Telugu Global
Sports

నాలా బాదే బ్యాటరే లేడా-వీరూ సందేహం!

ప్రస్తుత భారత క్రికెట్లో తనలా వీరబాదుడు బాదే బ్యాటరే కనిపించడం లేదంటూ ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు..

నాలా బాదే బ్యాటరే లేడా-వీరూ సందేహం!
X

ప్రస్తుత భారత క్రికెట్లో తనలా వీరబాదుడు బాదే బ్యాటరే కనిపించడం లేదంటూ ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు....

భారత క్రికెట్ ను.. తన వీరబాదుడు బ్యాటింగ్ తో కొత్తపుంతలు తొక్కించిన మాజీ ఓపెనర్, దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా,విమర్శకుడిగా, విశ్లేషకుడిగా కూడా తనదైన శైలిలో రాణిస్తున్నాడు.

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా తొలిబంతి నుంచే పూనకం వచ్చినట్లు బ్యాటింగ్ చేస్తూ పరుగుల మోత మోగించడంలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాతే ఎవరైనా.

మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్ గా...

భారత జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా తన ప్రస్థానం ప్రారంభించి..చివరకు ఓపెనర్ గా రాణించిన వీరేంద్ర సెహ్వాగ్ కు ఎటాకింగ్ ఓపెనర్ గా పేరుంది. మాస్టర్ సచిన్ టెండుల్కర్ తో కలసి బ్లాస్టర్ వీరేంద్ర సెహ్వాగ్ కు పలు చిరస్మరణీయమైన భాగస్వామ్యాలు నమోదు చేసిన అసాధారణ రికార్డు సైతం ఉంది.

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఆట మొదటి రోజు లంచ్ విరామానికి ముందే మెరుపువేగంతో సెంచరీ బాదడంలో తనకు తానే సాటిగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్ కు డబుల్, ట్రిపుల్ సెంచరీలు సాధించడం బ్యాటుతో అబ్బిన విద్యగా మారిపోయింది.

104 టెస్టులు...251 వన్డేలు..16వేలకు పైగా పరుగులు..

2013 మార్చి నెలలో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా తన చిట్టచివరి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన వీరూ కమ్ వీరేంద్ర సెహ్వాగ్ కు 104 టెస్టుల్లో 8వేల 586 పరుగులు, 251 వన్డేలలో 8వేల 273 పరుగులు, 19 టీ-20 మ్యాచ్ ల్లో 394 పరుగులు సాధించిన అసాధారణ రికార్డు ఉంది.

తనదైన రోజున వీరబాదుడు బాదుతూ ..ప్రత్యర్థిజట్ల బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించగల మొనగాడిగా, ఒంటిచేత్తో మ్యాచ్ లు గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడిగా వీరూ తర్వాతే ఎవరైనా.

వీరూ క్రీజులో ఉన్నాడంటే ఏదైనా సాధ్యమే అన్న విశ్వాసంతో ఆరోజుల్లో భారతజట్టులో ఉండేది. అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత..అదే స్థాయి బ్యాటర్ మరొకరు భారత క్రికెట్లో కనిపించడం లేదు.

ఆ ఇద్దరికీ వీరూ కితాబు..

ప్రస్తుత భారత క్రికెట్లో వీరబాదుడు బ్యాటర్లు ఏమాత్రం కనిపించడం లేదని, తనలా ఆడే ఓపెనర్లు, హిట్టర్లు భూతద్దం పెట్టి వెతికినా లేరని వీరూ వ్యాఖ్యానించాడు. అయితే..

తన బ్యాటింగ్ శైలిలోనే ఆడే నవతరం ఆటగాళ్లలో రిషభ్ పంత్, పృథ్వీ షాల గురించే ముందుగా చెప్పుకోవాలని అన్నాడు.

క్రీజులోకి అడుగుపెట్టిన వెంటనే బౌలర్ ఎవరన్నది చూడకుండా విరుచుకు పడే లక్షణం, తెగువ ప్రస్తుత తరం బ్యాటర్లలో రిషభ్ పంత్ , పృథ్వీషాలలో తనకు కనిపిస్తోందని..తనకు 200 లేదా 300 స్కోర్లు సాధిస్తేకానీ పరుగుల దాహం తీరేది కాదని..అయితే..రిషభ్ పంత్, పృథ్వీ షా మాత్రం 80 లేదా 90 లేదా సెంచరీలతో సంతృప్తి పడిపోతున్నారంటూ వీరూ చెప్పుకొచ్చాడు.

క్రికెటర్లకు వెయిట్ లిఫ్టింగ్ తో పనేంటి?

నేటితరం క్రికెటర్లు తరచూ గాయాలతో ఆటకు దూరమవుతున్నారని, కీలక సిరీస్ ల్లో జట్టుకు అందుబాటులో లేకుండా పోడం తనకు ఆందోళన కలిగిస్తోందని వీరూ అన్నాడు.

వెన్నెముక, భుజం, మోకాలిగాయాలు తరచూ ఎందుకవుతున్నాయో తనకు అర్థంకావడం లేదని, తమ రోజుల్లో 200 టెస్టులు ఆడిన సచిన్ కానీ, రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్, ధోనీ, ఆకాశ్ చోప్రా లేదా మరే క్రికెటరూ గాయాలతో జట్టుకు దూరంకాలేదని గుర్తు చేశాడు.

నేటితరం క్రికెటర్లు తమ ఆటతీరుతో కాకుండా కండలు పెంచిన శరీరంతో అభిమానులను సంపాదించుకోడానికి తహతహలాడుతున్నారని, క్రికెటర్లకు అసలు వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు.

క్రికెటర్లు క్రికెట్ కు సంబంధించిన వ్యాయామం చేయకుండా..వెయిట్ ట్రైనింగ్ చేస్తూ లేనిపోని గాయాలు కొనితెచ్చుకొంటున్నారని చురకలంటించాడు.

వెయిట్ లిఫ్టింగ్ బలమైన శరీరాన్ని ఇవ్వగలదుకానీ..క్రికెట్ నైపుణ్యాన్ని కాదని వీరూ తేల్చి చెప్పాడు. సూటిగా, నిర్భయంగా మాట్లాడటంలో, వ్యాఖ్యానించడంలో వీరూ

ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నాడు.

First Published:  21 March 2023 5:20 AM GMT
Next Story