Telugu Global
Sports

తొలిటెస్టులో అశ్విన్ స్పిన్... భారత్ ఇన్నింగ్స్ విన్!

ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ వేటను రెండుసార్లు రన్నరప్ భారత్ ఇన్నింగ్స్ విజయంతో మొదలు పెట్టింది. అశ్విన్ స్పిన్ మ్యాజిక్ తో మూడురోజుల్లోనే వెస్టిండీస్ ను చిత్తు చేసింది.

తొలిటెస్టులో అశ్విన్ స్పిన్... భారత్ ఇన్నింగ్స్ విన్!
X

ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ వేటను రెండుసార్లు రన్నరప్ భారత్ ఇన్నింగ్స్ విజయంతో మొదలు పెట్టింది. అశ్విన్ స్పిన్ మ్యాజిక్ తో మూడురోజుల్లోనే వెస్టిండీస్ ను చిత్తు చేసింది....

ఐసీసీ టెస్టు లీగ్ ( 2023- 2025 )లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ ను భారత్ ఇన్నింగ్స్ విజయంతో మొదలుపెట్టింది. డోమనికాలోని విండ్సర్ పార్క్ వేదికగా జరుగుతున్న ఐదురోజుల తొలిటెస్టు మూడోరోజుఆటలోనే భారత్ ఇన్నింగ్స్ 141 పరుగులతో కరీబియన్ టీమ్ ను ఊదిపారేసింది.

తొలిఇన్నింగ్స్ లో ఆతిథ్య వెస్టిండీస్ ను 150 పరుగులకే ఆలౌట్ చేయడంలో ప్రధానపాత్ర వహించిన స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ రెండోఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టడం ద్వారా తనజట్టును మూడురోజుల్లోనే విజేతగా నిలుపగలిగాడు.

అశ్విన్, యశస్వీ షో....

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో అట్టడుగుకు పడిపోయిన వెస్టిండీస్ తో జరిగిన తొలిటెస్టులో భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్ 12 వికెట్లతో విశ్వరూపం ప్రదర్శిస్తే..21 ఏళ్ళ వయసులోనే టెస్టు అరంగేట్రం చేసిన 21 సంవత్సరాల యశస్వీ జైశ్వాల్ 171 పరుగులతో చెలరేగిపోయాడు.

భారత టెస్టు చరిత్రలో అరంగేట్రం టెస్టులోనే 150కి పైగా పరుగులు సాధించిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. గతంలో శిఖర్ ధావన్ 187, రోహిత్ శర్మ 177 పరుగులు సాధించగా..ఇప్పుడు యశస్వి 171 పరుగులతో వారి సరసన చేరాడు.

బౌలింగ్ లో అశ్విన్, బ్యాటింగ్ లో యశస్వీ అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో భారత్ కేవలం మూడురోజుల ఆటలోనే కరీబియన్ టీమ్ ను చిత్తు చేయగలిగింది.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో తొన తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 5 వికెట్లకు 421 పరుగుల స్కోరుతో డిక్లేర్ చేసింది. యశస్వి 171 పరుగులు, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ 76 పరుగుల స్కోర్లు సాధించారు.

ఇన్నింగ్స్ ఓటమి తప్పాలంటే 272 పరుగులు చేయాల్సిన కరీబియన్ టీమ్ రెండోఇన్నింగ్స్ లో 130 పరుగులకే కుప్పకూలిపోయింది. విండీస్ టాపార్డర్లో అలెక్ అత్నాజే 44 బంతుల్లో 28 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ బ్రాత్ వెయిట్ 7,తేజ్ నారాయణ్ చంద్రపాల్ 7 పరుగుల స్కోర్లకే వెనుదిరిగారు. భారత స్పిన్ జోడీ అశ్విన్ 7 వికెట్లు, జడేజా 3 వికెట్లతో మ్యాచ్ ను ఏకపక్షంగా ముగించారు.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన యువబ్యాటర్ యశస్వి జైశ్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

రెండుఇన్నింగ్స్ లోనూ 5 వికెట్ల అశ్విన్...

రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు..మొత్తం టెస్టులో 12 వికెట్లతో టాపర్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ కు 5 వికెట్ల చొప్పున అశ్విన్ ఇప్పటి వరకూ 34సార్లు పడగొట్టడం విశేషం. రెండు ఇన్నింగ్స్ లోనూ ఐదేసి వికెట్లు సాధించడం అశ్విన్ కెరియర్ లో ఇది 6వసారి. మ్యాచ్ కు 10 వికెట్లు చొప్పున అశ్విన్ 8 టెస్టుల్లో ఈ ఘనత సంపాదించాడు.

ఓ బ్యాట్స్ మన్ సెంచరీ కొట్టడం ఎలాంటిదో..ఓ బౌలర్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం సెంచరీ సాధించడం లాంటిదే.

వెస్టిండీస్ పై భారత్ కు 23వ గెలుపు...

గత 21 సంవత్సరాలుగా వెస్టిండీస్ చేతిలో టెస్టు ఓటమి లేని భారత్ కు ఇది 23వ విజయం కావడం విశేషం. సిరీస్ లోని ఆఖరి టెస్టు జులై 20నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగనుంది. భారత్- వెస్టిండీస్ జట్ల నడుమ ఇప్పటి వరకూ జరిగిన 99 టెస్టుల్లో అత్యధిక విజయాల రికార్డు కరీబియన్ జట్టు పేరుతోనే ఉంది.

ప్రస్తుత సిరీస్ లోని ఆఖరిటెస్టే..ఈ రెండుజట్ల నడుమ 100వ టెస్టు కానుంది.

First Published:  15 July 2023 11:09 AM GMT
Next Story