Telugu Global
Sports

టీ-20 ల్లో మరో రెండు సరికొత్తలీగ్ లు!

అంతర్జాతీయ క్రికెట్లో టీ-20 లీగ్ ల వ్యాపారం మూడుపువ్వులు-ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. ఏడాది ఏడాదికీ లీగ్ ల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో వివిధ దేశాలకు చెందిన స్టార్ టీ-20 ఆటగాళ్లకు ఎక్కడలేని డిమాండ్ పెరిగిపోతోంది.

టీ-20 ల్లో మరో రెండు సరికొత్తలీగ్ లు!
X

అంతర్జాతీయ క్రికెట్లో టీ-20 లీగ్ ల వ్యాపారం మూడుపువ్వులు-ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. ఏడాది ఏడాదికీ లీగ్ ల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో వివిధ దేశాలకు చెందిన స్టార్ టీ-20 ఆటగాళ్లకు ఎక్కడలేని డిమాండ్ పెరిగిపోతోంది.

ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి ) ఆధ్వర్యంలో ఏటా జరిగే వన్డే, టీ-20, టెస్ట్ లీగ్ టోర్నీలతో ప్రమేయం లేకుండా వివిధ దేశాల క్రికెట్ బోర్డులు తమతమ దేశవాళీ క్రికెట్ లీగ్ లు నిర్వహిస్తూ వస్తున్నాయి.

సరికొత్తగా మరో రెండు లీగ్ లు..

ప్రపంచ టీ-20 సర్క్యూట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీకావు, అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ గా గుర్తింపు సంపాదించిన ఐపీఎల్ తో మిగిలిన లీగ్ లు పోటీపడలేకపోతున్నాయి.

ఆటగాళ్ల పారితోషికం, మ్యాచ్ ల నిర్వహణ, అభిమానుల ఆదరణ, ప్రసారహక్కుల ద్వారా రాబడి విషయంలో ఐపీఎల్ ముందు మిగిలిన లీగ్ లు దిగదుడుపే.

ఐపీఎల్ తర్వాతి స్థానంలో బీబీఎల్..

ఐపీఎల్ తర్వాత అత్యంత జనాదరణ పొందుతున్న టీ-20 లీగ్ గా ఆస్ట్ర్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ కు పేరుంది. గత 11 సీజన్లుగా అత్యంత విజయవంతంగా కొనసాగుతూ వస్తున్న బీబీఎల్ 12వ సీజన్ మ్యాచ్ లు డిసెంబర్ 13 నుంచి 2023 ఫిబ్రవరి 4 వరకూ జరుగనున్నాయి.

ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొమ్మిదేళ్ల విరామం తర్వాత తమ దేశంలో జరిగే బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనబోతున్నాడు. సిడ్నీథండర్స్ జట్టుకు వచ్చే రెండేళ్లపాటు ఆడటానికి కాంట్రాక్టు కుదుర్చుకొన్నాడు.

35 సంవత్సరాల డేవిడ్ వార్నర్ గత తొమ్మిది సంవత్సరాలుగా బీబీఎల్ ను కాదని ఐపీఎల్ కే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాడు.

ఎమిరేట్స్ వేదికగా ఇంటర్నేషనల్ లీగ్..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మొట్టమొదటి ఇంటర్నేషనల్ టీ-20 లీగ్ కు రంగం సిద్ధమయ్యింది. ఎమిరేట్స్ క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ఈ లీగ్ లో అబుదాబి నైట్ రైడర్స్, దుబాయ్ క్యాపిటల్స్, డిజర్ట్ వైపర్స్, గల్ఫ్ జెయింట్స్, ముంబై ఎమిరేట్స్, షార్జా వారియర్స్ జట్లు తలపడనున్నాయి.

ఈ ఆరు జట్ల ఆటగాళ్ల కోసం ఆరు ఫ్రాంచైజీల యాజమాన్యాలు వేటను మొదలు పెట్టాయి. రషీద్ ఖాన్, కిరాన్ పోలార్డ్, డ్వయన్ బ్రావోతో సహా పలువురు విఖ్యాత టీ-20 క్రికెటర్ల కోసం హోరాహోరీ పోటీ నెలకొంది. 2023 జనవరి లేదా ఫిబ్రవరి మాసాలలో ఈ లీగ్ ను వారం రోజులపాటు నిర్వహించనున్నారు.

దక్షిణాఫ్రికా టీ-20 లీగ్..

మరోవైపు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం సొంతంగా ఓ టీ-20 లీగ్ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. 2023 జనవరి లేదా ఫిబ్రవరి మాసాలలో జరిగే ఈ లీగ్ పోరులో

మొత్తం ఆరు ( ముంబై కేప్ టౌన్, జోహెన్స్ బర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ )జట్లు తలపడనున్నాయి. ఈ ఆరు జట్లనూ భారత్ కు చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే సొంతం చేసుకొన్నాయి.

ఇప్పటికే..శ్రీలంక ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లండ్ వేదికగా హండ్రెడ్స్ లీగ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

భారత క్రికెటర్లందరూ ఐపీఎల్ లో మాత్రమే ఆడాలని నిబంధన ఉండటంతో మిగిలిన లీగ్ లన్నీ వెలవెల బోతున్నాయి. భారీకాంట్రాక్టులు దక్కడంతో ప్రముఖ విదేశీ క్రికెట్ స్టార్లంతా మిగిలిన లీగ్ ల కంటే ఐపీఎల్ కే తొలి ప్రాధాన్యమిస్తున్నారు.

First Published:  21 Aug 2022 7:15 AM GMT
Next Story