Telugu Global
Sports

జింబాబ్వేకు ఝలక్, ప్రపంచకప్ కు ఉగాండా అర్హత!

2024 టీ-20 ప్రపంచకప్ కు ఆఫ్రికా పసికూన ఉగాండా తొలిసారిగా అర్హత సంపాదించింది. జింబాబ్వేతో సహా పలుజట్లపై విజయాలతో ఈ ఘనత సాధించింది.

జింబాబ్వేకు ఝలక్, ప్రపంచకప్ కు ఉగాండా అర్హత!
X

2024 టీ-20 ప్రపంచకప్ కు ఆఫ్రికా పసికూన ఉగాండా తొలిసారిగా అర్హత సంపాదించింది. జింబాబ్వేతో సహా పలుజట్లపై విజయాలతో ఈ ఘనత సాధించింది.

ప్రపంచ క్రికెట్లో సమీకరణలు మారిపోతున్నాయి. టెస్ట్ హోదా పొందిన జట్లపై అసోసియేట్ హోదా కలిగిన పసికూనజట్లు సంచలన విజయాలు సాధిస్తూ తమ ఉనికిని చాటుకొంటున్నాయి.

భారత్ వేదికగా ఇటీవలే ముగిసిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ వెస్టిండీస్, జింబాబ్వేజట్లు అర్హత సాధించడంలో విఫలం కాగా..నెదర్లాండ్స్ ఫైనల్ రౌండ్ చేరడంతో పాటు లీగ్ దశలో రెండు సంచలన విజయాలతో కలకలమే రేపింది.

2024 టీ-20 ప్రపంచకప్ రేస్ లో....

వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో 2024 జూన్ నెలలో జరుగనున్న ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు ఆఫ్రికా పసికూన ఉగాండా తొలిసారిగా అర్హత సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది.

ఆఫ్రికా క్వాలిఫైయర్స్ టోర్నీలో జింబాబ్వే లాంటి టెస్టు హోదా పొందిన జట్టును కంగుతినిపించడం ద్వారా ఉగాండా ప్రపంచకప్ బెర్త్ ను సంపాదించగలిగింది.

పక్కా ప్రణాళికతో ప్రపంచకప్ కు అర్హత...

క్రికెట్ నేపథ్యం, మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేని ఉగాండా 2024 ప్రపంచకప్ కు అర్హత సాధించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకట్టుకొంది. అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేని ఉగాండాలో కేవలం 60 మంది ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. వీరినుంచే 15 మంది సభ్యుల ఉగాండా తుదిజట్టును ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది.

పలువురు విద్యార్థులు, సెమీప్రొఫెషనల్స్ తో కూడిన ఉగాండాజట్టులో భారత సంతతి క్రికెటర్లు కీలకంగా ఉన్నారు.

జింబాబ్వేను మించిన ఉగాండా!

నమీబియా వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ ఆఫ్రికాజోన్ అర్హత పోటీలలో ఉగాండా వరుస విజయాలతో సంచలనం సృష్టించింది. లీగ్ దశలో రువాండాను 9 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా 2024 ప్రపంచకప్ బెర్త్ ను సొంతం చేసుకోగలిగింది. నమీబియాతో పాటు ఉగాండా సైతం 20 జట్ల ప్రపంచకప్ కు అర్హత సాధించగలిగింది.

లీగ్ ప్రారంభమ్యాచ్ లో టాంజానియాను 8 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా శుభారంభం చేసిన ఉగాండా కు రెండోరౌండ్లో మాత్రం నమీబియాచేతిలో ఓటమి తప్పలేదు.

జింబాబ్వేతో జరిగిన కీలకపోరులో ఉగాండా5 వికెట్ల సంచలన విజయం నమోదు చేసింది.

జింబాబ్వే 20 ఓవర్లలో 7వికెట్లకు 136 పరుగులకే పరిమితమయ్యింది. సమాధానంగా ఉగాండా 5 వికెట్ల నష్టానికే లక్ష్యం చేరుకోగలిగింది. ఉగాండా బ్యాటర్లలో రియాజత్ అలీ ఖాన్ 42, అల్పేశ్ రామ్ జానీ 40 పరుగుల స్కోర్లతో తమజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.

5వ ఆఫ్రికాజట్టు గా ఉగాండా...

టీ-20 ప్రపంచకప్ కు అర్హత సాధించిన ఐదవ ఆఫ్రికా జట్టుగా ఉగాండా రికార్డుల్లో చేరింది. మరోవైపు..చివరిసారి 2022 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొన్న జింబాబ్వే..

ఆ తరువాతి రెండు ప్రపంచకప్ లకు అర్హత సాధించడంలో విఫలమయ్యింది. 2024 ప్రపంచకప్ లో జింబాబ్వేకు బదులుగా ఉగాండా బరిలోకి దిగుతోంది.

జాతీయస్థాయిలో కేవలం 60 మంది ఆటగాళ్ల నుంచే ఉగాండా ప్రపంచకప్ అర్హత కోసం జట్టును ఎంపిక చేసుకొని..మూడేళ్ల ప్రణాళికతో తొలిసారిగా ప్రపంచకప్ బెర్త్ సంపాదించగలిగింది.

20 జట్లతో 2024 ప్రపంచకప్!

2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను మొత్తం 20 జట్లతో నిర్వహించనున్నారు. ఈ 20 జట్లలో ఆఫ్రికా క్వాలిఫైయర్స్ నుంచి నమీబియాతో పాటు ఉగాండా సైతం అర్హత సంపాదించగలిగింది.

ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తున్నజట్లుగా వెస్టిండీస్, అమెరికా జట్లు అర్హత రౌండ్లలో పాల్గొనకుండానే నేరుగా బరిలోకి దిగనున్నాయి.

మిగిలిన 16 జట్లలో అప్ఘనిస్థాన్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి.

2007లో ప్రారంభమైన టీ-20 ప్రపంచకప్ చరిత్రలో 20 జట్లతో టోర్నీ నిర్వహించనుండడం ఇదే మొదటిసారి.

First Published:  3 Dec 2023 8:24 AM GMT
Next Story