Telugu Global
Sports

గిరాకీ లేని భారత క్రికెట్ సెలెక్టర్ పోస్టులు!

బీసీసీఐ సరికొత్త సెలెక్టర్ ఎవరో..కొత్త చీఫ్ సెలెక్టర్ ఎవ్వరో ..మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.

గిరాకీ లేని భారత క్రికెట్ సెలెక్టర్ పోస్టులు!
X

గిరాకీ లేని భారత క్రికెట్ సెలెక్టర్ పోస్టులు!

భారత క్రికెట్ జట్లను ఎంపిక చేసే సెలెక్టర్ పోస్టులకు రానురాను డిమాండ్ తగ్గిపోతోంది. సెలెక్టర్ పదవా..బాబోయ్ అనేవారు ఎక్కువైపోయారు.

ప్రపంచ క్రికెట్ ఖజానా భారత్ లో ఈ క్రీడకు ఉన్నంత క్రేజు అంతాఇంతాకాదు. దేశంలో ఎన్నిరకాల క్రీడలున్నా క్రికెట్టే లోకంగా భావించే పిచ్చిఅభిమానులు భారత్ లో మాత్రమే ఎక్కువమంది ఉన్నారు.

భారతజట్ల ఎంపిక నుంచి..ఆటగాళ్ల ఆటతీరు వరకూ విశ్లేషించే అభిమానులు కోకొల్లలు. అంతర్జాతీయ సిరీస్ ల నుంచి ప్రపంచకప్ టోర్నీల వరకూ భారతజట్లను ఎంపిక చేయడం అసలు సిసలు సవాలే. లాలా అమర్ నాథ్, రాజ్ సింగ్ దుంగర్ పూర్, ఎంఎల్ జైసింహా, గుండప్ప విశ్వనాథ్, దిలీప్ వెంగ్ సర్కార్ లాంటి దిగ్గజాలు సెలెక్టర్లుగా, సెలెక్షన్ కమిటీ చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఆయా పదవులు, బాధ్యతలకే వన్నెతెచ్చారు.

అయితే..ఎమ్మెస్కే ప్రసాద్, చేతన్ శర్మ లాంటి మాజీలు ఎంపిక సంఘం చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సెలెక్షన్ కమిటీల ప్రతిష్ట మసకబారుతూ వస్తోంది.

సెలెక్టర్ లేదా చీఫ్ సెలెక్టర్ పోస్టుల్లో చేరటానికి అర్హులైన మాజీ క్రికెటర్లు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.

ఆదాయం తక్కువ- బాధ్యతలు ఎక్కువ!

కాయలు కాసే చెట్లకే రాళ్ళదెబ్బలు అన్నమాట భారత క్రికెట్ ఎంపిక సంఘం సభ్యులకు అతికినట్లు సరిపోతుంది. దేశంలోని వివిధ జోన్లకు ప్రాతినిథ్యం వహించే మొత్తం ఐదుగురు సభ్యుల ఎంపిక సంఘం బాధ్యతలు అన్నీఇన్నీకావు. దేశవ్యాప్తంగా జరిగే దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లకు హాజరు కావటం, ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించడం, వారి ఆటతీరుతో పాటు..ప్రతిభాపాటవాలను నిశితంగా గమనించడం, సత్తా చాటుకోడానికి తగిన అవకాశాలు కల్పించడం ద్వారా భారతజట్టులో చోటు కల్పించడం సెలెక్టర్ల విధి.

అయితే..సెలెక్షన్ కమిటీ సభ్యులు తమ ప్రాంతం వారికి, తమకు నచ్చినవారికే పెద్దపీట వేస్తారని, ఆశ్రితపక్షపాతం ఎక్కువేనన్న విమర్శలు గతంలో ఎక్కువగా ఉండేవి.

కెప్టెన్, కోచ్ ల ప్రమేయం ఎక్కువకావడంతో ఎంపిక సంఘం పాత్ర రానురాను నామమాత్రంగా మారుతూ వస్తోంది.

సెలెక్టర్ వేతనం 90 లక్షలే....

భారత క్రికెట్లో వివిధ రకాలుగా బాధ్యతలు నిర్వరించేవారు ఏడాదికే కోట్ల రూపాయల మేర కాంట్రాక్టు వేతనం అందుకొంటున్నారు. భారత క్రికెట్ అగ్రశ్రేణి ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఏడాదికి 7 కోట్ల రూపాయలు వేతనంగా అందుకొంటుంటే..భారత చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ సైతం 7 కోట్ల రూపాయలకు పైనే ఆర్జిస్తున్నారు.

అదే భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా పనిచేసే వారి వేతనం కేవలం కోటి రూపాయలు మాత్రమే. అదే..సెలెక్టర్ల వేతనం మాత్రం ఏడాదికి 90 లక్షల రూపాయలుగా మాత్రమే ఉంది.

