Telugu Global
Sports

బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. కొన్ని ఆసక్తికరమైన విశేషాలు

1983 వరల్డ్ కప్ జట్టు సెలెక్ట్ చేసే సమయానికి బిన్నీ అసలు జట్టులోనే లేడు. అతడికి వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ వస్తుందని కూడా అనుకోలేదు.

బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. కొన్ని ఆసక్తికరమైన విశేషాలు
X

1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. క్రికెటర్‌, కోచ్, సెలెక్టర్, అడ్మినిస్ట్రేటర్‌గా ఎన్నో పదవులు చేపట్టిన బిన్నీ.. తాజాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుకు చీఫ్‌గా నియమించబడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజర్ బిన్నీ ఒక ఆంగ్లో-ఇండియన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. బిన్నీ పూర్వీకులు స్కాట్లాండ్ నుంచి ఇండియాకు వలస వచ్చారు. బ్రిటిష్ పరిపాలనా కాలంలో బిన్నీ పూర్వికులు ఇక్కడ వ్యాపారంతో పాటు అడ్మినిస్ట్రేటర్లుగా ఉన్నారు. కాగా, స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది బంధువులు, స్నేహితులు ఇండియాను వదిలి తిరిగి స్కాట్లాండ్ వెళ్లినా.. బిన్నీకుటుంబం మాత్రం బెంగళూరులో స్థిరపడింది. పేరుకు ఆంగ్లో-ఇండియన్ అయినా.. మాకు ఇప్పుడు అక్కడ ఎవరూ పరియం లేదు. నేను ఫుల్ ఇండియన్ గానే భావిస్తాను అని బిన్నీ అంటున్నారు.

క్రికెటర్‌గా...

రోజర్ బిన్నీ చిన్నతనంలో స్కూల్ క్రికెట్ ఆడాడు. అప్పట్లో సేలం జిల్లా తరపున తొలి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 11 నెంబర్ బ్యాటర్‌గా దిగి 40 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అందులో బిన్నీ చేసిన స్కోర్ 30 పరుగులు. దీంతో అతడిని తర్వాత మ్యాచ్‌లో ఓపెనర్‌గా పంపించారు. అయితే, బిన్నీ తండ్రి టెరెన్స్ రైల్వేలో గార్డుగా పని చేసేవారు. దీంతో ఆయనకు ఎక్కువగా ట్రాన్స్‌ఫర్స్ అవుతుండేవి. దీంతో బిన్నీ స్కూల్ మారినప్పుడల్లా ఆట కూడా మారిపోయేది. కొన్ని రోజులు క్రికెట్.. మరి కొన్ని రోజులు హాకీ, ఫుట్‌బాల్ గోల్ కీపర్ ఇలా అనేక ఆటలు ఆడాడు. అయితే బిన్నీలో సహజంగా ఓ జావెలిన్ త్రోయర్ ఉన్నాడు. దీంతో జావెలెన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు. అదే సమయంలో క్రికెట్‌లో బౌలింగ్ కూడా చేసేవాడు. ఇలా నెమ్మదిగా ఓ మంచి స్వింగ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా బిన్నీ మారిపోయాడు.

1983 వరల్డ్ కప్ జట్టు సెలెక్ట్ చేసే సమయానికి బిన్నీ అసలు జట్టులోనే లేడు. అతడికి వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ వస్తుందని కూడా అనుకోలేదు. ఇంగ్లాండ్ పరిస్థితులకు బిన్నీ సరిపోతాడని భావించి అతడిని ఎంపిక చేశారు. భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంతో బిన్నీది కీలకపాత్ర. ఆ సిరీస్‌లో బిన్నీ అత్యధిక వికెట్లు (18) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. లార్డ్స్‌లో ఓ స్కోరర్ బిన్నీకి ఈ విషయం చెప్పే వరకు అతడికి తెలియనే తెలియదంటా.

బిన్నీపై జావెలిన్ త్రో ప్రభావం ఎక్కువగా ఉండేది. ఒక సారి ముంబైలోని సమ్మర్ క్యాంప్‌కు వెళితే అక్కడి కోచ్ హేమూ అధికారి బిన్నీని గమనించాడు. అందరు బౌలర్లు ఒక కాలు ముందు భూమికి ఆనించి బంతి విసురుతారు. అయితే బిన్నీ మాత్రం ముందు కాలు గాల్లో ఉండగానే బంతిని విసిరేవాడు. జావెలిన్ త్రో ప్రభావం వల్ల అతడు అలాంటి వినూత్నమైన యాక్షన్ కలిగి ఉండేవాడు. దాన్నిమార్చడానికి హేమూ అధికారి తీవ్ర ప్రయత్నం చేశాడు. కాలికి వెదురు బొంగులు కట్టి, బరువైన షూ వేసి దాన్ని భూమిపై ఆనేలా చేయడానికి ట్రై చేశాడు. కానీ బిన్నీ మాత్రం తన సహజ శైలిలోనే బంతులు విసిరేవాడు. దీంతో ఇక చేసేదేమీ లేక.. నీ స్టైల్‌లోనే నువ్వు బౌలింగ్ చెయ్యి అని వదిలేశాడు.

కోచ్‌గా..

