Telugu Global
Sports

లియాండర్ పేస్ కు టెన్నిస్ 'హాల్ ఆఫ్ ఫేమ్'!

వేర్వేరు తరాలకు చెందిన ఇద్దరు భారత టెన్నిస్ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ టెన్నిస్ ' హాల్ ఆఫ్ ఫేమ్' లో చోటు లభించింది.

లియాండర్ పేస్ కు టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్!
X

వేర్వేరు తరాలకు చెందిన ఇద్దరు భారత టెన్నిస్ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ టెన్నిస్ ' హాల్ ఆఫ్ ఫేమ్' లో చోటు లభించింది.

రాయల్ గేమ్ టెన్నిస్ లో భారత దిగ్గజ ఆటగాళ్ళు విజయ్ అమృత్ రాజ్, లియాండర్ పేస్ తమకంటూ ఓ ప్రత్యేకస్థానం, గుర్తింపు, గౌరవం దక్కించుకొన్నారు.

టెన్నిస్ క్రీడకు పలు విధాలుగా విశిష్ట సేవలు అందించిన క్రీడాకారులను అంతర్జాతీయ టె్న్నిస్ సమాఖ్య' హాల్ ఆఫ్ ఫేమ్' పురస్కారాలతో గౌరవిస్తూ వస్తోంది.

ఆ విశిష్ట గౌరవాన్ని భరతమాత ముద్దుబిడ్డలు విజయ్, లియాండర్ సైతం సంపాదించారు.

ఆసియా తొలి జోడీగా ...

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యలో 200కు పైగా దేశాలకు సభ్యత్వం ఉన్నాఇప్పటి వరకూ కేవలం 28 దేశాలకు చెందిన క్రీడాకారులకు మాత్రమే హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కింది. లియాండర్ పేస్, విజయ్ అమృత్ రాజ్ ల అసాధారణ ప్రతిభ, అంకితభావంతో ఈ పురస్కారం పొందిన 28వ దేశంగా, ఆసియా ఖండంలో మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది.

విజయ్, పేస్ లకు ముందు 27 దేశాలకు చెందిన 264 మంది హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవపురస్కారాలను అందుకొన్నవారిలో ఉన్నారు. టెన్నిస్ క్రీడకు తమ ఆటతో, అసాధారణ రికార్డులతో, అసమాన వ్యాఖ్యానంతో, పాత్రికేయం ద్వారాను, టెన్నిస్ అభివృద్ధికి పలు విధాలుగా పాటు పడిన వారికి వేర్వేరు విభాగాల కింద హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాన్ని అందిస్తూ వస్తున్నారు.

2024 హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాలకు లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్ లతో పాటు ఇంగ్లండ్ కు చెందిన విఖ్యాత టెన్నిస్ పాత్రికేయుడు రిచర్డ్ ఇవాన్స్ ను ఎన్నిక చేసినట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది.

టెన్నిస్సే జీవితంగా పేస్.....

భారత, ప్రపంచ టెన్నిస్ కు లియాండర్ పేస్ 30 సంవత్సరాలపాటు చేసిన సేవ గురించి ఎంత చెప్పుకొన్నా అదితక్కువే అవుతుంది. ఇప్పటి వరకూ తన జీవితంలో మూడొంతుల సమయాన్ని టెన్నిస్ కోసమే వెచ్చించిన ఘనుడు లియాండర్ పేస్.

మూడుదశాబ్దాల తన టెన్నిస్ జీవితంలో లియాండర్ పేస్ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్ లో 37 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు ఆటగాడిగా, 462 వారాలపాటు ఏటీపీ డబుల్స్ టాప్ -10 జాబితాలో కొనసాగాడు.

డబుల్స్ విభాగంలో 55 టైటిల్స్ గెలుచుకొ్న్నాడు. ఇందులో 18 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సైతం ఉండటం విశేషం.

ఇక..డేవిస్ కప్ చరిత్రలో 45 డబుల్స్ మ్యాచ్ లతో సహా 57 మ్యాచ్ ల్లో పాల్గొన్నాడు. వరుసగా ఏడు ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.1996 అట్లాంటా ఒలింపిక్స్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన భారత తొలి, ఏకైక ప్లేయర్ గా నిలిచాడు.

అత్యధిక మిక్సిడ్ డబుల్స్ టైటిల్స్ సాధించిన రికార్డును దిగ్గజ ప్లేయర్ మార్టీనా నవ్రతిలోవాతో కలసి పంచుకొన్నాడు. పేస్ సాధించిన మొత్తం 18 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలలో 10 మిక్సిడ్ డబుల్స్, 8 డబుల్స్ టైటిల్స్ మాత్రమే ఉన్నాయి.

శతకోటి భారతీయులకు దక్కిన గౌరవం...

తన జీవితంలో 30 సంవత్సరాల సమయాన్ని టెన్నిస్ కోసమే వినియోగించానని, తన విజయాలు, రికార్డులకు, భారత టెన్నిస్ కు చేసిన సేవలకు గుర్తింపుగా దక్కిన గౌరవాన్ని వందకోట్లకు పైబడిన భారతీయులకు లభించిన పురస్కారంగా భావిస్తున్నట్లు లియాండర్ ప్రకటించాడు.

