Telugu Global
Sports

ప్రపంచ క్రికెట్లో 15 ఏళ్ల విరాట్ పర్వం!

ఆధునిక భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు.

ప్రపంచ క్రికెట్లో 15 ఏళ్ల విరాట్ పర్వం!
X

ప్రపంచ క్రికెట్లో 15 ఏళ్ల విరాట్ పర్వం!

ఆధునిక భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ ఒకేతీరుగా రాణిస్తూ రన్ మెషీన్ గా పేరుపొందిన విరాట్ విజయశిఖరాలను తాకినా, వైఫల్యాల అంచులకూ పడిపోయినా ఒకేతీరుగా వ్యవహరించే పరిణతి సాధించాడు....

ప్రపంచ క్రికెట్లో అత్యున్నత ప్రమాణాలకు మరోపేరైన 34 సంవత్సరాల కొహ్లీ 15 సంవత్సరాల క్రితం ఇదేరోజున శ్రీలంక ప్రత్యర్థిగా తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ఆడటం ద్వారా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నుంచి విరాట్ మరి వెనుదిరిగి చూసింది లేదు.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ఐదురోజుల సాంప్రదాయ టెస్టు క్రికెట్..ఫార్మాట్ ఏదైనా ఒకే తీరుగా రాణిస్తూ పరుగుల హోరు, సెంచరీల హోరుతో రికార్డుల మోత మోగించిన మొనగాడు విరాట్ కొహ్లీ మాత్రమే.

గత మూడేళ్ల వరుస వైఫల్యాల గడ్డుపరిస్థితిని అధిగమించి తిరిగి గాడిలో పడిన విరాట్..త్వరలో జరిగే ఆసియాకప్ తో పాటు ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను సైతం భారత్ కు అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు.



జూనియర్ టు ప్రపంచ మేటిగా.

భారత జూనియర్ క్రికెటర్ గా విరాట్ కొహ్లీ సత్తా చాటుకోడం ద్వారా సీనియర్ జట్టులోకి అడుగుపెట్టాడు. అండర్ -19 ప్రపంచకప్ ను భారతజట్టు కొహ్లీ నాయకత్వంలోనే గెలుచుకొంది. ఆ తర్వాత 2008 ఆగ‌స్టు 18వ తేదీన దంబుల్లా వేదికగా శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ తన తొలి అంతర్జాతీయ వన్డే ఇన్నింగ్స్‌లో కొహ్లీ 22 బంతుల్లో 12 పరుగులు మాత్ర‌మే సాధించాడు. ఆ తర్వాత నుంచి కొహ్లీ విశ్వరూపమే ప్రదర్శించాడు. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన తన కెరీర్ గొప్ప గౌర‌వమంటూ విరాట్ మురిసిపోతున్నాడు.

ఇటీవలి వెస్టిండీస్ సిరీస్ వరకూ ఆడిన 111 టెస్టుల్లో 8వేల 676 పరుగులు, 275 వన్డేలలో 12వేల 898 పరుగులు, 115 టీ-20 మ్యాచ్ ల్లో 4వేల8 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 29 శతకాలు, 7 ద్విశతకాలు, 29 అర్థశతకాలు, వన్డేల్లో 46 శతకాలు, 65 అర్థశతకాలు, టీ-20ల్లో ఒక శతకం, 37 అర్థశతకాల ఘనత కేవలం విరాట్ కొహ్లీకి మాత్రమే సొంతం.

2011లో టెస్టు క్రికెట్ అరంగేట్రం...

విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్తేమీ కాదు. ఫార్మాట్ ఏదైనా ప‌రుగుల మోత మోగించడం అత‌నికి బ్యాటుతో అబ్బిన విద్య‌. అందుకే అతిస్వల్పకాలంలోనే ప్ర‌పంచంలోని మేటి బ్యాటర్లలో ఒకనిగా నిలిచాడు. టెస్టుల్లో సైతం 12 సంవత్సరాల కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాడు. 2011 జూన్ 20 రోజున విరాట్ టెస్టు జెర్సీ ధ‌రించాడు. అత‌ను వెస్టిండీస్ జట్టుపై జమైకాలోని సబీనాపార్క్ వేదికగా తన తొలిటెస్టు మ్యాచ్ ఆడాడు. నాలుగో స్థానంలో బ‌రిలోకి దిగిన అత‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో 4, 15 స్కోర్లు మాత్రమే సాధించగలిగాడు.

