Telugu Global
Sports

వందేసూర్యం..విరాట్ అభివాదం!

సూర్యకుమార్ యాదవ్...అంతర్జాతీయ టీ-20 క్రికెట్ వర్గాలలో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ బ్యాటింగ్ ను తన ఆటతీరుతో కొత్తపుంతలు తొక్కిస్తున్న మొనగాడు

వందేసూర్యం..విరాట్ అభివాదం!
X

సూర్యకుమార్ యాదవ్...అంతర్జాతీయ టీ-20 క్రికెట్ వర్గాలలో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ బ్యాటింగ్ ను తన ఆటతీరుతో కొత్తపుంతలు తొక్కిస్తున్న మొనగాడు.

అత్యున్నత క్రికెట్ ప్రమాణాలకు మరోపేరైన ముంబై స్కూల్ ఆఫ్ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 31 ఏళ్ల సూర్యకుమార్ రంజీట్రోఫీలో ముంబై కీలక ఆటగాడు మాత్రమే కాదు...ఐపీఎల్ లో ముంబై స్టార్ ప్లేయర్ గానూ గుర్తింపు తెచ్చుకొన్నాడు.

2021 సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో టీ-20 మ్యాచ్ ద్వారా భారతజట్టు తరపున అరంగేట్రం చేసిన సూర్య ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూసింది లేదు. గ్రౌండ్ నలుమూలలకూ...360 డిగ్రీల కోణంలో ఎడాపెడా షాట్లు కొడుతూ..అలవోకగా బౌండ్రీలు, సిక్సర్లు బాదడంలో సూర్యకు సూర్యమాత్రమే సాటి.

అనూహ్యం...వినూత్నం...

సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నాడంటే చాలు..ప్రత్యర్థిజట్టు కెప్టెన్ కు మాత్రమే కాదు..బౌలర్లకు సైతం వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడు, ఎలా విరుచుకు పడతాడో...కట్టడి చేయటానికి ఎలాంటి ఫీల్డ్ ను మోహరించాలో ప్రత్యర్థి కెప్టెన్ కు అంతుపట్టని పరిస్థితి. ఆఫ్ సైడ్, ఆన్ సైడ్, ఫ్రంట్, బ్యాక్ అన్నతేడా లేకుండా నటరాజ భంగిమలతో షాట్లు కొట్టడంలో సూర్య తర్వాతే ఎవరైనా. మ్యాజిక్ స్పిన్నర్లు, మెరుపు ఫాస్ట్ బౌలర్లు..ఎవరన్నా సూర్యాకు లెక్కలేదు. తనదైన రోజున బ్యాటు ఝళిపించాడంటే చాలు ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగిపోక తప్పదు.

అప్పుడు ఇంగ్లండ్...ఇప్పుడు హాంకాంగ్...

ప్రస్తుత సీజన్లోనే ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ తో జరిగిన ఓ టీ-20 మ్యాచ్ లో సూర్యకుమార్ విశ్వరూపం ప్రదర్శించాడు. 117 పరుగులతో తన తొలి టీ-20 శతకం నమోదు చేశాడు.

ప్రస్తుత ఆసియాకప్ గ్రూప్- ఏ లీగ్ లో భాగంగా హాంకాంగ్ తో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్ లో సూర్యకుమార్ చెలరేగిపోయాడు. బ్యాటింగ్ కు, స్ట్రోక్ ప్లేకి అంతగా అనువుకాని దుబాయ్ పిచ్ పైన..రోహిత్, రాహుల్, విరాట్ లాంటి సూపర్ స్టార్ క్రికెటర్లు పరుగులు సాధించడానికి ఓ వైపు నానాపాట్లు పడుతూ చెమటోడ్చుతుంటే, మరోవైపు సూర్యకుమార్ మాత్రం అలవోకగా సిక్సర్లు, బౌండ్రీలు బాదేస్తూ అభిమానులను మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచాన్నేఉక్కిరిబిక్కిరి చేశాడు.

ఇన్నింగ్స్ ఆఖరి 7 ఓవర్లలో భారత్ 98 పరుగులు సాధిస్తే..అందులో సూర్యకుమార్ ఒక్కడే..68 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం విశేషం. విరాట్ తో కలసి 3వ వికెట్ కు 98 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేయడంలో సూర్యకుమార్ కీలకపాత్ర పోషించాడు.

కేవలం 26 బాల్స్ లో ఆరేసి బౌండ్రీలు, సిక్సర్లతో సూర్య టాప్ స్కోరర్ గా నిలిచాడు. 22 బాల్స్ లో అర్థశతకం నమోదు చేశాడు.



సూర్య షాట్లకు విరాట్ హ్యాట్సాఫ్...

హాంకాంగ్ స్పిన్నర్లు, పేసర్లను అలవోకగా ఎదుర్కొంటూ...మిడ్ వికెట్ , కవర్ పాయింట్ మీదుగా సూర్య సిక్సర్లు బాదుతుంటే..అవతలి ఎండ్ లో నాన్ స్ట్రయికర్ గా ఉన్నా విరాట్ కొహ్లీ ఊపిరిబిగబట్టి మరీ చూశాడు. టీ-20 క్రికెట్లో ఇలా కూడా షాట్లు కొట్టొచ్చా అన్నట్లుగా దిగ్గజ క్రికెటర్ విరాట్ ఆశ్చర్యానికి గురయ్యాడు. సూర్యాను ఎలా అభినందించాలో తెలియక తలపై ఆప్యాయంగా నిమురుతూ తన వాత్సల్యాన్ని చాటాడు.

అంతేకాదు..ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఆరుబాల్స్ లో సూర్య నాలుగు భారీసిక్సర్లు బాదడంతో విరాట్ ఆనందానికి, ఆశ్చర్యానికి అవధిలేకుండా పోయింది. ఇన్నింగ్స్ ముగించి..

డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వస్తున్న సమయంలో..తనకంటే చిన్నవాడైన సూర్యకుమార్ కు ఆధునిక క్రికెట్ మేరునగధీరుడు విరాట్ శిరస్సు వంచి మరీ అభివాదం చేశాడు.

సూర్యబ్యాటింగ్ ను చూసి స్ఫూర్తి పొందిన విరాట్ సైతం..3 సిక్సర్లు, ఓ బౌండ్రీతో టీ-20 క్రికెట్లో తన 31వ అర్థశతకం, గత ఆరుమాసాలలో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేయగలిగాడు.

తన సహాఆటగాడి బ్యాటింగ్ ప్రతిభను చూసి మైమరచిపోవడమే కాదు...శిరసు వంచి మరీ హృదయపూర్వకంగా అభినందించి విరాట్ కొహ్లీకి క్రికెట్ అభిమానులంతా హ్యాట్సాఫ్ చెప్పితీరాల్సిందే.

First Published:  1 Sep 2022 5:46 AM GMT
Next Story