Telugu Global
Sports

సచిన్ రికార్డుకు విరాట్ గురి!

వన్డే క్రికెట్లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డులకు నయామాస్టర్ విరాట్ కొహ్లీ గురిపెట్టాడు.

Virat Kohli
X

విరాట్ కొహ్లీ

వన్డే క్రికెట్లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డులకు నయామాస్టర్ విరాట్ కొహ్లీ గురిపెట్టాడు. శ్రీలంకతో తీన్మార్ వన్డే సిరీస్ ద్వారా సచిన్ రికార్డును అధిగమించాలని భావిస్తున్నాడు...

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ...కొత్తసంవత్సరాన్ని పరుగుల జోరు, రికార్డుల హోరుతో ప్రారంభించాలని భావిస్తున్నాడు. గత మూడేళ్లు తన కెరియర్ లోనే గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న విరాట్ టీ-20 ఆసియాకప్ లో తన తొలిశతకం, బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ద్వారా 72వ శతకం సాధించడం ద్వారా 2022 క్రికెట్ సీజన్ ను సంతృప్తికరంగా నే ముగించగలిగాడు.

1214 రోజులపాటు నిరీక్షణ...

అంతర్జాతీయ క్రికెట్లో తన 71వ శతకం కోసం 1214 రోజులపాటు ఎక్కడలేని ఓర్పుతో ఎదురుచూసిన విరాట్..దుబాయ్ వేదికగా ముగిసిన 2022 ఆసియాకప్ టీ-20 టోర్నీ ఆఖరిమ్యాచ్ లో అఫ్గనిస్థాన్ పై సాధించాడు. టీ-20 అంతర్జాతీయమ్యాచ్ ల్లో తన తొలి సెంచరీ నమోదు చేయగలిగాడు. ఇక..బంగ్లాదేశ్ తో జరిగిన 2022 వన్డే సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ లో మూడంకెల స్కోరుతో వన్డేల్లో తన 44వ శతకం సైతం సాధించగలిగాడు.

2022 క్రికెట్ సీజన్ ను రెండు శతకాలతో ముగించిన విరాట్..ప్రస్తుత 2023 సీజన్ లో తొలివన్డే సిరీస్ కు సిద్ధమయ్యాడు.

శ్రీలంకపైన రికార్డుల మోత...

శ్రీలంకతో ప్రస్తుత తీన్మార్ వన్డే సిరీస్ ద్వారా విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డులకు గురిపెట్టాడు. మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

స్వదేశీగడ్డపై అత్యధికంగా 20 వన్డేలు సాధించిన ఘనత సచిన్ కు ఉంది. ఆ రికార్డును విరాట్ ప్రస్తుత సిరీస్ ద్వారా అధిగమించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే తన కెరియర్ లో భారత గడ్డపై 19 శతకాలు బాదిన విరాట్ మాస్టర్ సచిన్ రికార్డును అధిగమించాలంటే ప్రస్తుత సిరీస్ లో మరో రెండు సెంచరీలు సాధించాల్సి ఉంది.

బంగ్లాదేశ్ పైన తన 44వ వన్డే శతకం సాధించడం ద్వారా రికీ పాంటింగ్ పేరుతో ఉన్న 43 వన్డే సెంచరీల రికార్డును తెరమరుగు చేసిన విరాట్..ఇప్పుడు ఏకంగా మాస్టర్ సచిన్ రికార్డుకే గురిపెట్టాడు.

164 వన్డేల్లో 20 శతకాల సచిన్..

మాస్టర్ సచిన్ టెండుల్కర్ తన రెండుదశాబ్దాల క్రికెట్ కెరియర్ లో భారత్ వేదికగా ఆడిన 164 వన్డేల్లో 20 శతకాలు నమోదు చేశాడు. అదే విరాట్ కొహ్లీ మాత్రం స్వదేశంలో ఆడిన 101 మ్యాచ్ ల్లోనే 19 శతకాలతో 12వేల 471 పరుగులు సాధించాడు. ప్రస్తుత సిరీస్ లో మరో 180 పరుగులు చేయగలిగితే..మొదటి ఐదుగురు అత్యుత్తమ బ్యాటర్ల సరసన చేరగలుగుతాడు.

వన్డే క్రికెట్లో సచిన్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, సనత్ జయసూర్య, మహేల జయవర్ధనే అత్యధిక పరుగులు సాధించిన మొదటి ఐదుగురు బ్యాటర్లుగా ఉన్నారు.

శ్రీలంకపైన 9 శతకాల విరాట్...

ఒకేజట్టు ప్రత్యర్థిగా అత్యధికంగా 8 సెంచరీలు చొప్పున సాధించిన సంయుక్త రికార్డును మాస్టర్ సచిన్, నయా మాస్టర్ విరాట్ పంచుకొన్నారు. వన్డే చరిత్రలో వెస్టిండీస్ పై సచిన్ అత్యధికంగా 9 శతకాలు బాదితే..ఆస్ట్ర్రేలియాపైన విరాట్ కొహ్లీ సైతం 9 శతకాలతో సంయుక్త అగ్రస్థానంలో నిలిచాడు.

33 సంవత్సరాల విరాట్ ఇప్పటికే శ్రీలంక పైన 8 శతకాలు సాధించిన కొహ్లీ ప్రస్తుత సిరీస్ లో మరో సెంచరీలు చేయగలిగితే సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయగలుగుతాడు.

శ్రీలంక ప్రత్యర్థిగా సచిన్ 84 వన్డేలు ఆడి 3వేల 113 పరుగులు సాధించాడు. కొహ్లీ మాత్రం 47 వన్డేలలోనే 2వేల 220 పరుగులు సాధించడంతో పాటు 50 అర్థశతకాలు సైతం నమోదు చేయగలిగాడు.

వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ప్రస్తుత తీన్మార్ సిరీస్ లో విరాట్ కొహ్లీ ఏస్థాయిలో రాణిస్తాడో వేచిచూడాల్సిందే.

First Published:  10 Jan 2023 6:59 AM GMT
Next Story