Telugu Global
Sports

బార్బోడోస్ బీచ్ లో భారత క్రికెటర్ల సందడి!

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు సభ్యులు కరీబియన్ దేశం బార్బోడోస్ లో సందడి సందడి చేస్తున్నారు.

బార్బోడోస్ బీచ్ లో భారత క్రికెటర్ల సందడి!
X

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు సభ్యులు కరీబియన్ దేశం బార్బోడోస్ లో సందడి సందడి చేస్తున్నారు. వెస్టిండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు సన్నాహాలలో తలమునకలై ఉన్నారు....

వెస్టిండీస్ పర్యటనకు రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సన్నాహాలు ప్రారంభించింది. ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో పాల్గొన్న తర్వాత లభించిన 20 రోజుల విరామం తర్వాత..తిరిగి క్రికెట్ సిరీస్ సన్నాహాలు మొదలు పెట్టారు.

వివిధ దేశాలలో తమ కుటుంబసభ్యులతో సేద దీరుతున్న భారతజట్టు సభ్యులంతా జులై 3 నాటికి కరీబియన్ ద్వీపాలలోని బార్బోడోస్ చేరుకోవాలని బీసీసీఐ ఆదేశించడంతో..టెస్టు , వన్డే సిరీస్ జట్లకు ఎంపికైన ఆటగాళ్లంతా హాజరయ్యారు.


పారిస్ లో శుభ్ మన్, లండన్ లో విరాట్, రోహిత్...

ఏడాది పొడుగునా విశ్రాంతి లేకుండా క్రికెట్ సిరీస్ లు, టోర్నీలు ఆడే భారత క్రికెటర్లకు అనుకోకుండా 20 రోజుల విరామంతో పాటు విశ్రాంతి దొరికింది. తమతమ కుటుంబసభ్యులతో విహారయాత్రలకు వెళ్ళిన క్రికెటర్లు బోర్డు సూచనతో విండీస్ పర్యటనకు తరలి వచ్చారు.

గత కొద్దిరోజులుగా పారిస్ లో సేదతీరుతున్న యువఆటగాడు శుభ్ మన్ గిల్, లండన్ మీదుగా విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ బార్బొడోస్ చేరుకొన్నారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వైస్ కెప్టెన్ అజంక్యా రహానే, ఇషాన్ కిషన్ తో పాటు మిగిలిన ఆటగాళ్లంతా ముంబై నుంచే కరీబియన్ సిరీస్ కోసం చేరుకొన్నారు. బార్బోడోస్ వేదికగా సన్నాహక శిబిరం...

వెస్టిండీస్ తో జులై 12 నుంచి జరుగనున్న రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్, మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్, ఆ తర్వాత జరిగే 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ కు సన్నాహాలను భారతజట్టు కరీబియన్ దేశం బార్బోడోస్ నుంచి ప్రారంభించింది.

ముంబై నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి బార్బోడోస్ చేరుకొన్న భారతజట్టు సభ్యులంతా జెట్ ల్యాగ్ తో ఇబ్బంది పడుతూ ఉండటంతో..క్రికెట్ ప్రాక్టీస్ ను పక్కన పెట్టి..బీచ్ వాలీబాల్ మ్యాచ్ ను బీసీసీఐ ఏర్పాటు చేసింది.

కరీబియన్ సముద్రతీరంలో జరిగిన ఈ సరదాసరదా బీచ్ వాలీబాల్ మ్యాచ్ లో చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, విరాట్ కొహ్లీ, అజింక్యా రహానే, అశ్విన్ లతో సహా మిగిలిన ఆటగాళ్లంతా పాల్గొన్నారు. యువవికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వీడియోలు తీస్తూ సందడి సందడి చేశాడు.కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పాల్గొన్నాడు.

తొలిటెస్టులో పాల్గొనటానికి ముందు భారతజట్టు సభ్యులు వారంరోజులపాటు నిర్వహించే కండిషనింగ్ క్యాంప్ లో పాల్గొంటున్నారు.

12 నుంచి రెండుమ్యాచ్ ల టెస్టు లీగ్...

ఐసీసీ టెస్టు (2023-25 ) లీగ్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగే రెండుమ్యాచ్ ల సిరీస్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు తలపడనుంది. సిరీస్ లోని

తొలిటెస్టు మ్యాచ్ జులై 12 నుంచి డోమనికా రిపబ్లిక్ లోని విండ్సర్ పార్క్ వేదికగా జరుగనుంది.

సిరీస్ లోని రెండోటెస్టును జులై 20 నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా నిర్వహిస్తారు. జులై 27 నుంచి తీన్మార్ వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.

సిరీస్ లోని తొలివన్డేకి బార్బోడోస్ లోని బ్రిడ్జ్ టౌన్ కెన్సింగ్టన్ ఓవల్ గ్రౌండ్స్ ఆతిథ్యమివ్వనుంది. జులై 29న రెండోవన్డేను సైతం బ్రిడ్జ్ టౌన్ వేదికగానే నిర్వహిస్తారు.

సిరీస్ లోని ఆఖరి వన్డేను ట్రినిడాడ్ లోని బ్రియన్ లారా స్టేడియం వేదికగా ఆగస్టు 1న జరుగనుంది.

ఇవీ భారత టెస్టు, వన్డే జట్లు....

రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న టెస్టుజట్టులోని ఆటగాళ్లలో శుభ్ మన్ గిల్, రితురాజ్ గయక్వాడ్, విరాట్ కొహ్లీ, యశస్వి జైశ్వాల్, అజింక్యా రహానే ( వైస్ కెప్టెన్ ), కెఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ ఉన్నారు.

తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తిరిగి చోటు దక్కించుకొన్నాడు.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టులో శుభ్ మన్ గిల్, రితురాజ్ గయక్వాడ్, విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా ( వైస్ కెప్టెన్ ), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్ ఉన్నారు.

సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లను ఎంపిక సంఘం పక్కనపెట్టింది. యువపేసర్ ముకేశ్ కుమార్ కు టెస్టు, వన్డే జట్లలో అవకాశమిచ్చింది.

సిరీస్ కు ముగింపుగా జరిగే 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టును ఆ తరువాత బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించనుంది.

First Published:  4 July 2023 8:00 PM GMT
Next Story