Telugu Global
Sports

ప్రపంచకప్ లో విరాట్, సూర్య రికార్డులు!

ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగిన 2022 టీ-20 ప్రపంచకప్ టోర్నీ పలు సంచలనాలు, అరుదైన రికార్డులతో ముగిసింది. మాజీ చాంపియన్ భారత్ సెమీఫైనల్లో ఓడినా స్టార్ బ్యాటర్లు విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్ చెరో రికార్డును సొంతం చేసుకోగలిగారు.

ప్రపంచకప్ లో విరాట్, సూర్య రికార్డులు!
X

ప్రపంచకప్ లో విరాట్, సూర్య రికార్డులు!

ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగిన 2022 టీ-20 ప్రపంచకప్ టోర్నీ పలు సంచలనాలు, అరుదైన రికార్డులతో ముగిసింది. మాజీ చాంపియన్ భారత్ సెమీఫైనల్లో ఓడినా స్టార్ బ్యాటర్లు విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్ చెరో రికార్డును సొంతం చేసుకోగలిగారు...

కంగారూగడ్డపై గత మూడువారాలుగా సాగిన 2022 టీ-20 ప్రపంచకప్ అనూహ్యఫలితాలు, పలు సంచలనాలు, అరుదైన రికార్డులతో ముగిసింది. టీ-20 రెండోర్యాంకర్ ఇంగ్లండ్ 12 సంవత్సరాల విరామం తర్వాత రెండోసారి ఐసీసీ ట్రోఫీ అందుకోడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకొంటే...మాజీ చాంపియన్ పాకిస్థాన్ మరోసారి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఫేవరెట్లు ఫట్..డార్క్ హార్స్ హిట్...

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు...ఆతిథ్య ఆస్ట్ర్రేలియా, టాప్ ర్యాంకర్ భారత్, పాకిస్థాన్ హాట్ ఫేవరెట్ జట్లుగా నిలిచాయి. అయితే..ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేయటం ద్వారా 2010 తర్వాత మరోసారి టీ-20 ప్రపంచకప్ ను అందుకోగలిగింది.

క్వాలిఫైయింగ్ దశలోనే రెండుసార్లు విజేత వెస్టిండీస్ నిష్క్ర్రమిస్తే, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియా సూపర్ లీగ్ దశ నుంచే వైదొలిగింది. మాజీ చాంపియన్ శ్రీలంక, దక్షిణాఫ్రికాజట్లు సైతం నాకౌట్ రౌండ్ చేరుకోడంలో విఫలమయ్యాయి.

సూపర్ -12 గ్రూప్ -2 టాపర్ గా సెమీస్ లో అడుగుపెట్టిన భారత్ నాకౌట్ రౌండ్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల ఘోరపరాజయం చవిచూసింది. గతేడాది రన్నర్ న్యూజిలాండ్ కు తొలిసెమీఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి తప్పలేదు.

బౌలరే హీరోగా నిలిచిన ప్రపంచకప్..

టీ-20 ప్రపంచకప్ అంటేనే బ్యాటర్ల హోరు, జోరు. బౌలర్ల పాత్ర అంతంతమాత్రమే. 2007 ప్రారంభ ప్రపంచకప్ నుంచి 2021 ప్రపంచకప్ వరకూ బ్యాటర్లే రాజ్యమేలుతూ వచ్చారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు గెలుచుకొంటూ వచ్చారు. అయితే..ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రం ఇంగ్లండ్ లెఫ్టామ్ పేస్ బౌలర్ సామ్ కరెన్ చరిత్రను తిరగరాశాడు. ఓ స్పెషలిస్ట్ బౌలర్ సైతం ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ది టో్ర్నీగా నిలువగలడని చాటి చెప్పాడు.

సామ్ కరెన్ మొత్తం ఏడుమ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ టోర్నీ, ఫైనల్లో 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డులు కైవసం చేసుకొన్నాడు.

మూడు రికార్డుల విరాట్ కొహ్లీ...

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ మూడు విభాగాలలో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక పరుగులు, అత్యుత్తమ సగటు, అత్యధిక అర్థశతకాల రికార్డులను విరాట్ నెలకొల్పాడు.

విరాట్ కొహ్లీ సూపర్ -12 రౌండ్లో ఐదు మ్యాచ్ లు, సెమీఫైనల్ తో కలుపుకొని మొత్తం ఆరు ఇన్నింగ్స్ లో 296 పరుగులు సాధించాడు. విరాట్ సాధించిన మొత్తం నాలుగు హాఫ్ సెంచరీలలో మూడు నాటౌట్ స్కోర్లు ఉన్నాయి. 98.66 తో అత్యుత్తమ సగటును సైతం విరాట్ నమోదు చేశాడు.

భారత నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ అత్యధిక బౌండ్రీల రికార్డును నెలకొల్పాడు. సూర్య ఏకంగా 35 బౌండ్రీలు సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్ లోనే బౌండ్రీల కింగ్ గా నిలిచాడు.

జింబాబ్వే మిడిలార్డర్ ఆటగాడు సికిందర్ రాజా 11 సిక్సర్లతో ..అత్యధిక సిక్సర్లు సాధించిన మొనగాడిగా నిలిచాడు.అత్యధిక వ్యక్తిగత స్కోరు ( 109 పరుగుల ) రికార్డును దక్షిణాఫ్రికా యువబ్యాటర్ ర్యాలీ రూసో నమోదు చేశాడు.

రెండు శతకాలు...రెండు హ్యాట్రిక్ లు...

2022 ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు ( 15) పడగొట్టిన బౌలర్ గా శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ నిలిచాడు. క్వాలిఫైయింగ్ దశ నుంచి సూపర్ -12 రౌండ్ వరకూ ఆడిన మ్యాచ్ ల్లో హసరంగ అత్యధికంగా 15 వికెట్లు సాధించాడు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన లెగ్ స్పిన్నర్ కార్తీక్ మొయప్పన్, ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ లు సాధించిన బౌలర్లుగా నిలిచారు.

సెంచరీలు సాధించిన బ్యాటర్ల లో ర్యాలీ రూసో ( దక్షిణాఫ్రికా ), గ్లెన్ ఫిలిప్స్ ( న్యూజిలాండ్ ) ఉన్నారు.

ఇంగ్లండ్ కు బంపర్ ప్రైజ్ మనీ..

టీ-20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మొత్తంలో 13 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకొన్న తొలిజట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. రన్నరప్ పాకిస్థాన్ కు 6 కోట్ల 50 లక్షల రూపాయలు, సెమీస్ లో ఓడిన భారత్, న్యూజిలాండ్ జట్లకు చెరో మూడున్నర కోట్ల రూపాయలు చొప్పున ప్రైజ్ మనీ దక్కింది.

రెండుసార్లు టీ-20 ప్రపంచకప్‌ నెగ్గిన రెండో జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డుల్లోకెక్కింది. వెస్టిండీస్‌ (2012, 2016లో) గతంలో ఈ ఘనత సాధించింది. నాలుగు టీ -20 ప్రపంచకప్‌ టోర్నీలలో పాకిస్థాన్‌తో తలపడిన నాలుగుకు నాలుగుసార్లూ ఇంగ్లండే నెగ్గడం మరో అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.

వన్డే ప్రపంచకప్ ను, టీ-20 ప్రపంచకప్ ను వరుసగా నెగ్గడంతో పాటు ...వైట్ బాల్ క్రికెట్లో చాంపియన్ గా నిలిచిన ఏకైకజట్టు ఇంగ్లండ్ మాత్రమే.

First Published:  14 Nov 2022 6:18 AM GMT
Next Story