Telugu Global
Sports

ఇటు విరాట్..అటు సిరాజ్..బెంగళూరు మూడో గెలుపు!

బ్యాటింగ్ లో స్టాండిన్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్ అదరగొట్టడంతో బెంగళూరుకు ఎదురేలేకపోయింది.

ఇటు విరాట్..అటు సిరాజ్..బెంగళూరు మూడో గెలుపు!
X

ఐపీఎల్ -16లో మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పడుతూ లేస్తూ సాగిపోతోంది. 5 మ్యాచ్ ల్లో మూడో విజయం నమోదు చేసింది.

ఐపీఎల్ -2023 సీజన్ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ నడక..రెండడుగులు ముందుకు, ఓ అడుగు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది.

ప్రస్తుత సీజన్ మొదటి నాలుగుమ్యాచ్ ల్లో రెండు విజయాలు, రెండు పరాజయాల రికార్డుతో ఉన్న రాయల్ చాలెంజర్స్..మొహాలీ వేదికగా ముగిసిన 5వ రౌండ్ పోరులో పంజాబ్ కింగ్స్ ను 24 పరుగులతో చిత్తు చేసింది.

బ్యాటింగ్ లో స్టాండిన్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్ అదరగొట్టడంతో బెంగళూరుకు ఎదురేలేకపోయింది.

ఇంపాక్ట్ ప్లేయర్ గా డూప్లెసి హిట్..

మొహాలీ పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన పోరులో బెంగళూరు వ్యూహం మార్చింది. కెప్టెన్ డూప్లెసీని ఇంపాక్ట్ ప్లేయర్ గా మార్చి..ఓపెనర్ విరాట్ కొహ్లీకి జట్టు పగ్గాలను అప్పజెప్పింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు ఓపెనింగ్ జోడీ విరాట్ కొహ్లీ- పాఫ్ డూప్లెసీ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే ఓవర్లలో రెచ్చిపోయి ఆడారు.

వీరిద్దరి జోరుతో పవర్‌ప్లే (6 ఓవర్లు)లో వికెట్ నష్టపోకుండా 59 పరుగులతో భారీస్కోరుకు పునాది వేసుకొంది.

పంజాబ్ స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో కట్టడితో బౌల్ చేసి బెంగళూరు జోరుకు పగ్గాలు వేశారు. అడపాదడపా షాట్లు ఆడిన డుప్లెసిస్‌ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత కోహ్లీ 40 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ప్రస్తుత సీజన్లో గత ఐదుమ్యాచ్ ల్లో కొహ్లీకి ఇది నాలుగో హాఫ్‌సెంచరీ కావడం విశేషం. విరాట్- డూప్లెసీ జోడీ తొలి వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.కోహ్లీ అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన సూపర్ హిట్టర్ మాక్స్ వెల్ డకౌట్ కాగా.. దినేశ్‌ కార్తీక్‌ 7 పరుగుల స్కోరుతో సరిపెట్టుకొన్నాడు.

డుప్లెసిస్‌ (56 బంతుల్లో 84; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), కోహ్లీ (47 బంతుల్లో 59; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలతో పరుగుల మోత మోగించడంతో బెంగళూరు 16 ఓవర్లలో 137/0 స్కోరుతో అత్యంత పటిష్ట స్థితిలో కనిపించింది. అయితే ఆఖరి నాలుగు ఓవర్లలో ఆశించినంత వేగంగా పరుగులు సాధించలేకపోయింది.

20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమ చేయగలిగింది. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2, అర్ష్‌దీప్‌, ఎలీస్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

నిప్పులు చెరిగిన మహ్మద్ సిరాజ్..

175 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ నిప్పులు చెరిగే బౌలింగ్ తో పంజాబ్ ను దెబ్బకొట్టాడు. తన కోటా 4 ఓవర్లలో 21 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు.

పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), జితేశ్‌ శర్మ (41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగిలిన టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు.

ఆల్ రౌండర్ సామ్‌ కరన్‌ నాయకత్వంలోని పంజాబ్ జట్టు.. తొలి ఓవర్‌ రెండో బంతికే అథర్వ (4) వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ ను సిరాజ్‌ పడగొట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సూపర్ హిట్టర్ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (2)ను కూడా సిరాజ్‌ పెవీలియన్ దారి పట్టించాడు. ఈ రెండు వికెట్లు డీఆర్ ఎస్ ద్వారా దక్కాయి. మాథ్యూ షార్ట్‌ (8)ను హసరంగ ఔట్‌ చేయడంతో పంజాబ్‌ 27/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి స్పెల్‌లో రెండు వికెట్లు తీసిన సిరాజ్‌ ఐదో ఓవర్‌లో బుల్లెట్‌ త్రోతో హర్‌ప్రీత్‌ (13)ను రనౌట్‌ చేశాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్‌ మరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. పంజాబ్‌ సారథి సామ్‌ కరన్‌ (10)ను హసరంగ అదిరిపోయే త్రోతో పెవిలియన్‌ చేర్చాడు. ప్రభ్‌సిమ్రన్‌, జితేశ్‌ పోరాడినా 24 పరుగుల పరాజయం తప్పలేదు.

బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లెగ్ స్పిన్నర్ హసరంగా రెండు వికెట్లు సాధించాడు. వీరిద్దరూ డైరెక్ట్‌ హిట్‌ ద్వారా చెరో రనౌట్‌ చేయడం విశేషం. సిరాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

రౌండ్ రాబిన్ లీగ్‌లో భాగంగా ఈరోజు జరిగే పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది.

First Published:  21 April 2023 6:11 AM GMT
Next Story