క్రికెటర్‌గా రిటైర్ అయిన తర్వాత రోజర్ బిన్నీ కొంత కాలం బెంగళూరుకే పరిమితం అయ్యారు. అయితే 2000లో అతడిని ఇండియా అండర్ - 19 జట్టు కోచ్‌గా నియమించారు. అతడు కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత జట్టు తొలి అండర్ - 19 వరల్డ్ కప్ గెలిచింది. అప్పడు ఆ జట్టుకు మహ్మద్ కైఫ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఫైనల్‌లో శ్రీలంకపై గెలిచి కప్ కొట్టడంలో కోచ్ పంపిన సందేశాలు సహాయపడ్డాయని స్వయంగా కైఫ్ చెప్పాడు. అండర్ - 19 వరల్డ్ కప్ గెలిపించడంతో తర్వాత సీనియర్ జట్టుకు కోచ్ అవుతాడని అందరూ భావించారు. బిన్నీ కూడా టీమ్ ఇండియా కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. కానీ, బీసీసీఐ జాన్ రైట్‌ను కోచ్‌గా నియమించింది. ఇండియాకు తొలి ఫారిన్ కోచ్‌గా జాన్ రైట్ ఎన్ని వివాదాలు సృష్టించాడో క్రికెట్ ప్రేమికులు ఎన్నడూ మరవలేరు. బిన్నీ ఆ తర్వాత ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ తరపున నాన్-టెస్ట్ ప్లేయింగ్ జట్లకు కోచ్‌గా కొన్నాళ్లు పని చేశాడు.

సెలెక్టర్‌, అడ్మినిస్ట్రేటర్‌గా..

బీసీసీఐ సెలెక్టర్‌గా రోజర్ బిన్నీ మూడేళ్లు పని చేశాడు. ఆయన సెలక్షన్ కమిటీలో ఉన్నప్పుడే కొడుకు స్టువర్ట్ బిన్నీ టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు. తండ్రి వల్లే స్టువర్ట్ బిన్నీకి అనేక అవకాశాలు వస్తున్నాయని అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే సెలెక్షన్ కమిటీ భేటీ జరిగినప్పుడు.. ఆల్‌రౌండర్ స్పాట్ కోసం చర్చ జరిగితే రోజర్ బిన్నీ సైలెంట్‌గానే ఉండేవాడని అప్పటి కమిటీలో ఉన్న సభ్యులు చెబుతుంటారు. కానీ, అదే సమయంలో స్టువర్ట్‌ బిన్నీకి అవకాశాలు ఎక్కువగా రావడం యాదృశ్చికమే అని అంటారు. దానిపై మాత్రం బిన్నీ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇక మూడేళ్ల క్రితం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కున్నది. వాళ్లు నిర్వహించే టీ20 లీగ్‌లో అవకతవకలు జరిగినట్లు వార్తలు రావడంతో సీబీఐ దర్యాఫ్తు కూడా జరిగింది. దీంతో అప్పటి పాలకమండలి మొత్తం రద్దయ్యింది. అప్పుడు రోజర్ బిన్నీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అసోసియేషన్‌పై పడిన మచ్చను చెరిపేసి.. తిరిగి పాలన గాడిలో పెట్టడానికి తీవ్రంగా కృషి చేశారు. పరిపాలకుడిగా ఆయన పనిని చూసే ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

బందీపూర్‌లో ఫామ్ హౌస్..

క్రికెట్ కాకుండా బిన్నీ మంచి గోల్ఫ్ ప్లేయర్. అంతే కాకుండా అతడికి చేపల వేట అంటే చాలా ఇష్టం. కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌ను ఆనుకొని రోజర్ బిన్నీకి ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆయన ఎక్కువగా అక్కడే గడుపుతుంటారు. ఇటీవల ఆయన ఫామ్‌ హౌస్‌లో పెంచుతున్న మామిడి చెట్లను ఏనుగులు దాడి చేసి మొత్తం నాశనం చేశాయి. ఆయన అదే సమయంలో బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి ముంబై వెళ్లారు. తిరిగి వచ్చి ఫామ్‌హౌన్‌ను బాగుచేసే పనిలో పడ్డారు. అన్నట్లు బిన్నీ ఫామ్ హౌస్‌లో చిరుత పులులు (లెపార్డ్) కోసం ప్రత్యకంగా నీళ్ల తొట్లు కూడా ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు అవి వచ్చి నీళ్లు తాగిపోతుండటం తాను గమనిస్తూనే ఉంటానని బిన్నీ చెబుతుంటాడు.

నాన్ పొలిటికల్ పర్సన్..

ప్రస్తుతం బీసీసీఐ టాప్ అడ్మినిస్ట్రేటర్లుగా ఎన్నికైన వారిలో ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేని ఏకైక వ్యక్తి రోజర్ బిన్నీ. బోర్డులో చాలా మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వ్యక్తులు.. నేరుగా రాజకీయాలతో సంబంధాలు ఉన్న వారు ఉన్నారు. కానీ బిన్నీకి ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేదు. రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులకు కట్టబెడితే ఐసీసీ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతున్నది. అయితే బిన్నీ లాంటి వ్యక్తి ఈ పదవికి గౌరవాన్ని తీసుకొస్తారని అందరూ అంటున్నారు. రాబోయే రోజుల్లో బీసీసీఐని మరో లెవెల్‌కి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని బిన్నీ చెబుతున్నారు.

First Published:  18 Oct 2022 11:20 AM GMT
Next Story