Telugu Global
Sports

సింగ్ ఈజ్ కింగ్- 5 నిముషాల్లోనే విజేందర్ నాకౌట్ విన్!

భారత తొలి ప్రొఫెషనల్ బాక్సర్, ఒలింపిక్స్ లో భారత కాంస్య పతక విజేత విజేందర్ సింగ్ 19 మాసాల విరామం తర్వాత తొలి నాకౌట్ విజయంతో మరోసారి సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకొన్నాడు.

సింగ్ ఈజ్ కింగ్- 5 నిముషాల్లోనే విజేందర్ నాకౌట్ విన్!
X

భారత తొలి ప్రొఫెషనల్ బాక్సర్, ఒలింపిక్స్ లో భారత కాంస్య పతక విజేత విజేందర్ సింగ్ 19 మాసాల విరామం తర్వాత తొలి నాకౌట్ విజయంతో మరోసారి సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకొన్నాడు.

రాయపూర్ లోని బల్బీర్ సింగ్ జునేజా స్టేడియం వేదికగా జరిగిన ఫైట్ లో ఘనా బాక్సర్ ఇల్యాసు సుల్లేపై నాకౌట్ విజయం సాధించాడు. ప్రో-బాక్సింగ్ లో తన రికార్డును 13-1కు పెంచుకొన్నాడు.

5 నిముషాల 7 సెకన్లలోనే...

గత 19 మాసాలుగా ప్రో-బాక్సింగ్ కు దూరంగా ఉన్న విజేందర్...ఘనాకు చెందిన పశ్చిమాఫ్రికా యూనియన్ చాంపియన్ ఇల్యాసు సులే పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాడు.

మొత్తం ఆరురౌండ్లుగా సాగాల్సిన ఈ పోరులో విజేందర్ ముష్టిఘాతాల వర్షానికి ప్రత్యర్థి సులే కేవలం రెండురౌండ్లకే నాకౌటయ్యాడు. హోరాహోరీగా సాగుతుందనుకొన్న ఈ పోరు కేవలం 5నిముషాల 7 సెకన్లలోనే ముగియటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

బౌట్ తొలిరౌండ్ నుంచే 37సంవత్సరాల విజేందర్ దూకుడు ప్రదర్శించాడు. ప్ర్తత్యర్థి సులేకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లెఫ్ట్ -రైట్ జాబ్ లు, హుక్ లతో పంచ్ ల వర్షం కురిపించాడు. ఎడాపెడా ముష్టిఘాతాలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు.

విజేందర్ పంచ్ లతో తొలిరౌండ్లోనే బిత్తరపోయిన సులే రెండోరౌండ్లో పుంజుకోడానికి, ఎదురుదాడి చేయటానికి ఏమాత్రం ప్రయత్నించకుండా ఉండి పోయాడు. దీంతో విజేందర్ తన జోరును మరింత పెంచి ఓ పిడిగుద్దుతో నాకౌట్ పంచ్ విసిరాడు. విజేందర్ దాడితో సులే కుప్పకూలే పరిస్థితికి రావడంతో..రింగ్ అంపైర్ ఫైట్ ను నిలిపి..విజేందర్ నాకౌట్ విజయం సాధించినట్లుగా ప్రకటించారు.

దెబ్బతిన్న బెబ్బులిలా...

ఒలింపిక్స్, ప్రపంచ బాక్సింగ్ పోటీలలో భారత్ కు పతకాలు అందించిన తొలిబాక్సర్ గా చరిత్ర సృష్టించిన విజేందర్ ఆ తర్వాత ప్రొఫెషనల్ బాక్సర్ గా మారాడు.

గత ఏడాది రష్యన్ బాక్సర్ ఆర్టిష్ లోప్సాన్ తో తలపడక ముందు వరకూ 11 ఫైట్లలో ఎనిమిది వరుస విజయాలతో సంచలనం సృష్టించిన విజేందర్ 12-0తో తిరుగులేని రికార్డు సాధించాడు.

అయితే...గోవా వేదికగా రష్యన్ బాక్సర్ తో గత ఏడాది జరిగిన 12 రౌండ్ల హోరాహోరీ పోరులో టెక్నికల్ నాకౌట్ ఓటమి పొందిన విజేందర్ ఆ తర్వాత 19 నెలలుగా విరామం తీసుకొన్నాడు.

సుదీర్ఘవిరామం తర్వాత తిరిగి ప్రోబాక్సింగ్ బరిలో నిలిచిన విజేందర్ పునరాగమన సమరంలో పశ్చిమాఫ్రికా చాంపియన్ ఇల్యాసు సులేను చిత్తు చేయడం ద్వారా మరోసారి సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకొన్నాడు.

ఇప్పటి వరకూ ప్రో బాక్సర్ గా 14 ఫైట్లలో పాల్గొన్న విజేందర్ 13 విజయాలు, ఓ పరాజయం రికార్డుతో నిలిచాడు. డిసెంబర్ లేదా జనవరిలో జరిగే తదుపరి ఫైట్ కోసం..తాను వచ్చేవారం నుంచి సాధన మొదలు పెడతానని ప్రకటించాడు.

First Published:  18 Aug 2022 3:59 AM GMT
Next Story