Telugu Global
Sports

కన్నడ క్రికెట్ దిగ్గజాలకు ఆ గౌరవం ఎప్పుడు?

కర్ణాటక జట్టు జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీ ట్రోఫీని 1973లో సాధించిన తరువాత 50 సంవత్సరాల వేడుకలను ఇటీవలే కర్ణాటక క్రికెట్ సంఘం ఘనంగా నిర్వహించింది.

కన్నడ క్రికెట్ దిగ్గజాలకు ఆ గౌరవం ఎప్పుడు?
X

క్రికెటర్లు కాని, క్రికెట్ తో ఏమాత్రం సంబంధం లేని అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీ లాంటి ప్రముఖల పేర్లను ఓ వైపు దేశంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలకు నామకరణం చేస్తే.. భారత క్రికెట్ కు ఎనలేని సేవలు చేసిన కన్నడ దిగ్గజ క్రికెటర్లు మాత్రం ఆ గౌరవం కోసం ఎదురుచూస్తున్నారు.

అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియానికి నరేంద్ర మోడీ పేరు, న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ నామం..మొహలీ క్రికెట్ స్టేడియానికి ఐఎస్ బింద్రా పేరు..విశాఖలోని ఆంధ్రక్రికెట్ సంఘం స్టేడియానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు... హైదరాబాద్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు..ఇలా..దేశంలోని పలు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలకు ప్రముఖరాజకీయనాయకుల పేర్లు పెట్టడం మనకు కనిపిస్తుంది.

అంతేకాదు..ముంబై, హైదరాబాద్, జార్ఖండ్ క్రికెట్ స్టేడియాల స్టాండ్లు, పెవీలియన్లకు ప్రముఖ క్రికెటర్ల పేర్లు పెట్టి గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఏకంగా మాస్టర్ సచిన్ టెండుల్కర్ నిలువెత్తు విగ్రహాన్నే ఏర్పాటు చేయటం ద్వారా అపూర్వ గౌరవం అందించారు. అయితే..కర్ణాటకలో మాత్రం కన్నడ క్రికెట్ దిగ్గజాలు ఏ ఒక్కరూ ఆ గౌరవానికి, అదృష్టానికి నోచుకోలేకపోయారు.

ఇరాపల్లి ప్రసన్న నుంచి రాహుల్ ద్రావిడ్ వరకూ...

భారత క్రికెట్ కు అసమాన సేవలు అందించిన స్పిన్ జోడీ ఇరాపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, బ్యాటింగ్ కళాకారుడు గుండప్ప విశ్వనాథ్, లెగ్ స్పిన్ గ్రేట్ అనీల్ కుంబ్లే, ఫాస్ట్ బౌలర్ల జోడీ వెంకటేశ్ ప్రసాద్, జవగళ్ శ్రీనాథ్, వికెట్ కీపర్ బ్యాటర్ సయ్యద్ కిర్మాణీ, ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్...ఇలా ఎందరో గొప్పగొప్ప కర్ణాటక రాష్ట్ర్ర క్రికెటర్లు మనకు కనిపిస్తారు. అయితే..

కర్ణాటకలోని ఏకైక అంతర్జాతీయ క్రికెట్ వేదిక బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మాత్రం అలాంటి పరిస్థితి మనకు కనిపించదు. చిన్నస్వామి స్టేడియం పెవీలియన్, స్టాండ్లకు క్రికెట్ ప్రముఖుల పేర్లే కనిపించవు.

రంజీ విజయానికి 50 ఏళ్లు!

కర్ణాటక జట్టు జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీ ట్రోఫీని 1973లో సాధించిన తరువాత 50 సంవత్సరాల వేడుకలను ఇటీవలే కర్ణాటక క్రికెట్ సంఘం ఘనంగా నిర్వహించింది.

ఈ వేడుకలలో భాగంగా అలనాటి దిగ్గజ ఆటగాళ్లను సత్కరించింది. బెంగళూరు స్టేడియంలోని స్టాండ్లకు, పెవీలియన్లకు కన్నడ క్రికెట్ దిగ్గజాల పేర్లను పెట్టడానికి చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు రఘరామ్ భట్ కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ లేఖ వ్రాశారు.

చిన్నస్వామి స్టేడియం స్టాండ్లకు చంద్రశేఖర్, గుండప్ప విశ్వనాథ్, ఇరాపల్లి ప్రసన్నల పేర్లతో నామకరణం చేసి గౌరవించుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేశారు.

భారత క్రికెట్ కు అపూర్వ సేవలు అందించిన దిగ్గజ త్రయం పేర్లతో స్టాండ్లు ఏర్పాటు చేస్తే అది కర్ణాటక క్రికెట్ నే గౌరవించుకొన్నట్లవుతుందని చెప్పారు.

ముంబై, ఢిల్లీ, కోల్ కతా, రాంచీ నగరాలు తమ క్రికెటర్లను గౌరవించుకొన్న తీరును గుర్తుంచుకోవాలని సూచించారు.

దేశవిదేశాలలోని కోట్లాదిమందిలో తమ ఆటతీరు, నడవడికతో స్ఫూర్తిని నింపిన ప్రసన్న, చంద్రశేఖర్, గుండప్ప విశ్వనాథ్ లను గౌరవించి తీరాల్సిందేనని, రాహుల్ ద్రావిడ్, అనీల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ లను సైతం గుర్తుంచుకోవాలని ప్రముఖ చరిత్రకారుడు, విఖ్యాత క్రికెట్ రచయిత రామచంద్ర గుహ సైతం తన వ్యాసం ద్వారా విజ్ఞప్తి చేశారు.

కన్నడ క్రికెట్ దిగ్గజాల పేర్లతో స్టాండ్లు ఏర్పాటు చేయాలని, చిన్నస్వామి స్టేడియం స్టాండ్లకు వారి పేర్లతో నామకరణం చేయటానికి ముందుకు రావాలని భారత మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్, కర్నాటక మాజీ స్పిన్నర్ సునీల్ జోషీ సైతం విజ్ఞప్తి చేశారు.

బెంగళూరు చుట్టూ ఎన్నో స్టేడియాలు...

బెంగళూరు నగరం చుట్టూ కర్ణాటక క్రికెట్ సంఘానికి చెందిన స్టేడియాలు ఎన్నో ఉన్నాయని, అలూర్ స్టేడియానికి బ్రిజేశ్ పటేల్, బెలగావీ స్టేడియానికి గుండప్ప విశ్వనాథ్, మైసూర్ స్టేడియానికి మరో దిగ్గజం పేరు పెట్టాలని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ దొడ్డ గణేశ్ సూచించాడు.

క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కించడంతో పాటు తమ ఆటతీరుతో ఎనలేని గౌరవాన్ని, హుందా తనాన్ని తెచ్చిన కన్నడ దిగ్గజ క్రికెటర్ల పేర్లతో స్టేడియాలు, పెవీలియన్లు, స్టాండ్లు ఏర్పాటు చేయాలని ప్రముఖ క్రీడాజర్నలిస్టు శారద ఉగ్రా సైతం కోరారు.

First Published:  26 April 2024 5:16 AM GMT
Next Story