Telugu Global
Sports

మూడేళ్ల తర్వాత విరాట్ కు శతకోదయం!

అంతర్జాతీయ క్రికెట్లో 71వ శతకం కోసం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ మూడేళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది.

మూడేళ్ల తర్వాత విరాట్ కు శతకోదయం!
X

అంతర్జాతీయ క్రికెట్లో 71వ శతకం కోసం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ మూడేళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఆసియాకప్ సూపర్ -4 ఆఖరిరౌండ్ పోరులో విరాట్ 122 పరుగుల నాటౌట్ స్కోరుతో రికార్డుల మోత మోగించాడు. 1020రోజుల సుదీర్ఘవిరామం తర్వాత మూడంకెల స్కోరు నమోదు చేశాడు...

15వ ఆసియాకప్ లో ఏడుసార్లు విజేత భారత్ పరిస్థితి వ్రతం చెడినా ఫలితం దక్కించుకొన్నట్లయ్యింది. సూపర్ -4 మొదటి రెండురౌండ్ల పరాజయాలతో భారత్ ఫైనల్స్ కు చేరుకోడంలో విఫలమైనా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ రాహుల్, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తమ సూపర్ బ్యాటింగ్ తో తిరిగి గాడిలో పడటంతో భారత్ ఊపిరిపీల్చుకోగలిగింది.

శ్రీలంకతో మ్యాచ్ లో రోహిత్ శర్మ 72 పరుగుల భారీస్కోరు నమోదు చేస్తే..అఫ్ఘనిస్థాన్ తో దుబాయ్ వేదికగా ముగిసిన సూపర్-4 ఆఖరి రౌండ్ పోరులో ఓపెనర్లుగా బ్యాటింగ్ కు దిగిన రాహుల్- విరాట్ కొహ్లీ సెంచరీ భాగస్వామ్యంతో చెలరేగిపోయారు.

రాహుల్ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ, విరాట్ కళ్లు చెదిరే శతకంతో వీరవిహారమే చేశారు. 32 బాల్స్ లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్..ఆ తర్వాతి హాఫ్ సెంచరీని కేవలం 28 బాల్స్ లోనే పూర్తి చేయడం విశేషం. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఫరీద్ అహ్మద్ బౌలింగ్ లో సిక్సర్ బాదడం ద్వారా విరాట్ మూడంకెల స్కోరును చేరుకోగలిగాడు.

కొహ్లీ శతకనిరీక్షణకు తెర!

అంతర్జాతీయ క్రికెట్లో అలవోకగా శతకాలు బాదడానికి మరో పేరైన విరాట్ కొహ్లీ..గత మూడేళ్లుగా మూడంకెల స్కోరు సాధించలేక తీవ్రఒత్తిడిలో పడిపోయాడు.

చివరిసారిగా 2019 డే-నైట్ టెస్టులో బంగ్లాదేశ్ ప్ర్తత్యర్థిగా సెంచరీ సాధించిన విరాట్..ఆ తర్వాత నుంచి 1020రోజులపాటు మూడంకెల స్కోరుకు దూరమవుతూ వచ్చాడు.

టెస్టులు, వన్డేలలో కలిపి 2019 సీజన్ వరకూ 70 అంతర్జాతీయ శతకాలు సాధించిన విరాట్..71వ శతకం కోసం 2022 ఆసియాకప్ సూపర్-4 ఆఖరి రౌండ్ మ్యాచ్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా అఫ్ఘనిస్థాన్ తో ముగిసిన ఆఖరి సూపర్ -4 రౌండ్ పోరులో రాహుల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కేవలం 61 బాల్స్ లోనే 6 సిక్సర్లు, 12 ఫోర్లతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2019 తర్వాత విరాట్ కు ఇదే తొలి అంతర్జాతీయ శతకం కావడం విశేషం. అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో విరాట్ కు ఇదే సెంచరీ కావడం మరో రికార్డు. ఐపీఎల్ లో ఐదు శతకాలు బాదిన విరాట్ అంతర్జాతీయ టీ-20 శతకం కోసం 104 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.

స్టాండ్ ఇన్ కెప్టెన్ రాహుల్ తో కలసి విరాట్ మొదటి వికెట్ కు 119 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ ప్రస్తుత ఆసియాకప్ లోనే 2 వికెట్లకు 212 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేయగలిగింది.

సచిన్ తర్వాతి స్థానంలో విరాట్...

విరాట్ తన కెరియర్ లో 71వ శతకం సాధించడం ద్వారా కంగారూ దిగ్గజం రికీ పాంటింగ్ సరసన నిలిచాడు. పాంటింగ్ సైతం 71 సెంచరీలతో మాస్టర్ సచిన్ తర్వాతిస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ 100 అంతర్జాతీయ శతకాలతో ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచాడు. సచిన్ రికార్డు అధిగమించాలంటే విరాట్ మరో 30 సెంచరీలు చేయాల్సి ఉంది.

సచిన్ 664 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 100 సెంచరీలు, పాంటింగ్ 560 మ్యాచ్ ల్లో 71 శతకాలు సాధిస్తే..విరాట్ కేవలం 468 మ్యాచ్ ల్లోనే 71 సెంచరీల మైలురాయిని చేరుకోగలిగాడు.

లేటు వయసులో టీ-20 శతకం..

టీ-20 అంతర్జాతీయ ఫార్మాట్లో శతకం సాధించిన అత్యధిక వయస్కుడైన భారత క్రికెటర్ గా విరాట్ నిలిచాడు. విరాట్ 33 సంవత్సరాల 307 రోజుల వయసులో తన తొలి టీ-20 శతకం నమోదు చేయగలిగాడు.

సూర్యకుమార్ యాదవ్ 31 రోజు 200 రోజులు, రోహిత్ శర్మ 31 సంవత్సరాల 190 రోజుల వయసులోనూ సెంచరీలు సాధించగలిగారు.

అంతేకాదు..క్రికెట్ మూడుఫార్మాట్లు ( వన్డే, టెస్టు, టీ-20 ) లోనూ సెంచరీలు సాధించిన భారత నాలుగో బ్యాటర్ గా విరాట్ రికార్డుల్లో చేరాడు. విరాట్ కు ముందే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఉన్నారు.

వంద సిక్సర్ల విరాట్...

అప్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో అరడజను సిక్సర్లు బాదిన విరాట్..100 సిక్సర్ల రికార్డును సైతం అధిగమించగలిగాడు. విరాట్ మొత్తం 104 సిక్సర్లతో టీ-20 చరిత్రలో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాటర్ల వరుసలో 9వ వాడిగా నిలిచాడు.

న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ( 172), భారత కెప్టెన్ రోహిత్ శర్మ (171), కరీబియన్ దిగ్గజం క్రిస్ గేల్ (124), ఇంగ్లండ్ కెప్టెన్ వోయిన్ మోర్గాన్ (120), కంగారూ కెప్టెన్ ఆరోన్ పించ్ (117 ) అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లుగా కొనసాగుతున్నారు.

మొత్తం మీద విరాట్ సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతయ శతకం సాధించడం వ్యక్తిగతంగా కొహ్లీకి మాత్రమే కాదు..అతని అభిమానులకు సైతం ఊరట కలిగించినట్లయ్యింది.

ఆసియాకప్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ రికార్డులు సైతం విరాట్ పేరుతోనే ఉన్నాయి.

First Published:  9 Sep 2022 3:51 AM GMT
Next Story