Telugu Global
Sports

ఫిట్ నెస్ లో భారత క్రికెట్ బాహుబలి విరాట్!

ఆధునిక క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ప్రస్తుత భారత క్రికెట్లోనే అత్యుత్తమ శరీరదారుఢ్యం కలిగిన క్రికెటర్ గా నిలిచాడు.

ఫిట్ నెస్ లో భారత క్రికెట్ బాహుబలి విరాట్!
X

ఆధునిక క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ప్రస్తుత భారత క్రికెట్లోనే అత్యుత్తమ శరీరదారుఢ్యం కలిగిన క్రికెటర్ గా నిలిచాడు.

గత ఏడాదికాలంలో ఫిట్ నెస్ సమస్యలు లేని భారత ఏకైక క్రికెటర్ గా విరాట్ నిలిచాడు....

క్రీడలు ఏవైనా అత్యుత్తమంగా రాణించాలంటే శరీరదారుఢ్యం, సూపర్ ఫిట్ నెస్ ఉండితీరాలి. ఫిట్ గా ఉంటేనే ఎలాంటి అవాంతరాలు లేకుండా క్రీడాకారులు తమ ప్రస్థానం కొనసాగించే అవకాశం ఉంటుంది.

ఏడాది పొడుగునా..విసుగు, విరామం లేకుండా క్రికెట్ మూడు ( టెస్టు, వన్డే, టీ-20 ) ఫార్మాట్లలో గాయాలబారిన పడకుండా నిలకడగా రాణించాలంటే అత్యుత్తమ ఫిట్ నెస్ ఉండి తీరాలి. అయితే...ప్రస్తుత భారత క్రికెట్లో యుక్తవయసులో ఉన్న పలువురు క్రికెటర్లతో పాటు..మూడు పదుల వయసు సైతం లేని పలువురు క్రికెటర్లు తరచూ గాయాలబారిన పడటం, ఫిట్ నెస్ సమస్యలతో కీలక సమయాలలో జట్టుకు దూరం కావడం ప్రధానసమస్యగా మారింది.

23 మంది అగ్రశ్రేణి క్రికెటర్లకు గాయాల సమస్య..

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగనున్న టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే..భారత తురుపుముక్కలు జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, దీపక్ చహార్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. జడేజా, బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోడంతో భారతజట్టులో సమతూకం పూర్తిగా దెబ్బతింది. వారిలేని లోటును పూడ్చుకోడానికి ప్రస్తుత భారత టీమ్ మేనేజ్ మెంట్ నానాపాట్లు పడాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో ..భారత ప్రధాన క్రికెటర్ల ఫిట్ నెస్, గాయాలు, చికిత్స తదితర అంశాలపై బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ వైద్యచికిత్స విభాగం...బీసీసీఐకి ఓ నివేదికను పంపింది.

అగ్రశ్రేణి క్రికెటర్లలో 23 మందికి గాయాలు...

భారత క్రికెట్ బోర్డు కాంట్రాక్టు జాబితాలోని అగ్రశ్రేణి క్రికెటర్లలో 23 మంది ఏదో ఒక గాయం లేదా ఫిట్ నెస్ సమస్యతో జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్సతో పాటు పునరావాస ఫిట్ నెస్ కార్యక్రమాలలో పాల్గొన్నట్లు బీసీసీఐకి సమాచారం చేరింది.

పురుషులు, మహిళల విభాగాలలో సీనియర్, జూనియర్ క్రికెటర్లు మొత్తం 70 మంది 96 రకాల గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో తమ దగ్గర చికిత్సపొందినట్లు జాతీయ క్రికెట్ అకాడమీ వివరించింది.

ఏడుగురు మహిళా క్రికెటర్లు, 25 మంది ఇండియా- ఏ ఆటగాళ్లు, 23 మంది సీనియర్ క్రికెటర్లు, వివిధ రాష్ట్ర్రాలకు చెందిన 14మంది రంజీట్రోఫీ క్రికెటర్లు గాయాలబారిన పడి..చికిత్స పొందిన జాబితాలో ఉండటం విశేషం.

గాయాలబారిన పడిన క్రికెటర్లలో రోహిత్ శర్మ, రాహుల్, చతేశ్వర్ పూజారా, శిఖర్ ధావన్,హార్థిక్ పాండ్యా,ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా,రిషభ్ పంత్,ఇషాంత్ శర్మ,వాషింగ్టన్ సుందర్,సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, యజువేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్,వృద్ధిమాన్ సాహా ఉన్నారు.

2021-2022 నివేదిక ప్రకారం..భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఒక్కడే ఫిట్ నెస్ సమస్యలపాలు కాలేదనీ, కనీసం ఒక్కసారి జాతీయ క్రికెట్ అకాడమీలో చేరలేదని వివరించారు.

భారత ప్రస్తుత క్రికెటర్లలో విరాట్ కొహ్లీ ఒక్కడే సూపర్ ఫిట్ నెస్ తో ఉన్న ఆటగాడంటూ ఎన్సీఏ నిపుణులు కితాబిచ్చారు.

ప్రపంచ క్రికెటర్లలోనే మేటి విరాట్...

అంతర్జాతీయ క్రికెటర్లలో అత్యుత్తమ ఫిట్ నెస్ ప్రమాణాలతో తన కెరియర్ కొనసాగిస్తున్న అతికొద్దిమంది ఆటగాళ్లలో విరాట్ కొహ్లీ ఒకడుగా నిలిచాడు.

ప్రతిరోజూ జిమ్ లో గంటల తరబడి గడిపే విరాట్ కొహ్లీ..ఫిట్ నెస్ కు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతాకాదు. లీటర్ 2వేల రూపాయల ఖరీదు చేసే మినిరల్ వాటర్ ను ఫ్రాన్స్ నుంచి తెప్పించుకొని మరీ విరాట్ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాడు. ఓ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్ లా విరాట్ రోజూ వెయిట్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు.

విరాట్ తన 13 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన సందర్భాలు చాలా తక్కువ. కేవలం మానసిక సమస్యలతో మాత్రమే విరాట్ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది.

గతంలో వెన్నెముక గాయం సమస్యలతో సతమతమైన విరాట్..శస్త్రచికిత్స చేయించుకోకుండానే...రోజువారీ ఫిట్ నెస్ కార్యక్రమాలతో పూర్తి ఫిట్ నెస్ సంపాదించగలిగాడు.

33 సంవత్సరాల విరాట్ కంటే పది సంవత్సరాల చిన్నవయసు కలిగిన శుభ్ మన్ గిల్, పృథ్వీ షా, రితురాజ్ గయక్వాడ్, కమలేశ్ నగర్ కోటీ, సంజు శాంసన్ గాయాలబారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

విరాట్ కొహ్లీని స్ఫూర్తిగా తీసుకొంటే భారతజట్టులోని మిగిలిన ఆటగాళ్లకు అస్సలు ఫిట్ నెస్ సమస్యలే ఉండవని ప్రత్యేకంగా చెప్పాలి మరి.



First Published:  15 Oct 2022 4:30 AM GMT
Next Story