Telugu Global
Sports

ఐపీఎల్ `కింగ్' విరాట్ కొహ్లీ!

ఐపీఎల్ చరిత్రలో గత 16 సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న ఏకైక బ్యాటర్ విరాట్ కొహ్లీ. బ్యాటింగ్ అత్యుత్తమ రికార్డుల్లో అధికభాగం కొహ్లీ పేరుతోనే ఉన్నాయి.

Virat Kohli Records in IPL History: ఐపీఎల్ `కింగ్ విరాట్ కొహ్లీ!
X

Virat Kohli Records in IPL History: ఐపీఎల్ `కింగ్' విరాట్ కొహ్లీ!

ఐపీఎల్ చరిత్రలో గత 16 సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న ఏకైక బ్యాటర్ విరాట్ కొహ్లీ. బ్యాటింగ్ అత్యుత్తమ రికార్డుల్లో అధికభాగం కొహ్లీ పేరుతోనే ఉన్నాయి...

గత 16 సీజన్లుగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐపీఎల్ లో ఎందరో ఎవర్ గ్రీన్ స్టార్ బ్యాటర్లున్నా బెంగళూరు రాయల్ చాలెంజర్స పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ తర్వాతే ఎవరైనా. కొహ్లీ పేరుతో అరడజనుకు పైగా అరుదైన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. సరికొత్త రికార్డులు సైతం వచ్చి చేరుతున్నాయి.

100సార్లు 30కి పైగా స్కోర్ల రికార్డు...

ఐపీఎల్ చరిత్రలో 30 కంటే ఎక్కువ స్కోర్లు 100సార్లు సాధించిన తొలి బ్యాటర్ గా విరాట్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత సీజన్ 6వ రౌండ్ పోటీలో పంజాబ్ కింగ్స్ పైన హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా విరాట్ ఈ ఘనత సాధించాడు.

ఆ తర్వాత స్థానాలలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ( 91 ), ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ ( 90 ), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ( 86సార్లు ) ఉన్నారు.

600 ఫోర్లు సాధించిన మూడో క్రికెట‌ర్‌గా రికార్డు

గ‌త ఏడాది తిరిగి ఫామ్ ను అందిపుచ్చుకొన్న విరాట్‌ కోహ్లీ.. మ‌రో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 600 ఫోర్లు బాదిన మూడో క్రికెట‌ర్‌గా రికార్డుల్లోచేరాడు. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో ముగిసిన పోరులో కొహ్లీ 5 బౌండ్రీలు సాధించడం ద్వారా 600 బౌండ్రీల క్లబ్ లో చోటు సంపాదించాడు.

విరాట్ పంజాబ్ తో పోరు వరకూ 229 మ్యాచుల్లో 603 బౌండ‌రీలు సాధించాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక ఫోర్లు సాధించిన బ్యాటర్ రికార్డు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌ శిఖ‌ర్ ధావ‌న్ పేరుతో ఉంది. ధావన్ 730 బౌండ‌రీలతో నంబర్ వన్ బౌండ్రీ హిట్టర్ గా నిలిచాడు.మొత్తం 210 మ్యాచుల్లో 730 బౌండ్రీలు నమోదు చేశాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ 608 ఫోర్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

ప్రస్తుత సీజన్లో నాలుగో హాఫ్ సెంచరీ..

ప్రస్తుత 16వ సీజన్ లీగ్ మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ ల్లోనే విరాట్ నాలుగు హాఫ్ సెంచ‌రీలు బాదాడు. కెప్టెన్ డూప్లెసిస్‌తో క‌లిసి తనజట్టుకు అదిరిపోయే ఆరంభాలను ఇస్తున్న విరాట్ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై 82 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై (62) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. కానీ, నికోల‌స్ పూర‌న్ (62) సంచ‌ల‌న బ్యాటింగ్ చేయ‌డంతో ల‌క్నో 1 వికెట్ తేడాతో గెలిచింది. ఆ త‌ర్వాత ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై కోహ్లీ (50) హాఫ్ సెంచ‌రీ బాదాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోటీలో కోహ్లీ(59) తన నాలుగో హాఫ్ సెంచరీ సాధించగలిగాడు. ఒకే జట్టు తరపున 7వేల పరుగుల రికార్డు..

