Telugu Global
Sports

లైంగిక వేధింపులతో రోడ్డెక్కిన భారత మహిళావస్తాదులు!

మహిళా వస్తాదులకు లక్నోలో శిక్షణ శిబిరం నిర్వహించిన సమయంలో పలువురు శిక్షకులు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని, ఇదే విషయాన్ని సమాఖ్య అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళితే ఏమాత్రం పట్టించుకోకుండా..ఎదురుదాడిగా బెదిరింపులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు.

లైంగిక వేధింపులతో రోడ్డెక్కిన భారత మహిళావస్తాదులు!
X

దేశానికి అంతర్జాతీయంగా పలు బంగారు పతకాలతో ఖ్యాతి తెచ్చిన పలువురు మహిళా వస్తాదులు రోడ్డెక్కారు. తమను లైంగికవేధింపులకు గురి చేస్తున్నారంటూ జాతీయ కుస్తీ సమాఖ్యపై తీవ్రఆరోపణలతో నిరసనకు దిగారు...

భారత కుస్తీ సమాఖ్యలో కలకలం రేగింది. తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ పలువురు అంతర్జాతీయ మహిళావస్తాదులు తీవ్రనిరసన వ్యక్తం చేస్తూ రోడ్డున పడ్డారు.

జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమను పలురకాలు వేధిస్తున్నారని, కుస్తీ సమాఖ్యకు చెందిన సీనియర్ శిక్షకులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ గోల్డ్ మెడల్ వస్తాదు వినితా పోగట్ నాయకత్వంలోని మహిళా వస్తాదులు ఆరోపించారు.

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి మరీ ఆందోళన వ్యక్తం చేశారు. పురుషవస్తాదులు సైతం మహిళావస్తాదులకు సంఘీభావంగా నిరసనశిబిరంలో పాల్గొన్నారు.

సమాఖ్య అధ్యక్షుడ్ని తొలగించాలి...

జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే వరకూ తాము అంతర్జాతీయ పోటీలలో భారత్ తరపున పాల్గొనేదిలేదని ఒలింపిక్స్ బ్రాండ్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా ప్రకటించారు.

2011 నుంచి భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్ నియంతలా వ్యవహరిస్తున్నారని. వస్తాదులను బానిసల్లా చూస్తున్నారని, మహిళా వస్తాదులపైన లైంగిక వేధింపులు జరుగుతుంటే ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.

ఇదే విషయమై ప్రధానికి ఫిర్యాదు చేశామని, తమను కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు పదేపదే బెదిరిస్తున్నారని, మీ క్రీడాజీవితాన్ని అంతం చేస్తానంటూ భయపెడుతున్నారంటూ ఆరోపించారు.

ఈ నిరసన కార్యక్రమంలో వినేశ్ పోగట్ తో పాటు సాక్షి మాలిక్, సరీతా మోర్, సంగీత పోగట్, సత్యవార్త్ మాలిక్, జితేందర్ కిన్హాతో సహా 30 మంది వస్తాదులు పాల్గొన్నారు.

మహిళా వస్తాదులకు లక్నోలో శిక్షణ శిబిరం నిర్వహించిన సమయంలో పలువురు శిక్షకులు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని, ఇదే విషయాన్ని సమాఖ్య అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళితే ఏమాత్రం పట్టించుకోకుండా..ఎదురుదాడిగా బెదిరింపులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు.

మొత్తం 10 నుంచి 12 మంది మహిళావస్తాదులపై లైగింక వేధింపులకు పాల్పడిన సమాచారం తన దగ్గర ఉందని, సమయం వచ్చినప్పుడు ప్రధాని ముందు ఉంచుతానని టోక్యో ఒలింపిక్స్ మెడలిస్ట్ ,28 సంవత్సరాల వినేశ్ పోగట్ ప్రకటించింది.

తమ ఈ నిరసన భారత ప్రభుత్వానికి, జాతీయ క్రీడాసమాఖ్యలకు వ్యతిరేకం కాదని, కుస్తీ సమాఖ్య ఆగడాలపైన మాత్రమే పోరాడుతున్నామని ఒలింపిక్స్ కుస్తీ కాంస్య విజేత బజరంగ్ పూనియా వివరించాడు.

ఉరిశిక్షకైనా సిద్దం- సమాఖ్య అధ్యక్షుడు

మహిళా వస్తాదులు తమపై చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, నిరాధార ఆరోపణలతో తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని కుస్తీ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ ఎదురుదాడికి దిగారు. తాను మహిళా వస్తాదులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిరూపిస్తే..ఉరిశిక్షకైనా సిద్దమేనంటూ సవాలు విసిరారు.

గత పదేళ్లు మిన్నకుండిన వస్తాదులు ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారంటూ నిలదీశారు.

తమపై లైంగికవేధింపులకు పాల్పడిన వారిపై పోలీసు కేసు పెట్టకుండా ఎందుకు బజారున పడి అల్లరి చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా ఓ పారిశ్రామిక వేత్త పన్నిన కుట్రలో మహిళావస్తాదులు పావులుగా మారారంటూ ఆరోపించారు.

First Published:  19 Jan 2023 6:25 AM GMT
Next Story