Telugu Global
Sports

భారత 84వ గ్రాండ్ మాస్టర్ గా వైశాలి!

ప్రపంచ చెస్ నయా పవర్ భారత్ 84వ గ్రాండ్ మాస్టర్ గా వైశాలీ రమేశ్ రికార్డుల్లో చేరింది.

భారత 84వ గ్రాండ్ మాస్టర్ గా వైశాలి!
X

ప్రపంచ చెస్ నయా పవర్ భారత్ 84వ గ్రాండ్ మాస్టర్ గా వైశాలీ రమేశ్ రికార్డుల్లో చేరింది. ఈ ఘనత సాధించిన మూడో భారత మహిళగా నిలిచింది.

మేధో క్రీడ చదరంగంలో భారత్ సరికొత్త విశ్వశక్తిగా అవతరించింది. ఐదుసార్లు విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ తో ప్రారంభమైన భారత గ్రాండ్ మాస్టర్ల పరంపర గత దశాబ్దకాలంలో జోరందుకొంది.

ఆనంద నుంచి వైశాలీ వరకూ...

చదరంగం అంటే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించాలని కలలూ కంటూ ఉంటారు. ప్రపంచ టోర్నీలలో పాల్గొనాలన్నా, ప్రపంచ చాంపియన్ గా నిలవాలన్నా గ్రాండ్ మాస్టర్ హోదా తప్పనిసరి. అయితే..గ్రాండ్ మాస్టర్ కావడం అంతతేలిక పనికాదు. కొందరు యుక్తవయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదిస్తే..మరికొందరు మూడు పదులు లేదా నాలుగు పదుల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించగలుగుతారు.

భారత తొలి సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తి, ప్రేరణతో డజన్ల కొద్దీ యువ గ్రాండ్ మాస్టర్లు భారత చెస్ ద్వారా ప్రపంచ చెస్‌ లో దూసుకు వచ్చారు.

ఆ పరంపరలో 84వ గ్రాండ్ మాస్టర్ గా, భారత 3వ మహిళగా తమిళనాడుకు చెందిన 22 సంవత్సరాల వైశాలీ రమేశ్ బాబు గుర్తింపు తెచ్చుకొంది.

అంతర్జాతీయ చదరంగ సమాఖ్య అధికారికంగా కొద్దిరోజుల క్రితమే వైశాలీకి గ్రాండ్ మాస్టర్ హోదా పత్రాలను అందచేసింది.

2500 ఇలోరేటింగ్ పాయింట్లతో....

చదరంగంలో పాల్గొనే క్రీడాకారులంతా వివిధ టోర్నీలలో పాల్గొని, మేటి ప్రత్యర్థి ఆటగాళ్లపై సాధించిన విజయాలను బట్టి ర్యాంకింగ్ పాయింట్లు సంపాదిస్తూ ఉంటారు.

తన కంటే బలమైన, మెరుగైన ర్యాంక్ కలిగిన ఆటగాడిపై విజయం సాధించగలిగితే ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్లు దక్కుతాయి.

ప్రారంభదశలో ఇంటర్నేషనల్ మాస్టర్, ఆ తరువాత గ్రాండ్ మాస్టర్, మరింత ప్రతిభ కనబరిస్తే సూపర్ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కుతాయి. స్పెయిన్ వేదికగా ముగిసిన టోర్నీలో లభించిన పాయింట్లతో వైశాలీ ఇలో రేటింగ్ 2500 పాయింట్లకు చేరింది. దీనికి తోడు..కెనడా వేదికగా ఇటీవలే ముగిసిన ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ మహిళల ఆఖరి ఐదు రౌండ్లలో వరుస విజయాలు సాధించడం ద్వారా వైశాలీ సంచలనమే సృష్టించింది.

హంపి, హారిక సరసన వైశాలీ...

భారత చదరంగ మహిళా విభాగంలో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించినవారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. తెలుగుతేజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తరువాత అదే ఘనతను తమిళనాడుకు చెందిన వైశాలి సైతం దక్కించుకోగలిగింది.

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత వెటరన్ హంపితో కలసి వైశాలీ సైతం సంయుక్త ద్వితీయ స్థానంలో నిలువగలిగింది.

2018లో మహిళా గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన వైశాలీ..పూర్తిస్థాయి గ్రాండ్ మాస్టర్ కావడానికి నాలుగేళ్లపాటు పోరాడాల్సి వచ్చింది. కరోనా సమయంలో చెస్ పోటీలు నిర్వహించకపోడం కారణంగానే వైశాలీ ఆలస్యంగా గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకోగలిగింది.

భారత చదరంగ సంచలనం , 18 సంవత్సరాల గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ కు వైశాలీ అక్క కావడం విశేషం. చిన్ననాటి నుంచి తమ్ముడితో కలసి ఆడుతూ చదరంగ శిక్షణ పొందిన వైశాలీ గత కొద్ది సంవత్సరాలుగా సత్తా చాటుకోడం ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించ గలిగింది.

తనకు, తమ్ముడు ప్రజ్ఞానంద్ కు ఎలాంటి లోటు లేకుండా అమ్మానాన్న చూసుకోడం కారణంగానే తాము గ్రాండ్ మాస్టర్లు కాగలిగామని వైశాలీ చెప్పింది. ఎప్పటికైనా ప్రపంచ చెస్ టైటిల్ సాధించడమే తన లక్ష్యమని ప్రకటించింది.

22 సంవత్సరాల వయసుకే బీకామ్ డిగ్రీతో పాటు మానవ వనరుల అంశంలో పీజీ డిప్లమా సైతం వైశాలి అందుకొంది. చదరంగం కోసం చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదని వివరించింది.

ఇక నుంచి చదరంగం పైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తానని, తనకు చెస్ క్రీడే జీవితమంటూ తెలిపింది.

ప్రపంచ స్థాయిలో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించిన 42వ మహిళగా కూడా వైశాలీ గుర్తింపు తెచ్చుకొంది. 12 సంవత్సరాల వయసులో చదరంగం ఆడటం మొదలు పెట్టిన వైశాలీ కేవలం దశాబ్దకాలంలోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

భారత చదరంగ చరిత్రలో ఇప్పటి వరకూ 84 మంది గ్రాండ్ మాస్టర్లు ఉంటే..వారిలో ముగ్గురు మాత్రమే మహిళలు అంటే ఆశ్చర్యమే మరి.

First Published:  5 May 2024 9:01 AM GMT
Next Story