Telugu Global
Sports

భార్యను చితకొట్టిన వినోద్ కాంబ్లీపై పోలీసు కేసు!

భారత మాజీ క్రికెటర్, సచిన్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీపై గృహహింస కేసు నమోదయ్యింది.

భార్యను చితకొట్టిన వినోద్ కాంబ్లీపై పోలీసు కేసు!
X

భారత మాజీ క్రికెటర్, సచిన్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీపై గృహహింస కేసు నమోదయ్యింది. ఈసారి స్వయంగా కాంబ్లీ భార్య ఆండ్రియానే కేసు నమోదు చేయటం విశేషం.

మాస్టర్ సచిన్ బాల్యమిత్రుడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ రిటైర్మెంట్ జీవితం దుర్భరంగా మారింది. రకరకాల కారణాలతో కాంబ్లీపై పోలీసు కేసులు నమోదు కావడం సాధారణ విషయంగా మారింది.

గతంలో బ్యాంకు లోను తీసుకొని ఎగ్గొట్టిన నేరంపై కాంబ్లీతో పాటు అతని భార్యపైనా కేసు నమోదయ్యింది. బీసీసీఐ నుంచి వచ్చే నెలకు 30 వేల రూపాయల పెన్షన్ తో ఇద్దరు పిల్లలు, తన భార్యను పోషిస్తున్న కాంబ్లీపై ఈసారి ఏకంగా గృహహింస కేసే నమోదు చేశారు.

బాంద్రాలోని జెడబ్లుఎల్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న కాంబ్లీ పీకలోతుల వరకూ మద్యం సేవించి ఇంటికి వచ్చాడని, కుక్కర్ పాన్ హ్యాండిల్ తో తన భార్య ఆండ్రియా తలపై కొట్టి తీవ్రంగా గాయపరచాడని, ఇద్దరు పిల్లల ముందే హత్యా ప్రయత్నం చేసినట్లు పోలీసులు ప్రకటించారు. క్రికెట్ బ్యాటుతో కూడా తన భార్యపై దాడిచేసినట్లు తలకు గాయాలతో ఆస్పత్రిలో ప్రాధమిక చికిత్స పొందిన ఆండ్రియా తమ స్టేషన్ కు వచ్చి తన భర్తపై కేసు పెట్టినట్లు బాంద్రా పోలీసులు వివరించారు.

బాంద్రాలోని బాబా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆండ్రియా వైద్యపరీక్ష కాపీని తన కేసుతో పాటు జత చేసిందని, ఓ విదేశీ భార్యపై దాడి చేసిన భర్త కేసులో వర్తించే నిబంధనలు ఈ కేసుకూ వర్తిస్తాయని తెలిపారు.

గాడి తప్పిన కాంబ్లీ జీవితం..

పాఠశాల స్థాయిలో సచిన్ టెండుల్కర్ తో కలసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వినోద్ కాంబ్లీకి అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడిగా పేరుంది. సచిన్ కంటే కాంబ్లీనే మెరుగైన ఆటగాడైనా..క్రమశిక్షణలోపం, రాత్రికి రాత్రే వచ్చిన గుర్తింపు, లక్షల రూపాయల ధనంతో గాడి తప్పాడు.

ముంబైలోని ఓ మత్స్యకారుల కుటుంబానికి చెందిన కాంబ్లీ..తల్లిదండ్రులను సైతం పక్కన పెట్టి విచ్చలవిడిగా జీవించడం ద్వారా తన క్రికెట్ కెరియర్ ను నాశనం చేసుకొన్నాడు.

మొదటి పెళ్లితో సర్వం కోల్పోయిన కాంబ్లీ..న్యూజిలాండ్ కు చెందిన ఆండ్రియాను రెండో వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రిగా మారాడు.

నెలకు 30వేల పెన్షన్ తో....

కాంబ్లీ కెరియర్ అర్థంతరంగా ముగిసిపోడంతో రిటైర్మెంట్ తర్వాత తగిన అవకాశాలు లేకపోడంతో కేవలం బీసీసీఐ నుంచి వచ్చే నెలకు 30 వేల రూపాయల పెన్షన్ తోనే కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది.

ముంబై మహానగరంలో నెలకు 30వేల రూపాయల పెన్షన్ తో కుటుంబభారాన్ని మోస్తున్నాననీ, తనకు ఓ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలంటూ

కొద్దినెలల ముందు మీడియా తో గోడు వెళ్లబోసుకొన్న కాంబ్లీ మద్యానికి బానిసగా మారాడు. అయితే కాంబ్లీ మొర ఆలకించిన సహ్యాద్రి గ్రూప్ సంస్థ నెలకు లక్షన్నర రూపాయల జీతంతో ఉద్యోగం ఇస్తానని ముందుకొచ్చింది.

సచిన్ అండగా నిలిచినా....

