Telugu Global
Sports

భారత కాబోయే కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్?

మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్ భారతజట్టుకు చీఫ్ కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

భారత కాబోయే కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్?
X

భారత కాబోయే కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్?

మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్ భారతజట్టుకు చీఫ్ కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహుల్ ద్రావిడ్ తర్వాత లక్ష్మణే ప్రధాన శిక్షకుడు కావడం తథ్యమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి....

ప్రపంచ క్రికెట్లో అత్యంత సవాలు తో కూడిన పదవుల్లో భారత క్రికెట్ చీఫ్ కోచ్ ను కూడా చెప్పుకోవాలి. భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా ఎవరున్నా అది ముళ్ళకిరీటం లాంటిదే.

గతంలో గ్యారీ కిర్ స్టెన్, జాన్ రైట్ , గ్రెగ్ చాపెల్ లాంటి పలువురు విదేశీ శిక్షకులు భారత చీఫ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తించినా.. మేడిన్ ఇండియా కోచ్ అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి ల తర్వాత నుంచి స్వదేశీ శిక్షకుల వైపే మొగ్గు చూపడం మొదలయ్యింది.

ప్రధానంగా రవిశాస్త్రి శిక్షకునిగా భారతజట్టు అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలువగలిగింది. రవిశాస్త్రి కాంట్రాక్టు ముగియడంతోనే...మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కోచ్ గా పగ్గాలు చేపట్టారు.

వ్యక్తిగత కారణాలతో రాహుల్ ద్రావిడ్ అందుబాటులో లేని సమయంలో జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా భారతజట్టు కోచ్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

న్యూజిలాండ్ టూర్ కోచ్ గా లక్ష్మణ్..

న్యూజిలాండ్ లో ప్రస్తుతం పర్యటిస్తున్న భారతజట్టుకు ప్రధాన శిక్షకుడుగా లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. గత కొద్దిమాసాలుగా ప్రపంచకప్ టోర్నీ కోసం విశ్రాంతి లేకుండా పనిచేసిన చీప్ కోచ్ ద్రావిడ్ బృందం విశ్రాంతి తీసుకోడంతో..నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్ గడ్డపై న్యూజిలాండ్ తో జరిగే మూడుమ్యాచ్ ల వన్డే, టీ-20 సిరీస్ ల్లో తలపడే హార్ధిక్ పాండ్యా , శిఖర్ ధావన్ ల నాయకత్వంలోని భారతజట్లకు లక్ష్మణ్ కోచ్ గా సేవలు అందించనున్నాడు.

ఇదే మొదటిసారి కాదు...

భారతజట్టుకు చీఫ్ కోచ్ గా సేవలు అందించడం లక్ష్మణ్ కు ఇదే మొదటిసారి కాదు. గతంలో జింబాబ్వే, ఐర్లాండ్ టూర్లలో భారతజట్టుకు కోచ్ గా లక్ష్మణ్ సేవలు అందించాడు. కోవిడ్ తో ద్రావిడ్ జట్టుకు దూరమైన సమయంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 సిరీస్ లో సైతం లక్ష్మణే బాధ్యతలు నిర్వర్తించాడు.

భారతజట్టు కెప్టెన్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యాలతో కలసి పనిచేస్తున్న లక్ష్మణ్ రానున్నకాలంలో ...రాహుల్ ద్రావిడ్ తరువాత పూర్తిస్థాయి శిక్షకుడిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

భారత చీఫ్ కోచ్ గా పనిచేసినవారికి బీసీసీఐ ఏడాదికి 7 కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.

First Published:  17 Nov 2022 4:19 AM GMT
Next Story