసాలలోనే భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది.

ఈ నేపథ్యంలో..2023 ఐసీసీ ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ పరాజయాన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

2021 ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు దూసుకెళ్లిన విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు..టైటిల్ సమరంలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది.

వరుసగా రెండోసారి టెస్టు లీగ్ ఫైనల్స్ చేరిన తొలిజట్టుగా నిలిచిన భారత్ కు ఆ ఆనందం ఫైనల్లో ఓటమితో ఆవిరైపోయింది.

2000 సంవత్సరం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నుంచి ప్రస్తుత టెస్టు లీగ్ ఫైనల్స్ వరకూ భారత్ మొత్తం ఆరుసార్లు రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది

2000 సంవత్సరంలో జరిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్స్, 2003 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్స్, 2014 టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ తో పాటు.. 2021, 2023 ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్స్ లో భార‌త్ పరాజయాలపాలు కావాల్సి వచ్చింది.

చాంపియ‌న్స్ ట్రోఫీ 2000 ఫైనల్స్ లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భార‌త్ ఫైన‌ల్లో అడుగు పెట్టింది. అయితే న్యూజిలాండ్‌పై 4 వికెట్ల‌ తేడాతో ఓటమి పాలైంది.

ఆల్ రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆల్ రౌండ్ షోతో భారత్ రన్నరప్ గా మిగిలింది.

2002 చాంపియ‌న్స్ ట్రోఫీ లో మాత్రం శ్రీ‌లంక‌తో క‌లిసి భారత్ సంయుక్త విజేత‌గా నిలిచింది.

2003 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా చేతిలో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని భార‌త్ ఓటమి పాలయ్యింది.

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2007 టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించడం ద్వారా భారత్ తొలిసారిగా ట్రోఫీ అందుకొంది.

భారత్ వేదికగా 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ నాయకత్వంలోని భారత్...శ్రీలంకను చిత్తు చేయడం ద్వారా రెండోసారి వన్డే ప్రపంచకప్ విశ్వవిజేతగా నిలువగలిగింది.

ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించడం ద్వారా భారత్ తొలిసారిగా మినీ ప్రపంచకప్ విజేతగా నిలిచింది.

ర‌వీంద్ర జ‌డేజా ఆల్‌రౌండ్ షో(33 ప‌రుగులు, 2 వికెట్లు)తో భారత్ నాలుగో ఐసీసీ ట్రోఫీని అందుకోగలిగింది.

ఇక..2014 టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరిన భారత్ కు టైటిల్ సమరంలో శ్రీలంక చేతిలో ఓటమి తప్పలేదు. శ్రీ‌లంక జ‌ట్టు భార‌త్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. కుమార సంగ‌క్క‌ర అర్ధ శ‌క‌తం (52) బాది శ్రీలంకను విజేతగా నిలిపాడు.

2017 చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్స్ చేరిన భారత్ కు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమి తప్పలేదు. పాక్ నిర్దేశించిన 339 ప‌రుగుల భారీలక్ష్య సాధనలో భారత్ చతికిలబడిపోయింది. పరుగులకే కుప్ప‌కూలింది.

2021 ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. జెయింట్ పేసర్ కైలీ జేమీస‌న్ సంచ‌ల‌న బౌలింగ్‌తో కివీస్‌కు విజ‌యాన్ని అందించాడు.

2023 టెస్టు లీగ్ ఫైనల్లో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ లోనూ, బోలాండ్, లయన్ బౌలింగ్ లోనూ రాణించడంతో కంగారూ టీమ్ 209 పరుగులతో భారత్ ను చిత్తు చేయగలిగింది.

భారత్ దారుణంగా విఫలమై అభిమానులకు గుండెకోతను మిగిల్చింది.

First Published:  13 Jun 2023 11:30 AM GMT
Next Story