Telugu Global
Sports

ఒలింపిక్స్ కు మరో ఇద్దరు భారత వస్తాదుల అర్హత!

పారిస్ ఒలింపిక్స్ కుస్తీ పోటీలలో పాల్గొనటానికి భారత్ కు చెందిన మరో ఇద్దరు వస్తాదులు అర్హత సాధించారు. మహిళల విభాగంలో భారత రెజ్లర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ఒలింపిక్స్ కు మరో ఇద్దరు భారత వస్తాదుల అర్హత!
X

పారిస్ ఒలింపిక్స్ కుస్తీ పోటీలలో పాల్గొనటానికి భారత్ కు చెందిన మరో ఇద్దరు వస్తాదులు అర్హత సాధించారు. మహిళల విభాగంలో భారత రెజ్లర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ఒలింపిక్స్ కుస్తీ చరిత్రలో ఐదుగురు భారత మహిళలు తొలిసారిగా అర్హత సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు. పురుషుల విభాగంలో అర్హత సాధించిన భారత తొలి మల్లయోధుడుగా అమన్ షెరావత్ నిలిచాడు.

పరువు దక్కించిన అమన్....

పారిస్ ఒలింపిక్స్ కుస్తీ పురుషుల విభాగంలో అర్హత సాధించిన భారత తొలి రెజ్లర్ గా అమన్ షెరావత్ నిలిచాడు. పురుషుల 57 కిలోల విభాగంలో అమన్ భారత్ తరపున బరిలో నిలువనున్నాడు.

టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ కుస్తీ అర్హత పోటీలలో సత్తా చాటుకోడం ద్వారా అమన్ పారిస్ గేమ్స్ బెర్త్ ను ఖాయం చేసుకోగలిగాడు.

పురుషుల ఫ్రీ-స్టయిల్ కుస్తీ 57 కిలోల విభాగం సెమీఫైనల్లో ఉత్తర కొరియా వస్తాదు చోంగ్ సాంగ్ హాన్ ను 12-2 పాయింట్లతో అమన్ చిత్తు చేయడం ద్వారా ఫైనల్స్ కు అర్హత సాధించాడు.

తొలిరౌండ్ నుంచి సెమీస్ వరకూ జార్జి వాంగ్లేవ్ పైన 10-4, ఉక్రెయిన్ వస్తాదు ఆండ్రీ యాస్టెంకో పైన 12-2, సెమీఫైనల్లో చోంగ్ సాంగ్ పైన 12-2 పాయింట్లతో అమన్ తిరుగులేని విజయాలు నమోదు చేశాడు.

ఫెనల్స్ చేరిన ఇద్దరు వస్తాదులకూ పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అర్హత దక్కుతుంది. ఇదే విభాగంలో పోటీకి దిగిన భారత మరో వస్తాదు, టోక్యో గేమ్స్ రజత పతక విజేత రవి దహియాకు సైతం ఒలింపిక్స్ బెర్త్ దక్కే అవకాశాలు మెరుగయ్యాయి.

పురుషుల 65 కిలోల విభాగంలో సుజీత్ కాలాకు సెమీఫైనల్లో ఓటమి ఎదురుకావడంతో ఒలింపిక్స్ బెర్త్ చేజారింది. మంగోలియా వస్తాదు తుల్గా చేతిలో 6-1తో సుజీత్ పరాజయం చవిచూశాడు.

భారత స్టార్ వస్తాదు దీపక్ పూనియా తన ప్రారంభ రౌండ్ పోరులోనే చైనా వస్తాదు జ్యుషెన్ లిన్ చేతిలో ఓటమి పొందటం ద్వారా పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం చేజార్చుకొన్నాడు.

గ్రీకో- రోమన్ కుస్తీ బరిలో నిలిచిన ఆరుగురు భారత వస్తాదులూ ఘోరంగా విఫలమయ్యారు. పారిస్ ఒలింపిక్‌ బెర్త్ లకు దూరమయ్యారు.

ఐదుకు ఐదు బెర్త్ లూ సాధించిన భారత్....

మహిళల ఫ్రీ-స్టయిల్ కుస్తీలో తనకు అందుబాటులో ఉన్న పారిస్ ఒలింపిక్స్ ఐదు బెర్త్ లను భారత్ తొలిసారిగా సొంతం చేసుకోగలిగింది. మహిళల 68 కిలోల విభాగంలో భారత మల్లయోధురాలు నిషా దహియా ఫైనల్స్ చేరుకోడం ద్వారా భారత్ కు 5వ బెర్త్ ఖాయం చేసింది.

ఇస్తాంబుల్ లో జరుగుతున్న ఒలింపిక్స్ అర్హత కుస్తీ మహిళల 68 కిలోల సెమీఫైనల్లో రుమేనియా వస్తాదు అలెగ్జాండ్రా ఏంజెల్ ను నిషా 8-4తో చిత్తు చేసింది.

ఒలింపిక్స్ మహిళా కుస్తీ ఐదు విభాగాలలో భారత వస్తాదులకు అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

తొలిరౌండ్లో బైలో రష్యన్ వస్తాదు అలీనా షాచుక్ ను 3-0తో ఓడించిన నిషా క్వార్టర్ ఫైనల్లో చెక్ వస్తాదు అడెలా హాంజ్లీకోవాను 7-4తో అధిగమించింది.

పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరుగనున్నాయి. 120 మందికి పైగా అథ్లెట్ల బృందంతో పారిస్ ఒలింపిక్స్ పతకాల వేటకు దిగాలని భారత్ భావిస్తోంది.

First Published:  12 May 2024 6:55 AM GMT
Next Story