2012లో కోహ్లీ ఆస్ట్ర్రేలియాపై ఆడిలైడ్‌లో మొద‌టి టెస్టు శ‌త‌కం(112) సాధించాడు. ఇప్ప‌టివర‌కు 111 టెస్టులు ఆడిన విరాట్ 8,676 పరుగులు సాధించాడు. విరాట్ ఖాతాలో 29 సెంచ‌రీలు, 29 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

టెస్టు క్రికెట్లో భారత ఐదో అత్యుత్తమ బ్యాటర్ గా, అంతర్జాతీయ క్రికెటర్లలో 23వ అత్యధిక పరుగులు సాధించిన మొనగాడిగా నిలిచాడు. భారత్ తరపున అత్యధిక సెంచరీలు బాదిన నాలుగో బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు. అంతేకాదు..టెస్టుల్లో అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు సాధించిన భారత తొలి బ్యాటర్ గా విరాట్ చరిత్ర సృష్టించాడు. 254 పరుగుల నాటౌట్ విరాట్ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది.

టెస్టుల్లో భారత కెప్టెన్ గా....

భారత టెస్టు జట్టు కెప్టెన్ గా 2014లో మమ‌హేంద్ర సింగ్ ధోనీ నుంచి ప‌గ్గాలు అందుకున్నాడు. తన దూకుడైన వ్యూహాలతో భారత్ ను ప్రపంచ నంబ‌ర్ 1 జ‌ట్టుగా నిలిపాడు. అంతేకాదు ఐసీసీ తొలిసారి నిర్వ‌హించిన ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ లీగ్ ఫైన‌ల్‌కు చేర్చాడు. అయితే.. ఫైన‌ల్లో న్యూజిలాండ్ చేతిలో భార‌త జ‌ట్టు అనూహ్యంగా ఓటమి పాలై రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

68 టెస్టుల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ 40 విజయాలు, 17 పరాజయాలు, 11 డ్రాల రికార్డుతో 58.82 విజయశాతాన్ని నమోదు చేశాడు. ఇంగ్లండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, ఆస్ట్ర్రేలియా, వెస్టిండీస్ గడ్డపై భారత్ కు సిరీస్ విజయాలు అందించిన ఏకైక కెప్టెన్ గా విరాట్ నిలిచాడు.

వన్డే క్రికెట్లో మొనగాడు విరాట్...

50 ఓవర్ల వన్డే క్రికెట్లో విరాట్ కొహ్లీకి తిరుగులేని రికార్డులే ఉన్నాయి. 2023 వెస్టిండీస్ సిరీస్ వరకూ 275 మ్యాచ్ లు ఆడిన విరాట్ 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలతో 12వేల 898 పరుగులు సాధించాడు. 57.32 సగటుతో 183 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు.

చేజింగ్ కు దిగిన సమయంలో అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 8వేలు, 9వేలు, 10వేలు, 11వేలు, 12వేల పరుగుల మైలురాయి చేరిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.

భారతజట్టుకు 95 వన్డేలలో నాయకత్వం వహించిన విరాట్ 65 విజయాలు, 27 పరాజయాలు, ఓ టై, రెండు ఫలితం తేలని మ్యాచ్ లతో 68.42 విజయశాతం సాధించాడు.

2011 ఐసీసీ వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలలో విజేతగా నిలిచిన భారతజట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ , 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ చేరిన జట్లలో కీలక ఆటగాడిగా ఉన్నాడు.

2015, 2019 ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరడంలోనూ ప్రధానపాత్ర వహించాడు.

ప్రపంచకప్ లో 26 మ్యాచ్ లు ఆడిన విరాట్ కు 1030 పరుగులతో 46. 81 సగటు నమోదు చేశాడు. రెండుశతకాలు, ఆరు అర్థశతకాలు సైతం ఉన్నాయి.

