Telugu Global
Sports

IPL2023: జియో బడా ప్లాన్.. ఈ దెబ్బకు హాట్‌స్టార్ పని ఖతమేనా.!

ఐపీఎల్‌ను 'జియో సినిమా' యాప్ ద్వారా ఉచితంగానే అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అది కూడా చౌకబారు ప్రసారాలు కాకుండా 4కే రిజల్యూషన్‌తో ఉచితంగా ప్రసారం చేయనున్నది.

IPL2023: జియో బడా ప్లాన్.. ఈ దెబ్బకు హాట్‌స్టార్ పని ఖతమేనా.!
X

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మానసపుత్రిక జియో రాకతో టెలికాం రంగం ఎంతలా మారిపోయిందో తెలిసిందే. వాయిస్, డేటా చార్జీల మధ్య తేడా లేకుండా.. కేవలం డేటాకు మాత్రమే వసూలు చేస్తూ జియో ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్థగా ఎదిగింది. అనతి కాలంలోనే చౌక ధరలతో ఇతర టెలికాం కంపెనీలను దారుణంగా దెబ్బతీసింది. జియో రాక ముందు ఎయిర్‌టెల్, వోడఫోన్-ఐడియా భారీ టారిఫ్‌లు వసూలు చేస్తుండగా.. జియో దెబ్బకు అవి కూడా తక్కువ ధరకే సేవలను అందించడం మొదలు పెట్టాయి.

Advertisement

ఇక ఇప్పుడు జియో మరో రంగంలో పోటీకి తెరతీసింది. ఐపీఎల్‌ను ఈ ఏడాది నుంచి ఐదు సీజన్ల పాటు ప్రసారం చేయడానికి డిజిటల్ హక్కులను వయాకామ్ 18 గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2023-27 వరకు రూ.20,500 కోట్లకు హక్కులు తమ సొంతం చేసుకున్నది. గతంలో స్టార్ ఇండియాకు చెందిన డిస్నీ+హాట్‌స్టార్ వద్ద డిజిటల్ రైట్స్ ఉండేవి. కానీ ఈ సారి స్టార్ ఇండియా కేవలం టీవీ బ్రాడ్‌కాస్ట్ హక్కులు మాత్రమే పొందగా.. డిజిటల్ హక్కులు మాత్రం అంబానీకి చెందిన వయాకామ్ 18కు దక్కాయి.

Advertisement

భారీ ధరకు వయాకామ్ 18 హక్కులు దక్కించుకోవడంతో అందుకు తగిన చార్జీలనే యూజర్ల నుంచి వసూలు చేస్తుందని అందరూ భావించారు. కానీ ఐపీఎల్‌ను 'జియో సినిమా' యాప్ ద్వారా ఉచితంగానే అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అది కూడా చౌకబారు ప్రసారాలు కాకుండా 4కే రిజల్యూషన్‌తో ఉచితంగా అందించడానికి నిర్ణయించినట్లు సంస్థకు చెందిన ఉన్నతాధికారులు తెలియజేశారు. వయాకామ్ 18 ఇప్పటి వరకు అయితే అధికారికంగా ప్రకటించకపోయినా.. ఉచిత ప్రసారాలు మాత్రం ఖాయమనే తెలుస్తున్నది.

ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్-2022ను జియో సినిమా ఉచితంగానే ప్రసారం చేసింది. అప్పట్లో పిక్చర్ క్వాలిటీపై పలు ఫిర్యాదులు అందాయి. కానీ, ఐపీఎల్‌ను మాత్రం 4కే రిజల్యూషన్‌తో 12 భారతీయ భాషల్లో ఉచితంగా అందించాలని నిర్ణయించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ సహా.. ఇతర భారతీయ భాషల్లో కామెంటరీ ఉండబోతోంది. కేవలం కామెంటరీనే కాకుండా మ్యాచ్ గణాంకాలు, ఆటగాళ్ల గణాంకాలు, పిచ్ విశ్లేషణ కూడా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొని రానున్నది.

ఇప్పటి వరకు ఐపీఎల్, టీమ్ ఇండియా మ్యాచ్‌ల ప్రసారంలో గుత్తాధిపత్యం కనపరిచిన స్టార్ ఇండియా, హాట్‌స్టార్‌కు వయాకామ్ 18 నిర్ణయం పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. ఐపీఎల్‌ను స్టార్ స్పోర్ట్స్ ద్వారా ప్రసారం చేసినా.. అది పెయిడ్ ఛానల్ కాబట్టి వినియోగదారుడు కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జియో సినిమా యాప్‌ను ఇప్పుడు ఉన్న స్మార్ట్ టీవీల్లో ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకొని 4కే రిజల్యూషన్‌లో మ్యాచ్‌లు చూడవచ్చు. ఇది తప్పకుండా స్టార్ ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు వినియోగదారుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండానే.. కేవలం ప్రకటనల ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు అదే బిజినెస్ మోడల్‌ను వయాకామ్ 18 అనుసరించబోతోంది. ప్రేక్షకులకు ఉచితంగా ప్రసారాలు అందిస్తూ.. వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగా సంపాదించాలని నిర్ణయించింది. ఐపీఎల్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై 50 కోట్ల మంది వీక్షిస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో అదే విధంగా ప్రకటనల రేటు కూడా ఉండబోతోంది.

మరోవైపు జియో టెలికాం సేవల విస్తరణకు కూడా ఈ వ్యూహం పని చేస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. జియో సిమ్ ఉన్న వారికి జియో సినిమా ఇప్పటికే ఉచితంగా అందిస్తున్నారు. కేవలం డేటా చార్జీలు మాత్రమే వసూలు చేస్తూ.. అనేక ఉచిత సర్వీసులు ఇస్తుండటంతో జియో యూజర్ బేస్ పెరుగుతోంది. ఇప్పుడు ఐపీఎల్ కూడా ఉచితంగా చూపిస్తే.. కచ్చితంగా జియో వైపు మళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఇటీవలే ప్రారంభించిన జియో 5జీ సేవలను మరింతగా విస్తరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది. మొత్తానికి ఉచిత క్రికెట్ ప్రసారాల ద్వారా స్టార్ ఇండియా, సోనీ టెన్ వంటి సంస్థలకు జియో భారీగానే దెబ్బ వేయబోతోంది.

Next Story