క‌ష్టాల్లో ఉన్న వినోద్ కాంబ్లీని అతని చిన్ననాటి మిత్రుడు స‌చిన్ టెండూల్క‌ర్ ప‌లు విధాలుగా ఆదుకున్నాడు. కొన్నాళ్ల పాటు స‌చిన్ టెండూల్క‌ర్ ఏర్పాటు చేసిన అకాడ‌మీలో కోచ్‌గా ప‌ని చేశాడు. నగరశివారులోని ఆ అకాడమీకి తన ఇల్లు చాలాదూరం ఉండడంతో ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. బీసీసీఐ నుంచి తనకు నెలవారీ అందే 30వేల రూపాయల పెన్షన్ తోనే కుటుంబాన్ని పోషించడం చాలా కష్టమైపోతోందని, అందుకే త‌న‌కేదైనా ఉద్యోగం క‌ల్పించాల‌ని ముంబై క్రికెట్ సంఘాన్ని కాంబ్లీ ఇటీవ‌ల అర్థించాడు. రూపాయి రాని గౌరవప్రదమైన పదువులు తనకు వద్దని, తన కుటుంబాన్ని పోషించుకోడానికి తగిన ఆదాయం అందించే ఉద్యోగం కావాలంటూ మొరపెట్టుకొన్నాడు.

ఇప్పటికే సచిన్ తనకు ఎంతో చేశాడని, ఇక సచిన్ నుంచి సాయం తీసుకొనే స్థితిలో తాను లేనని పరోక్షంగా తెలిపాడు.

తొమ్మిదేళ్లు... 17 టెస్టుల ముచ్చటగా కెరియర్....

స్కూల్ బోయ్ క్రికెటర్ గా సచిన్ టెండుల్కర్ తో కలసి 664 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వినోద్ కాంబ్లీ ముంబైలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రపంచ క్రికెట్లోకి దూసుకొచ్చాడు.

1991 నుంచి 2000 సంవత్సరం వరకూ భారత క్రికెట్ కు టెస్టులు, వన్డేలలో సేవలు అందించిన వినోద్ కాంబ్లీ..1991లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం, 1993లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా టెస్టు అరంగేట్రం చేశాడు.

భారత్ తరపున ఆడిన 17 టెస్టుల్లో 4 శతకాలు, 3 అర్థశతకాలతో 1084 పరుగులు, 104 వన్డేలలో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 2వేల 477 పరుగులు సాధించాడు.

అయితే...మాస్టర్ సచిన్ కంటే ప్రతిభావంతుడైన బ్యాటర్ గా గుర్తింపు పొందిన వినోద్ కాంబ్లీ క్రికెట్ జీవితం కేవలం తొమ్మిది సంవత్సరాల ముచ్చటగా ముగిసిపోయింది.

వివాహంతో సర్వమంగళం!

చిన్నవయసులోనే వచ్చిపడిన ధనరాశులు, పేరు ప్రఖ్యాతులతో వినోద్ కాంబ్లీ వ్యక్తిగత జీవితం గాడితప్పింది. బాల్యస్నేహితుడు సచిన్ టెండుల్కర్, గురువు రమాకాంత్ అచ్రేకర్ వారిస్తున్నా వినకుండా...చిన్నవయసులోనే పూనేలోని హోటెల్ బ్లూడైమండ్ రిసెప్షనిష్ట్ నోయెల్లా లూయిస్ తో ప్రేమలో పడి పెళ్లి వరకూ వచ్చాడు. కనిపెంచిన తల్లితండ్రులను పట్టించుకోకుండా నోయెల్లా మోజులో పడి క్రికెట్ తో సహా సర్వం కోల్పోయాడు. నోయెల్లాకు విలాసవంతమైన అపార్ట్ మెంట్, ఖరీదైన కారు, బంగారు నగలు కానుకగా సమర్పించుకొని సర్వం పోగొట్టుకొన్నాడు. చివరకు భారతజట్టులో స్థానం సైతం కోల్పోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఫ్యాషన్ మోడల్ యాండ్రూ హెవిట్ ను రెండో పెళ్లి చేసుకొని ఆర్థికపరమైన వివాదాలలో చిక్కుకొన్నాడు.

ఆర్థికసమస్యలను అధిగమించడం కోసం..దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ లో మ్యాచ్ లు ఆడటం, క్రికెట్ కోచ్ గా, వ్యాఖ్యాతగా, వివిధ టీవీ చానెళ్లలో విశ్లేషకుడిగా పని చేసినా గాడి తప్పిన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోలేకపోయాడు.

ఇప్పటికే పలురకాల కేసులు ఎదుర్కొన్న కాంబ్లీపై చివరకు అతని జీవితభాగస్వామి సైతం కేసు నమోదు చేయడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

First Published:  5 Feb 2023 7:29 AM GMT
Next Story