అసమాన క్రీడాకారుల విభాగంలో లియాండర్ పేస్ కు, టెన్నిస్ వ్యాఖ్యానం విభాగంలో విజయ్ అమృత్ రాజ్ కు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది. 1970 దశకంలో భారత నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ గా, ప్రపంచ టెన్నిస్ లోని ముగ్గురు ప్రతిభావంతులైన ( అమృత్ రాజ్, బోర్గ్ , కానర్స్ ) ఆటగాళ్ళలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకొన్న విజయ్ రిటైర్మెంట్ తరువాత వ్యాఖ్యాతగా తన కెరియర్ ను మలచుకొన్నారు.

మధుర భాషణ, లోతైన విశ్లేషణలతో కూడిన కమ్మటి వ్యాఖ్యానంలో విజయ్ కు విజయ్ మాత్రమే సాటి. వయసు మీరుతున్నా తన వ్యాఖ్యాన శైలిలో ఏడాది ఏడాదికీ యవ్వనాన్ని, సొగసును పెంచుకొంటూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది టెన్నిస్ అభిమానులను సమ్మోహన పరుస్తూ వస్తున్నారు.

వ్యాఖ్యాతగా టెన్నిస్ క్రీడకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా విజయ్ ను హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం వరించింది. ఆటగాడిగా సాధించలేనిదాన్ని వ్యాఖ్యానం ద్వారా సాధించడం విజయ్ బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిపోతుంది.

ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి వివిధ విభాగాలలో హాల్ ఆఫ్ ఫేమ్ కోసం ఆన్ లైన్ ఓటింగ్ ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య నిర్వహిస్తూ ఎంపిక చేస్తూ వస్తోంది.

మువ్వన్నెల జెండా భక్తుడు పేస్...

వ్యక్తిగత రికార్డుల కంటే దేశ, భారత టెన్నిస్ ప్రయోజనాలే ముఖ్యమని భావించే లియాండర్ పేస్ కు మువ్వన్నెల జాతీయ పతాకం అంటే ఎనలేని భక్తి, గౌరవం.

ఇస్లామాబాద్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన డేవిస్ కప్ పోరుకు ప్రాణభయంతో పలువురు సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. అయితే ..46 సంవత్సరాల పేస్ మాత్రం తాను సిద్ధమని, యువఆటగాళ్లతో కలసి ఆడటానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. చివరకు తటస్థవేదికగా ఎంపికైన నూర్-సుల్తాన్ ఎముకలు కొరికే చలివాతావరణంలో భారతజట్టు తరపున బరిలో నిలచి కీలక డబుల్స్ లో విజయం అందించాడు.

1990 నుంచి 2020 వరకూ...

ప్రస్తుత భారత డేవిస్ కప్ శిక్షకుడు జీషన్ అలీతో కలసి..1990లో తన తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన లియాండర్ పేస్...గత 30 సంవత్సరాలుగా...భారత జట్టులో సభ్యుడిగా కొనసాగుతూనే ఉన్నాడు.

అంతేకాదు...47 ఏళ్ల లేటు వయసులో సైతం...కుర్రాడిలా రాణిస్తూ ....ప్రతిభకు, అంకితభావానికి... వయసుతో ఏమాత్రం పనిలేదని చాటిచెప్పాడు.

46 ఏళ్ల వయసులో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించడంతో పాటు..ఆడిన 57 డేవిస్ కప్ మ్యాచ్ ల్లో పేస్.. 44 విజయాలతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. డేవిస్ కప్ డబుల్స్ లో ఇప్పటి వరకూ 44 విజయాలు సాధించడం ద్వారా...ఇటలీ ప్లేయర్ నికోలా పీట్రాంజెలీ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును పేస్...... తెరమరుగు చేశాడు.

45 దేశాల నుంచి ఇద్దరే ఇద్దరు..

ఆసియాఖండంలో 45కు పైగా దేశాలకు చెందిన క్రీడాకారులు టెన్నిస్ ఆడుతూ ఉంటే కేవలం భారత్ కు చెందిన ఇద్దరు క్రీడాకారులకు మాత్రమే హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం దక్కడం భరతజాతి ఘనతగా మిగిలిపోతుంది. చైనా, జపాన్, కొరియా లాంటి మేటి దేశాల క్రీడాకారులు సాధించలేనిది ఇద్దరు భారత క్రీడాకారులు సాధించడం అపూర్వమే కాదు..అసాధారణం కూడా.ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ అభిమానులు పాల్గొన్న ఓటింగ్ ద్వారా లియాండర్ పేస్ కు అత్యధికంగా ఓట్లు దక్కాయి.

ఇంతకు ముందే హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం పొందిన ప్రపంచ మేటి క్రీడాకారులలో మార్టీనా నవ్రతిలోవా, కిమ్ క్లిస్టర్స్, జాన్ మెకెన్రో, జోర్న్ బోర్గ్, మార్టీనా హింగిస్ ఉన్నారు.

భారత క్రికెట్ చరిత్రలో సచిన్ కు ఎంత గౌరవం, గుర్తింపో...భారత టెన్నిస్ లో లియాండర్ పేస్ అదేస్థాయి ఆటగాడు. పేస్ లాంటి మరో ఆటగాడి కోసం భారత టెన్నిస్ ఎంతకాలం వేచిచూడాలో మరి.!

First Published:  25 Dec 2023 3:54 AM GMT
Next Story