Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ లో ముంబైతో నేడే యూపీ ఎలిమినేటర్ ఫైట్!

ప్రారంభ మహిళా ఐపీఎల్ లో తొలి నాకౌట్ ఫైట్ కు..ముంబై డీవీ పాటిల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

మహిళా ఐపీఎల్ లో ముంబైతో నేడే యూపీ ఎలిమినేటర్ ఫైట్!
X

ప్రారంభ మహిళా ఐపీఎల్ లో తొలి నాకౌట్ ఫైట్ కు..ముంబై డీవీ పాటిల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఫైనల్లో చోటు కోసం జరిగే ఎలిమినేటర్ రౌండ్లో ముంబై ఇండియన్స్ తో యూపీ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనుంది...

దేశంలోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను తమవైపు తిప్పుకోడానికి నానాపాట్లు పడుతున్న ప్రారంభ మహిళా ఐపీఎల్ లో ఈరోజు జరిగే తొలి నాకౌట్ ( ఎలిమినేటర్ ) రౌండ్ సమరంలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ తో అలీసా హేలీ కెప్టెన్సీలోని యూపీ వారియర్స్ ఢీ కొనబోతోంది. రాత్రి 7-30కి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టుకే..ఈనెల 26న జరిగే టైటిల్ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడే అర్హత దక్కుతుంది.

ముంబై అలా...యూపీ ఇలా...!

ఐదుజట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఐదురౌండ్ల మ్యాచ్ ల్లో వరుస విజయాలు సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా ముంబై నిలిస్తే..యూపీ వారియర్స్ మాత్రం పడుతూ లేస్తూ..ఆఖరి రౌండ్ మ్యాచ్ ల్లో నిలకడగా రాణించడం ద్వారా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

రెండుజట్లలోనూ పలువురు అంతర్జాతీయ ప్లేయర్లు ఉండడంతో ఈ రోజు జరిగే నాకౌట్ సమరం ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వరుస భారీస్కోర్లతో టాప్ గేర్ లో సాగిన ముంబై..ఆరు, ఏడు రౌండ్ల మ్యాచ్ ల్లో బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో నేరుగా ఫైనల్స్ చేరుకోడంలో విఫలమయ్యింది.

హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా, నాట్ స్కీవియర్ బ్రంట్, అమేలీ కెర్, పూజా వస్త్రకర్, ఇసీ వాంగ్ లాంటి పలువురు కీలక ప్లేయర్లతో ముంబై అత్యంత సమతూకంతో కనిపిస్తోంది.

ముంబై స్పిన్నర్ల త్రయం అమేలియా కెర్, సైకా ఇషాక్ చెరో 13 వికెట్లు, స్పిన్ ఆల్ రౌండర్ హేలీ మాథ్యూస్ 12 వికెట్లతో జోరు మీదున్నారు.

మరోవైపు...యూపీ వారియర్స్ జట్టు విదేశీ స్టార్ బ్యాటర్లు అలీసా హేలీ, తహీలియా మెక్ గ్రాత్, గ్రేస్ హారిస్ లపైనే పూర్తిగా ఆధారపడి..ప్లే ఆఫ్ రౌండ్ వరకూ రాగలిగింది.

లీగ్ దశలో తహీలియా మెక్ గ్రాత్ 295 పరుగులు,కెప్టెన్ అలీసా హేలీ 242 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నారు.

బౌలింగ్ లో సోఫీ ఇకెల్ స్టెన్ ( 14 వికెట్లు ), దీప్తి శర్మ,రాజేశ్వరీ గయక్వాడ్ స్పిన్ త్రయంగా ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నారు. 16 సంవత్సరాల లెగ్ స్పిన్నర్ పరాశ్వీ చోప్రా సైతం యూపీ బౌలింగ్ ఎటాక్ లో కీలకంగా మారింది.

హైస్కోరింగా...లో స్కోరింగా?

ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ కు వేదికగా ఉన్న డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం లో లీగ్ దశలో జరిగిన మ్యాచ్ ల్లో అత్యధికంగా 200కు పైగా స్కోరుతో పాటు..అత్యల్పంగా 109 పరుగుల స్కోర్లు నమోదయ్యాయి.

అయితే ..ఈరోజు జరిగే పోరులో ఎంత స్కోరు నమోదు కాగలదని చెప్పడం సాహసమే అవుతుందని క్యూరేటర్ అంటున్నారు. మ్యాచ్ ల కోసం వాడిన పిచ్ లనే మళ్లీ మళ్లీ వాడుతూ రావడంతో.. స్కోరింగ్ రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.

ముంబై ఆల్ రౌండర్ పూజా వస్త్ర్రకర్ గాయంపాలు కావడంతో లెఫ్టామ్ స్పిన్నర్ చోలే ట్రయోన్ ను తుదిజట్టులోకి చేర్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓపెనర్ కమ్ కెప్టెన్, పవర్ ఫుల్ హిట్టర్ అలీసా హేలీ తో పాటు తహీలియా మెక్ గ్రాంత్, గ్రేస్ హారిస్ లపైనే యూపీ వారియర్స్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

బ్యాటింగ్ లో నిలకడగా రాణించిన జట్టుకే ఈరోజు జరిగే పోరులో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరాలంటే..యూపీ వారియర్స్ కెప్టెన్ అలీసా హేలీతో పాటు..తహీలియా మెక్ గ్రాత్, గ్రేస్ హ్యారిస్ లను కట్టడి చేయక తప్పదు.

8 రౌండ్లలో 12 పాయింట్లు సాధించడం ద్వారా..ముంబై కంటే మెరుగైన రన్ రేట్ ప్రాతిపదికన నేరుగా ఫైనల్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..ఆదివారం జరిగే టైటిల్ సమరానికి తగిన విశ్రాంతితో సమాయత్తమవుతోంది.

First Published:  24 March 2023 6:08 AM GMT
Next Story