Telugu Global
Sports

వన్డే ప్రపంచకప్ లో రికార్డుల వెల్లువ!

భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు రికార్డుల మోతతో సాగిపోతున్నాయి.

వన్డే ప్రపంచకప్ లో రికార్డుల వెల్లువ!
X

భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు రికార్డుల మోతతో సాగిపోతున్నాయి. చెన్నై వేదికగా భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల మధ్య ముగిసిన మ్యాచ్ లో అరడజను సరికొత్త రికార్డులు నమోదయ్యాయి..

2023 -ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లండ్, శ్రీలంకపై దక్షిణాఫ్రికా పలు అరుదైన రికార్డులు నమోదు చేస్తే..చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రపంచ నంబర్ వన్ భారత్, ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్ర్రేలియాజట్ల నడుమ ముగిసిన మ్యాచ్ లో అరడజనుకు పైగా సరికొత్త రికార్డులు వచ్చి చేరాయి.

విరాట్ రికార్డుల హోరు...

ప్రపంచకప్ లో గత కొన్ని సంవత్సరాలుగా మాస్టర్ సచిన్ టెండుల్కర్, ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరుతో ఉంటూ వచ్చిన పలు రికార్డులు తెరమరుగయ్యాయి. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ బ్యాటింగ్ లో మాత్రమే కాదు..ఫీల్డింగ్ లోనూ కొత్త రికార్డులు సాధించాడు.

వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తరపున వన్ డౌన్ స్థానంలో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయిని చేరిన మొనగాడిగా విరాట్ కొహ్లీ అవతరించాడు. రికీ పాంటింగ్ పేరుతో ఉన్న రికార్డును విరాట్ అధిగమించాడు.

వన్ డౌన్ స్థానంలో 330 ఇన్నింగ్స్ ఆడి రికీ పాంటింగ్ సాధించిన 12662 పరుగుల రికార్డును విరాట్ కొహ్లీ కేవలం 215 ఇన్నింగ్స్ లోనే అధిగమించాడు. అతితక్కువ ఇన్నింగ్స్ లో అత్యంత వేగంగా 11వేల పరుగులు సాధించిన బ్యాటర్ గా విరాట్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

సచిన్ ను మించిన విరాట్ ...

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ పేరుతో ఉంటూ వచ్చిన రికార్డును విరాట్ కొహ్లీ అధిగమించాడు.

సచిన తన కెరియర్ లో 61 ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడి కేవలం 58 ఇన్నింగ్స్ లోనే సాధించిన 2,719 పరుగుల రికార్డును విరాట్ 64 ఇన్నింగ్స్ లో 2780 పరుగులతో అధిగమించాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ 64 ఇన్నింగ్స్ లో 2, 422 పరుగుల స్కోరుతో విరాట్, సచిన్ తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నాడు.

క్యాచ్ ల్లో విరాట్ రికార్డు..

ఆస్ట్ర్రేలియా ఓపెనర్ షాన్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోడం ద్వారా విరాట్ కొహ్లీ అత్యధిక ప్రపంచకప్ క్యాచ్ లు పట్టిన భారత ఫీల్డర్ గా నిలిచాడు. తన కెరియర్ లో మూడో వన్డే ప్రపంచకప్ ఆడుతున్న విరాట్ మొత్తం 15 క్యాచ్ లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకూ 14 క్యాచ్ లతో భారత మాజీకెప్టెన్ అనీల్ కుంబ్లే పేరుతో అత్యధిక ప్రపంచకప్ క్యాచ్ ల రికార్డు ఉంది. కపిల్ దేవ్ 12, సచిన్ టెండుల్కర్ 12, వీరేంద్ర సెహ్వాగ్ 11, మహ్మద్ అజరుద్దీన్ 11 క్యాచ్ లతో ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలసి ఇప్పటి వరకూ విరాట్ 305 క్యాచ్ లు పట్టాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక క్యాచ్ లు పట్టిన రాహుల్ ద్రావిడ్ ప్రపంచ రికార్డును అధిగమించాలంటే విరాట్ మరో 30 క్యాచ్ లు పట్టాల్సి ఉంది.

రాహుల్- విరాట్ జోడీ రికార్డు....

ఆస్ట్ర్రేలియాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో విరాట్- రాహుల్ జోడీ నాలుగో వికెట్ కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.

రాహుల్ 97 పరుగుల నాటౌట్ స్కోరు, విరాట్ 85 పరుగుల స్కోరు సాధించడం ద్వారా ఈ రికార్డు సాధించగలిగారు.

ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా భారత్ కు ఇదే నాలుగోవికెట్ కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.

1999 ప్రపంచకప్ లో ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాపైన అజయ్ జడేజా- రాబిన్ సింగ్ జోడీ సాధించిన 141 పరుగుల భాగస్వామ్యమే గత 24 సంవత్సరాలుగా

అత్యధిక భాగస్వామ్య రికార్డుగా ఉంటూ వచ్చింది.

ఓల్డెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ...

2023 ప్రపంచకప్ లో తన తొలి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ తో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల్లో చేరాడు. 36 సంవత్సరాల 161 రోజుల వయసులో ప్రపంచకప్ లో భారత్ కు నాయకత్వం వహించిన సారథిగా నిలిచాడు.

మహ్మద్ అజరుద్దీన్ 36 సంవత్సరాల 124 రోజుల వయసులోనూ, రాహుల్ ద్రావిడ్ 34 సంవత్సరాల 71 రోజుల వయసులోనూ, శ్రీనివాస వెంకట్రాఘవన్ 34 సంవత్సరాల 56 రోజుల వయసులోనూ, మహేంద్ర సింగ్ ధోనీ 33 సంవత్సరాల 262 రోజుల వయసులోనూ భారత ప్రపంచకప్ జట్లకు నాయకత్వం వహించారు.

వార్నర్, స్టార్క్ రికార్డులు..

భారత్ తో జరిగిన ప్రారంభమ్యాచ్ లో 41 పరుగుల స్కోరు సాధించడం ద్వారా ఆస్ట్ర్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్..అత్యంత వేగంగా ప్రపంచకప్ టోర్నీలో 1000 పరుగులు సాధించిన బ్యాటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న ఈ రికార్డును వార్నర్ అధిగమించాడు. వార్నర్ 52 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగుల స్కోరుకు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

ఇక బౌలింగ్ లో...కంగారూ మెరుపు ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ ప్రపంచకప్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ ను డకౌట్ గా పడగొట్టడం ద్వారా స్టార్క్ ప్రపంచకప్ లో వికెట్ల హాఫ్ సెంచరీని అందుకొన్నాడు. ప్రపంచకప్ లో 50 కి పైగా వికెట్లు పడగొట్టిన దిగ్గజ బౌలర్లలో వసీం అక్రం ( 55), లాసిత్ మలింగ (56 ), ముత్తయ్య మురళీధరన్ ( 68), గ్లెన్ మెక్ గ్రాత్ ( 71) ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో స్టార్క్ నిలిచాడు.

First Published:  10 Oct 2023 4:36 AM GMT
Next Story