Telugu Global
Sports

విరాట్, జడేజా షో..భారత్ విశ్వరూపం!

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 8వ విజయంతో లీగ్ టేబుల్ లో తిరుగులేని టాపర్ గా నిలిచింది.

విరాట్, జడేజా షో..భారత్ విశ్వరూపం!
X

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 8వ విజయంతో లీగ్ టేబుల్ లో తిరుగులేని టాపర్ గా నిలిచింది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ వరుసగా 8 విజయంతో లీగ్ టేబుల్ లో తిరుగులేని టాపర్ గా నిలిచింది. భారత క్రికెట్ మక్కా

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన 8వ రౌండ్ పోరులో భారత్ 243 పరుగుల భారీవిజయం నమోదు చేసింది. తన 35వ పుట్టినరోజున 49వ సెంచరీతో మాస్టర్ సచిన్ ప్రపంచ రికార్డు సమం చేసిన విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

తేలిపోయిన దక్షిణాఫ్రికా.....

పది జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ తరువాత అత్యుత్తమజట్టుగా నిలవడంతో పాటు..నాలుగుసార్లు 350కి పైగా స్కోర్లు నమోదు చేసిన దక్షిణాఫ్రికా 8వ రౌండ్ పోరులో మాత్రం భారత్ ముందు తేలిపోయింది.

70వేలమంది హాజరైన....ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది టీవీల ద్వారా వీక్షించిన ఈ సూపర్ డూపర్ సండే ఫైట్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు

ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి 5.5 ఓవర్లలోనే మొదటి వికెట్ కు 62 పరుగుల మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.

భారత కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగుల స్కోరుతో సఫారీ పేసర్లకు ముచ్చెమటలు పట్టించాడు. రోహిత్ ( 40), శుభ్ మన్ (23 ) 11వ ఓవర్ కే ఒకరి వెంట ఒకరుగా అవుట్ కావడంతో భారత్ ఆత్మరక్షణలో పడినట్లే కనిపించింది.

అయ్యర్ - విరాట్ కీలక భాగస్వామ్యం...

బ్యాటింగ్ కు..ప్రధానంగా స్ట్ర్రోక్ ప్లేకి ఏమాత్రం అనువుగాలేని ఈడెన్ గార్డెన్స్ వికెట్ పై భారత వన్ డౌన్ విరాట్, రెండో డౌన్ శ్రేయస్ అయ్యర్ 3వ వికెట్ కు నేర్పు, ఓర్పులతో ఆడి 134 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. శ్రేయస్ అయ్యర్ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులతో చెలరేగిపోయాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీతో ఆకట్టుకొన్నాడు. చివరకు భారీషాట్ కు వెళ్లి ఫాస్ట్ బౌలర్ ఎంగిడి బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తరువాత వచ్చిన రాహుల్ సైతం నిలదొక్కుకోలేకపోయాడు.

అయితే..360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లోనే 6 ఫోర్లతో22 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 300 స్కోరును అందుకోగలిగింది.

విరాట్ ప్రపంచ రికార్డు సెంచరీ...

మరోవైపు..రన్ మెషీన్ విరాట్ కొహ్లీ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి..తన 35వ పుట్టినరోజునాడే ప్రపంచ రికార్డుస్థాయిలో 49వ వన్డే శతకాన్ని పూర్తి చేయగలిగాడు.

120 బంతుల్లో 10 ఫోర్లతో మూడంకెల స్కోరు అందుకోగలిగాడు. ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న అత్యధిక వన్డే శతకాల రికార్డును విరాట్ సమం చేయగలిగాడు.

మిడిలార్డర్ బ్యాటర్ రవీంద్ర జడేజా 15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 29 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడంతో భారత్ 50 ఓవర్లలో 326 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

విరాట్ 121 బంతుల్లో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ పై తన 48వ శతకం సాధించిన విరాట్ ఆ తర్వాత న్యూజిలాండ్ పై 95, శ్రీలంకపై 88 పరుగుల స్కోర్లతో సెంచరీలు చేజార్చుకొన్నా...సఫారీలపైన పట్టుదలతో ఆడి మాస్టర్ క్లాస్ శతకం నమోదు చేయగలిగాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జెన్సన్, రబడ, మహారాజ్, షంషీ తలో వికెట్ పడగొట్టారు.

