Telugu Global
Sports

సచిన్ అడ్డాలో చెదరిన విరాట్ కల!

భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ కల చెదిరింది. మాస్టర్ సచిన్ టెండుల్కర్ హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియంలో 49వ శతకం సాధించాలన్నఆశ అడియాసగా మిగిలింది.

సచిన్ అడ్డాలో చెదరిన విరాట్ కల!
X

సచిన్ అడ్డాలో చెదరిన విరాట్ కల!

భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ కల చెదిరింది. మాస్టర్ సచిన్ టెండుల్కర్ హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియంలో 49వ శతకం సాధించాలన్నఆశ అడియాసగా మిగిలింది.

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ నెలకొల్పిన రికార్డులను అధిగమించే అవకాశం విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ లాంటి అతికొద్దిమంది స్టార్ బ్యాటర్లకు మాత్రమే ఉంటుంది. తన 22 సంవత్సరాల కెరియర్ లో సచిన్ నెలకొల్పిన పలు అరుదైన రికార్డుల్లో కొన్నింటిని ఇప్పటికే తిరగరాసిన విరాట్ కొహ్లీ...వన్డేలలో సచిన్ పేరుతో ఉన్న 49 శతకాల రికార్డును..మాస్టర్ హోంగ్రౌండ్ ముంబై వాంఖడే స్టేడియంలోనే అధిగమించే సువర్ణఅవకాశాన్ని చేజార్చుకొన్నాడు.

మాస్టర్ అడ్డాలో నయామాస్టర్ కు నిరాశ...

సచిన్ టెండుల్కర్ నిలువెత్తు కాంస్య విగ్రహం కొలువుతీరిన ముంబై వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ 7వ రౌండ్ మ్యాచ్ లో 49వ శతకం సాధించడం ద్వారా మాస్టర్ ప్రపంచ రికార్డును సమం చేసే అవకాశం విరాట్ కొహ్లీని ఊరించి, ఉడికించి..చేతులదాకా వచ్చి 12 పరుగుల దూరంలో వెక్కిరించి చేజారిపోయింది.

లక్నో వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన 6వ రౌండ్ మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన విరాట్ ..సచిన్ హోంగ్రౌండ్ ముంబై వాంఖడే స్టేడియంలో అలవోకగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ సెంచరీ సాధించడం ఖాయమనే స్టేడియంలోని అభిమానులంతా భావించారు.

కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ 4 పరుగులకే అవుటైన వెంటనే మొదటి ఓవర్లోనే విరాట్ క్రీజులోకి అడుగుపెట్టాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ తో కలసి ఆచితూచి ఆడుతూ రెండో వికెట్ కు 189 పరుగుల భారీభాగస్వామ్యం నమోదు చేశాడు.

చేజారిన శతకాలు...

శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ సెంచరీలకు చేరువగా వచ్చి..పేస్ బౌలర్ మధుశంక బౌలింగ్ లో అవుట్ కావడంతో స్ట్డేడియంలోని అభిమానులు మాత్రమే కాదు..ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించిన లక్షలాదిమంది అభిమానులు ఉసూరు మన్నారు.

శుభ్ మన్ గిల్ 92 బంతులు ఎదుర్కొని 11 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి సెంచరీకి 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు.

మరోవైపు..49వ సెంచరీ సాధించడం ద్వారా మాస్టర్ సచిన్ రికార్డును సమం చేయాలని కలలు కన్న విరాట్ కొహ్లీ 88 పరుగుల స్కోరుకు దొరికిపోయాడు. విరాట్ మొత్తం 94 బంతులు ఎదుర్కొని 11 బౌండ్రీలతో శతకానికి 12 పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో శుభ్ మన్ వెనుదిరిగితే..32వ ఓవర్లో విరాట్ ను మధుశంక పడగొట్టాడు.

దీంతో..మాస్టర్ సచిన్ అడ్డాలో సెంచరీ సాధించడం ద్వారా సచిన్ ప్రపంచ రికార్డును సమం చేయాలన్న విరాట్ లక్ష్యం నెరవేరకుండా పోయింది.

సచిన్ మరో రికార్డును అధిగమించిన విరాట్..

49 సెంచరీల సచిన్ రికార్డును అధిగమించడంలో విఫలమైనా..క్యాలెండర్ ఇయర్ లో 1000 పరుగుల రికార్డును మాత్రం విరాట్ అధిగమించగలిగాడు. ఏడాదిలో వెయ్యి పరుగులు చొప్పున సచిన్ తన కెరియర్ లో ఏడుసార్లు సాధిస్తే..విరాట్ 8వసారి వెయ్యి పరుగుల మైలురాయిని చేరడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

సచిన్ 1994, 1996, 1997, 1998, 2000, 2003, 2007 సీజన్లలో వెయ్యి పరుగుల చొప్పున సాధిస్తే...విరాట్ 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2023 సీజన్లలో వెయ్యి పరుగుల రికార్డు నమోదు చేశాడు.

అంతేకాదు..94 బంతుల్లో 88 పరుగులు సాధించడం ద్వారా విరాట్ వన్డేలలో 118వ హాఫ్ సెంచరీ నమోదు చేయగలిగాడు. ప్రస్తుత సీజన్లో విరాట్ కు ఇది 10వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం..తన 35వ పుట్టినరోజు పవర్ ఫుల్ దక్షిణాఫ్రికా పై విరాట్ తన 49వ శతకం సాధించగలిగితే అరుదైన ఘనతగా, అపురూపమైన రికార్డుగా మిగిలిపోతుంది.

First Published:  3 Nov 2023 12:16 PM GMT
Next Story