13 చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ల్లో 529 పరుగులతో 88.16 సగటు నమోదు చేశాడు.12 ఇన్నింగ్స్ లో 5 హాఫ్ సెంచరీలు సాధించాడు.

టీ-20ల్లోనూ అదేజోరు...

సాంప్రదాయ టెస్టు, ఇన్ స్టంట్ వన్డే ఫార్మాట్లలోనే కాదు..ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో సైతం విరాట్ దూకుడుగా ఆడే బ్యాటర్ గా గుర్తింపు సంపాదించాడు. పరిస్థితులకు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకొంటూ భారత్ కు పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు.

భారత్ తరపున మొత్తం 115 టీ-20 అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన విరాట్4వేల 8 పరుగులు సాధించాడు. ఓ సెంచరీ, 37 హాఫ్ సెంచరీలతో సహా 52.73 సగటు నమోదు చేశాడు.

122 పరుగుల నాటౌట్ అత్యధిక స్కోరుతో పాటు 137. 96 సగటు సాధించాడు. టీ-20 చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్ గా, అత్యధికంగా 15 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు నెగ్గిన మొనగాడిగా, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లు ( 7) ఒకే ఒక్కడిగా చరిత్ర సృష్టించాడు.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో భాగంగా 27 మ్యాచ్ లు ఆడి 25 ఇన్నింగ్స్ లో 1141 పరుగులు సాధించాడు. 14 హాఫ్ సెంచరీలతో 131.30 స్ట్ర్రయిక్ రేటు, 81.50 సగటు సాధించాడు.

2014, 2016 ఐసీసీ ప్రపంచకప్ టో్ర్నీలలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకొన్నాడు.

సూపర్ ఫిట్ క్రికెటర్ విరాట్....

అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఫిట్ నెస్ కలిగిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న విరాట్..మూడు ఫార్మాట్లలోనూ కలిపి 501 మ్యాచ్ లు ఆడి 25వేల 582 పరుగులు సాధించాడు. 559 ఇన్నింగ్స్ లో 76 సెంచరీలు, 131 హాఫ్ సెంచరీలు సాధించాడు. 254 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 53.63 సగటు సాధించాడు.

664 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 34వేల 357 పరుగులు, 100 శతకాలు సాధించిన మాస్టర్ సచిన్ రికార్డులకు విరాట్ గురిపెట్టాడు.

2011- 2020 కాలానికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ పురస్కారాన్ని సైతం విరాట్ కొహ్లీ అందుకొన్నాడు.

విజయాలే కాదు..వైఫల్యాలు కూడా...

ఎంత గొప్ప ఆటగాడికైనా విజయాలతో పాటు వైఫల్యాలు సహజమే. దానికి విరాట్ కొహ్లీ సైతం మినహాయింపు కాదు. 2019 నుంచి 2022 సీజన్ వరకూ పరుగులు, సెంచరీల లేమితో విరాట్ విలవిలలాడిపోయాడు. వరుస వైఫల్యాలతో ఆత్మనూన్యతాభావనలో పడిపోయాడు.

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా మూడేళ్లుగా విఫలమవుతూ వస్తున్న విరాట్ ను గతంలో సాధించిన ఘనతల్ని దృష్టిలో ఉంచుకొని భారత టీమ్ మేనేజ్ మెంట్ భరిస్తూ వచ్చింది. అయితే..గత ఆసియాకప్ లో సెంచరీ సాధించడం ద్వారా విరాట్ తిరిగి పుంజుకోగలిగాడు. వన్డే, టెస్టు ఫార్మాట్లలో సైతం శతకాలు బాదడం ద్వారా గాడిలో పడగలిగాడు.

' ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పెర్మనెంట్ ' అన్నమాట విరాట్ కు అతికినట్లు సరిపోతుంది. 15 సంవత్సరాలపాటు ఫిట్ నెస్ సమస్యలు లేకుండా, అవిశ్రాంతంగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడుతూ వస్తున్న విరాట్ కొహ్లీని 'ఆధునిక క్రికెట్ బాహుబలి' అన్నా అది తక్కువే అవుతుంది.

First Published:  18 Aug 2023 10:13 AM GMT
Next Story