జడేజా స్పిన్ మ్యాజిక్ ....

మ్యాచ్ నెగ్గాలంటే 327 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాజట్టు 27.1 ఓవర్లలోనే కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుత ప్రపంచకప్ లో నాలుగుసార్లు 350కి పైగా స్కోర్లు సాధించిన ఏకైకజట్టుగా నిలిచిన సఫారీటీమ్...భారత బౌలర్ రవీంద్ర జడేజా స్పిన్ జాదూలో గల్లంతయ్యింది. నాలుగు సెంచరీల హీరో, డాషింగ్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ ను 5 పరుగుల స్కోరుకే సిరాజ్ పడగొట్టాడు. కెప్టెన్ బవుమా ను జడేజా అవుట్ చేశాడు. వీరబాదుడు డ్యూసెన్, మర్కరమ్ లను షమీ సాగనంపడంతో సఫారీ టీమ్ 40 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

ఆ తర్వాత నుంచి లెఫ్టామ్ స్పిన్నర్ జడేజా షోలా మ్యాచ్ కొనసాగింది. జడేజా 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలి 243 పరుగుల ఘోరపరాజయం చవిచూసింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదినజట్టుగా నిలిచిన దక్షిణాఫ్రికా...భారత్ పై కనీసం ఒక్క సిక్సరూ సాధించలేకపోయింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ చెరో 2 సిక్సర్లు, జడేజా, శుభ్ మన్ గిల్ చెరో సిక్సర్ సాధించారు.

ప్రపంచకప్ ప్రస్తుత రౌండ్ రాబిన్ లీగ్ లో దక్షిణాఫ్రికాకు ఇది రెండో ఓటమి. 8 రౌండ్లలో 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది.

భారత్ అరుదైన ఘనత...

దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా వన్డే ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ ఆరుసార్లు తలపడిన భారత్ 3-3 రికార్డుతో నిలిచింది. ప్రస్తుత ఈ మ్యాచ్ కు ముందు వరకూ 2 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో ఉన్న భారత్ ఈ విజయంతో లెక్కను 3-3తో సరిచేయగలిగింది.

2003 ప్రపంచకప్ లో వరుసగా 8 విజయాలు సాధించిన రికార్డు భారత్ తిరిగి 20 సంవత్సరాల తరువాత సమం చేయగలిగింది. లీగ్ దశలో ఇప్పటి వరకూ ఆడిన

8 రౌండ్లలో ఆస్ట్ర్రేలియా, అప్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికాజట్లను చిత్తు చేసిన రోహిత్ సేన తన ఆఖరి రౌండ్ పోరులో పసకూన

నెదర్లాండ్స్ తో పోటీపడాల్సి ఉంది. అంతేకాదు..వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రెండోజట్టుగా నిలిచింది.

ప్రపంచకప్ లో 61 విజయాల భారత్..

48 సంవత్సరాల క్రితం ప్రారంభమైన వన్డే ప్రపంచకప్ లో రెండో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది. ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా 74 విజయాలతో అగ్రస్థానంలో నిలిస్తే..దక్షిణాఫ్రికా పై నెగ్గడం ద్వారా భారత్ 61వ విజయం నమోదు చేయగలిగింది.

భారత్ తర్వాత 58 విజయాలతో న్యూజిలాండ్ 3వ స్థానంలో కొనసాగుతోంది. 50 విజయాలతో ఇంగ్లండ్ నాలుగు, 48 విజయాలతో పాకిస్థాన్ ఐదు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ చెరో 43 విజయాలతో ఆరు స్థానాలలో కొనసాగుతున్నాయి.

లీగ్ దశ ఆఖరి రౌండ్ మ్యాచ్ ల్లో నెదర్లాండ్స్ తో భారత్, అప్ఘనిస్థాన్ తో దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.

First Published:  6 Nov 2023 2:25 AM GMT
Next Story