Telugu Global
Sports

ఖేలో ఇండియాలో ఇదేమి న్యాయం!.. కేటాయింపులు తక్కువ.. పతకాలు ఎక్కువ

అదే గుజరాత్ రాష్ట్రానికి రికార్డుస్థాయిలో 608 కోట్ల రూపాయలు నిధులు అందిస్తే.. పారా క్రీడల విభాగంలో ఇద్దరు మాత్రమే గుజరాత్ కు చెందిన అథ్లెట్లు పతకాలు సాధించగలిగారు.

ఖేలో ఇండియాలో ఇదేమి న్యాయం!.. కేటాయింపులు తక్కువ.. పతకాలు ఎక్కువ
X

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన భారత అథ్లెట్లు కనబరచిన ప్రతిభ, సాధించిన పతకాలపై రకరకాలుగా సమీక్ష జరుగుతోంది. ఖేలో ఇండియా పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు అందచేసిన గుజరాత్ లాంటి రాష్ట్రాల‌ అథ్లెట్లు అరకొరగా పతకాలు సాధిస్తే.. నామమాత్రంగా నిధులు పొందిన తెలుగు రాష్ట్రాల‌ అథ్లెట్లు స్థాయికి మించి రాణించడం ద్వారా తమ దేశానికి అత్యధికంగా బంగారు పతకాలు అందించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచారు.


తెలుగు రాష్ట్రాల‌ అథ్లెట్ల బంగారు పంట..

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అథ్లెట్లు బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, క్రికెట్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో పతకాల మోత మోగించారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పీవీ సింధు, బాక్సింగ్ మహిళల విభాగంలో నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో సాయి సాత్విక్, టేబుల్ టెన్నిస్ మిక్సిడ్ డబుల్స్ లో ఆకుల శ్రీజ బంగారు పతకాలు సాధిస్తే.. మహిళల హాకీలో ఎతిమరపు రజనీ కాంస్య, క్రికెట్లో మేఘన రజత పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఖేలోఇండియా పథకం ద్వారా తెలంగాణకు 24.11 కోట్లు, ఆంధ్రపదేశ్‌ 33.80 కోట్ల రూపాయలను కేంద్రప్రభుత్వం అందచేసింది. అదే గుజరాత్ రాష్ట్రానికి రికార్డుస్థాయిలో 608 కోట్ల రూపాయలు నిధులు అందిస్తే.. పారా క్రీడల విభాగంలో ఇద్దరు మాత్రమే గుజరాత్ కు చెందిన అథ్లెట్లు పతకాలు సాధించగలిగారు.


హర్యానా టాప్..

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ సాధించిన మొత్తం 61 పతకాలలో హర్యానా అథ్లెట్లు గెలుచుకున్నవే 23 పతకాలు ఉన్నాయి. ఆ తర్వాత 6 పతకాలతో తెలంగాణ రెండోస్థానంలో నిలిస్తే.. ఐదేసి పతకాలు చొప్పున సాధించడం ద్వారా పంజాబ్, యూపీ, మహారాష్ట్ర‌, తమిళనాడు సంయుక్త తృతీయస్థానంలో నిలిచాయి. 4 పతకాలతో బెంగాల్ నాలుగు, మూడేసి పతకాలు చొప్పున సాధించిన మణిపూర్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఢిల్లీ ఐదో స్థానంలోనూ, రెండేసి పతకాలతో రాజస్థాన్, గుజరాత్ ఆరోస్థానం దక్కించుకొన్నాయి. చండీఘడ్, కేరళ, మిజోరం అథ్లెట్లు ఒక్కో పతకం మాత్రమే సాధించగలిగారు. ఖేలో ఇండియా ద్వారా దండిగా నిధులు అందుకొన్న గుజరాత్ నుంచి ఐదుగురు, ఉత్తరప్రదేశ్ నుంచి 12, కర్నాటక నుంచి 11 మంది అథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించగలిగారు. ఖేలో ఇండియా ద్వారా భారీగా 608 కోట్లు నిధులు అందుకొన్న గుజరాత్ రెండంటే రెండు పతకాలు మాత్రమే అందించగలిగింది. ఉత్తరప్రదేశ్ కు 503 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్‌కు 183 కోట్లు, కర్నాటకకు 128 కోట్లు అందించిన కేంద్రం తాము అధికారంలో లేని బెంగాల్ కు 26.77 కోట్లు, తెలంగాణాకు 24.11, ఆంధ్రప్రదేశ్ కు 33.80 కోట్ల రూపాయలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు 33 కోట్లు, కేరళ 62.74 కోట్లు అందుకున్నాయి. ఖేలో ఇండియా పథకానికి కేంద్రప్రభుత్వం మొత్తం 2వేల 754 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది మొత్తం కేంద్ర క్రీడాబడ్జెట్ లో 48.09కి సమానం.

First Published:  11 Aug 2022 8:13 AM GMT
Next Story