Telugu Global
Sports

యూఎస్ ఓపెన్ నయాక్వీన్ స్వియాటెక్

మహిళాటెన్నిస్ లో పోలిష్ నయాస్టార్ ఇగా స్వియాటెక్ తన గ్రాండ్ షోను కొనసాగిస్తోంది. ప్రస్తుత సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ లో సైతం విజేతగా నిలిచింది.

యూఎస్ ఓపెన్ నయాక్వీన్ స్వియాటెక్
X

మహిళాటెన్నిస్ లో పోలిష్ నయాస్టార్ ఇగా స్వియాటెక్ తన గ్రాండ్ షోను కొనసాగిస్తోంది. ప్రస్తుత సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ లో సైతం విజేతగా నిలిచింది.

ప్రపంచ మహిళా టెన్నిస్ లో గత రెండుదశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన సెరెనా విలియమ్స్ లాంటి దిగ్గజాలు ఓ వైపు నిష్క్ర్రమిస్తుంటే...మరోవైపు ఇగా స్వియాటెక్ లాంటి యువక్రీడాకారిణులు తెరమీదకు వస్తున్నారు.

ప్రస్తుత సీజన్ గ్రాండ్ స్లామ్ ఆఖరిటోర్నీగా జరిగిన 2022 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సైతం 21 సంవత్సరాల పోలిష్ సంచలనం ఇగా స్వియాటెక్ కైవసం చేసుకొంది.

న్యూయార్క్ ఆర్ధర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ వరుససెట్లలో ట్యునీసియా స్టార్ ప్లేయర్ ఓన్స్ జబేర్ ను చిత్తు చేసింది.

గంటా 52 నిముషాలపాటు సాగిన పోరులో టాప్ సీడ్ స్వియాటెక్ 6-2, 7-6 ( 7-5)తో విజేతగా నిలిచింది.

స్వియాటెక్ అరుదైన రికార్డు...

మహిళా టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సర్క్యూట్ లో గత దశాబ్దకాలంగా ఒక్కో టోర్నీలో ఒక్కో ప్లేయర్ విజేతగా నిలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే..ప్రస్తుత 2022 సీజన్లో మాత్రం స్వియాటెక్ ఏకంగా రెండు టైటిల్స్ నెగ్గడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

2022 సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్వియాటెక్ ..సీజన్ ఆఖరి టోర్నీ యూఎస్ ఓపెన్లో సైతం చాంపియన్ కాగలిగింది.2016 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డుల్లో చేరింది.

తండ్రి ప్రేరణతో ప్రపంచ మేటి టెన్నిస్ ప్లేయర్ గా ఎదిగిన స్వియాటెక్ కెరియర్ లో ఇది 10వ కెరియర్ టైటిల్ కావడం విశేషం. స్వియాటెక్ నెగ్గిన గత పది ఫైనల్స్ లో ఒక్క సెట్ ఓడకుండా విజేతగా నిలవడం మరో అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

యూఎస్ ఓపెన్ టైటిల్ తో పాటు 18కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సైతం స్వియాటెక్ సొంతం చేసుకోగలిగింది.

పాపం! జబేర్...

మరోవైపు..రన్నరప్ జబేర్ ను గ్రాండ్ స్లామ్ ఫైనల్లో దురదృష్టం వెంటాడుతూనే ఉంది. గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి అరబ్ మహిళగా నిలవాలన్న జబేర్ ఆశ అడియాసగానే మిగిలిపోతోంది.

2022 వింబుల్డన్ ఫైనల్లో పోరాడి ఓడి రన్నరప్ ట్రోఫీని అందుకొన్న జబేర్ తిరిగి యూఎస్ ఓపెన్ ఫైనల్స్ చేరినా మరోసారి రన్నరప్ గానే మిగిలాల్సి వచ్చింది. 28 సంవత్సరాల జబేర్ ఆఫ్రికా ఖండ దేశం ట్యునీసియా నుంచి ప్రపంచ మహిళా టెన్నిస్ లోకి దూసుకురాగలిగింది. అమెరికా, యూరోపియన్ దేశాల మహిళలను దీటుగా ఎదుర్కొంటూ జబేర్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేరిన తొలి ఆఫ్రికా, అరబ్ మహిళగా చరిత్ర సృష్టించింది.

First Published:  11 Sep 2022 5:10 AM GMT
Next Story