కామెంటీటర్లుగా పనిచేస్తున్న మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్ సైతం 5 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే..బాధ్యతలు నిర్వర్తిస్తూ, విమర్శలు భరిస్తున్న సెలెక్టర్ల వేతనాలు మాత్రమే అరకొరగా ఉన్నాయి. దీంతో..అర్హులైన పలువురు మాజీ క్రికెటర్లు సెలెక్టర్ల బాధ్యతలంటే భయపడి పారిపోతున్నారు.

చీఫ్ సెలెక్టర్ లేకుండానే.....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ గత కొద్దిమాసాలుగా చీఫ్ సెలెక్టర్ లేకుండానే నెట్టుకొంటూ వస్తోంది. చీఫ్ సెలెక్టర్ గా ఉన్న చేతన్ శర్మ రాజీనామా చేయటంతో ఆ పోస్టు గత కొద్ది నెలలుగా భర్తీ కాకుండా వస్తోంది. సెలెక్టర్లలో ఒకరైన మాజీ ఓపెనర్ శివసుందర్ దాస్ తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

వెస్టిండీస్ పర్యటన కోసం భారత టెస్టు, వన్డే జట్లను చీఫ్ సెలెక్టర్ లేకుండానే బోర్డు ఎంపిక చేయటం విశేషం. మరోవైపు..చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

చీఫ్ సెలెక్టర్ రేసులో సెహ్వాగ్..!

ఖాళీగా ఉన్న బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పోస్టును భర్తీ చేయాలని బోర్డు నిర్ణయించింది. పురుషుల సెలెక్షన్ కమిటీలోని ఓ సెలెక్ట‌ర్ పోస్టుకు మాత్రమే ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. చేత‌న్ శ‌ర్మ గత ఫిబ్ర‌వ‌రిలో రాజీనామా చేయ‌డంతో అప్ప‌టి నుంచి చైర్మ‌న్ పోస్ట్ ఖాళీగా ఉంది. స‌భ్యుల‌లో ఒక‌రైన శివ‌సుంద‌ర్ దాస్ తాత్కాలిక‌గా చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నాడు.

అర్హులైన, ఆస‌క్తి కలిగిన అభ్య‌ర్థులు జూన్ 30వ తేదీ సాయంత్రం 6 గంట‌ల లోగా సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చునని బీసీసీఐ తెలిపింది. అభ్య‌ర్థుల‌కు ఉండాల్సిన అర్హ‌త‌ల‌ను నోటిఫికేష‌న్‌లో స్ప‌ష్టంగా పేర్కొంది. అయితే.. చైర్మ‌న్ ప‌దవి కోసం మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పోటీలో ఉన్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మరోవైపు..తనను ఎవ్వరూ సంప్రదించలేదని వీరూ తేల్చి చెప్పాడు. ప్ర‌స్తుతం పురుషుల సెలెక్ష‌న్ క‌మిటీలో శివ సుంద‌ర్ దాస్, సుబ్రతో బెన‌ర్జీ, స‌లీల్ అంకోలా, శ్రీ‌ధ‌ర‌న్ శ‌ర‌త్ స‌భ్యులుగా ఉన్నారు.

సెలెక్టర్లకు అర్హ‌త‌లు ఇవే..

సెలెక్ట‌ర్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసేవాళ్ల‌కు ఉండాల్సిన‌ అర్హ‌త‌లు – క‌నీసం ఏడు టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం ఉండితీరాలి. లేదంటే 10 వ‌న్డేలు, 20 టీ-20 మ్యాచ్‌లు ఆడినా స‌రిపోతుది. అంతేకాదు.. గ‌డువు తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుదారులు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు మించ‌కూడ‌దు. అలాగే.. బీసీసీఐ నియ‌మావ‌ళి ప్ర‌కారం వాళ్లు మ‌రే ఇత‌ర క్రికెట్ క‌మిటీలోనూ 5 ఏళ్ల‌కు మించి సభ్యులుగా ఉండ‌రాదు. రెండు రోజుల క్రిత‌మే మ‌హిళ‌ల సీనియ‌ర్, జూనియ‌ర్ జ‌ట్ల‌కు సెలెక్ట‌ర్ల ఎంపిక తంతును పూర్తి చేశారు. నీతూ డేవిడ్ ఆధ్వ‌ర్యంలోని బృందం మాజీ క్రికెట‌ర్ శ్యామా దే షాను సీనియ‌ర్ జ‌ట్టుకు సెలెక్ట‌ర్‌గా, జూనియ‌ర్ జ‌ట్టు సెలెక్ష‌న్ క‌మిటీకి చీఫ్‌గా వీఎస్ తిల‌క్ నాయుడును నియ‌మించింది.

బీసీసీఐ సరికొత్త సెలెక్టర్ ఎవరో..కొత్త చీఫ్ సెలెక్టర్ ఎవ్వరో ..మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.

First Published:  23 Jun 2023 4:46 PM GMT
Next Story