గత 16 సీజన్లుగా ఒకే ఫ్రాంచైజీ ( బెంగళూరు)కు ఆడుతున్న అతికొద్దిమంది బ్యాటర్లలో విరాట్ కొహ్లీ ఒకడుగా నిలిచాడు. కేవలం బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరపునే 7వేల పరుగులు సాధించడం ద్వారా మరే ఆటగాడు సాధించిన రికార్డును విరాట్ నమోదు చేశాడు.

2022 సీజన్ లీగ్ రెండో అంచెపోరులో గుజరాత్‌ టైటాన్స్‌ పై 57 పరుగుల వ్యక్తిగత స్కోరుకు చేరడం ద్వారా 7వేల పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.

2008 ప్రారంభ సీజన్ నుంచి ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకే ఆడుతూ వస్తున్న విరాట్ 2022 సీజన్ నాటికి మొత్తం 235 ఇన్నింగ్స్‌లో 7000 పరుగుల లక్ష్యం సాధించగలిగాడు.

ఈ 7వేల పరుగుల్లో 424 పరుగులు చాంపియన్స్‌ లీగ్‌లో సాధించినవీ సైతం ఉన్నాయి.

200 కోట్ల రూపాయలకు పైగా సంపాదన..

కేవలం ఐపీఎల్ ద్వారా గత 16 సీజన్లుగా 200 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించిన ఏకైక ఆటగాడు విరాట్ కొహ్లీ మాత్రమే. బెంగళూరును కనీసం ఒక్కసారీ విజేతగా నిలుపలేకపోయినా..ఐకాన్ ప్లేయర్ హోదాలో ఫ్రాంచైజీ నుంచి సీజన్ కు 15 నుంచి 18 కోట్ల రూపాయల వరకూ కాంట్రాక్టు వేతనంగా అందుకొంటూ వస్తున్నాడు.

2016లో సూపర్ హిట్..2022లో అట్టర్ ఫ్లాప్!

2016 సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ గా విరాట్ కొహ్లీ సాధించిన పరుగులు 973. అందులో నాలుగు శతకాలు సైతం ఉన్నాయి. అదే గత సీజన్ ( 2022 ) లో ఆడిన మ్యాచ్ లు 16. సాధించిన పరుగులు 341 మాత్రమే.

16 ఇన్నింగ్స్ లో మూడుసార్లు గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. రెండంటే రెండు మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించాడు. 22.73 సగటుతో 341 పరుగులు సాధించడం ద్వారా..విరాట్ దారుణంగా విఫలమయ్యాడు.

అయితే...గత సీజన్ చివరి మ్యాచ్ నుంచి ఫామ్ ను అందుకోడం ద్వారా తిరిగి తనదైన శైలిలో ఆడుతున్న విరాట్ ప్రస్తుత సీజన్లో ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో పోటీలో నిలిచాడు.

ప్రస్తుత సీజన్ 6వ రౌండ్ వరకూ 229 మ్యాచ్ లు ఆడిన విరాట్ 113 పరుగులు అత్యధిక స్కోరుతో 6వేల 903 పరుగులు సాధించాడు. ఇందులో 48 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి.603 బౌండ్రీలు, 229 సిక్సర్లతో 36.72 సగటు నమోదు చేశాడు.

ఐపీఎల్ బ్యాటర్లలో కింగ్ ఎవరంటే విరాట్ కొహ్లీ మాత్రమే అని చెప్పడం అతిశయోక్తికాదు.

First Published:  25 April 2023 3:19 AM GMT
Next Story