Telugu Global
Sports

యూఎస్ ఓపెన్లో జోకోవిచ్ కు దక్కని టాప్ సీడింగ్!

2023 సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అమెరికన్ ఓపెన్ కు న్యూయార్క్ నగరంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. వెటరన్ స్టార్ నొవాక్ జోకోవిచ్ టాప్ సీడింగ్ దక్కించుకోడంలో మరోసారి విఫలమయ్యాడు.

యూఎస్ ఓపెన్లో జోకోవిచ్ కు దక్కని టాప్ సీడింగ్!
X

యూఎస్ ఓపెన్లో జోకోవిచ్ కు దక్కని టాప్ సీడింగ్!

2023 సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అమెరికన్ ఓపెన్ కు న్యూయార్క్ నగరంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. వెటరన్ స్టార్ నొవాక్ జోకోవిచ్ టాప్ సీడింగ్ దక్కించుకోడంలో మరోసారి విఫలమయ్యాడు...

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ సీడింగ్స్ ను నిర్వాహక సంఘం ప్రకటించింది. ఆగస్టు 28 నుంచి న్యూయార్క్ లోని బిల్లీజీన్ కింగ్ టెన్నిస్ సెంటర్ కాంప్లెక్స్ వేదికగా రెండువారాలుపాటు సాగే ప్రస్తుత సీజన్ ఈ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో స్పానిష్ యువసంచలనం కార్లోస్ అల్ కరాజ్, పోలిష్ స్టార్ ఇగా స్వియాటెక్ టాప్ సీడింగ్స్ దక్కించుకొన్నారు.

రెండుసార్లు విజేత, గ్రాండ్ స్లామ్ కింగ్ నొవాక్ జోకోవిచ్ వరుసగా మూడో గ్రాండ్ స్లామ్ టోర్నీలో సైతం టాప్ సీడింగ్ హోదా లేకుండా పోటీకి దిగుతున్నాడు. ఆగస్టు 21 వరకూ ఉన్న ర్యాంకింగ్స్ ఆధారంగా పురుషుల, మహిళల విభాగాలలో సీడింగ్స్ ను ఖరారు చేశారు.

రెండోసీడ్ గా జోకోవిచ్...

పురుషుల సింగిల్స్ లో స్పానిష్ నయాసంచలనం కార్లోస్ అల్ కరాజ్ టాప్ సీడ్ గా టైటిల్ వేటకు దిగుతున్నాడు. గతేడాది అమెరికన్ ఓపెన్ విజేతగా సంచలనం సృష్టించిన అల్ కరాజ్ కొద్దివారాల క్రితమే ముగిసిన వింబుల్డన్ టైటిల్ ను గెలుచుకోడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను నిలుపుకోగలిగాడు.

సిన్ సినాటీ మాస్టర్స్ ఫైనల్లో అల్ కరాజ్ పై జోకోవిచ్ విజయం సాధించినా టాప్ ర్యాంక్ కు చేరుకోలేకపోయాడు.

20 సంవత్సరాల అల్ కరాజ్ ప్రస్తుత గ్రాండ్ స్లామ్ సీజన్లో వరుసగా మూడో గ్రాండ్ స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ హోదా సంపాదించగలిగాడు. జోకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గితే..అల్ కరాజ్ వింబుల్డన్ విజేతగా నిలిచాడు.

ప్రస్తుత యూఎస్ ఓపెన్లో జోకోవిచ్ రెండు, 2021 సీజన్ విన్నర్ డానిల్ మెద్వదేవ్ మూడు సీడ్లుగా ఉన్నారు.

స్వియాటెక్ కే టాప్ సీడింగ్...

మహిళల సింగిల్స్ లో పోలెండ్ సూపర్ స్టార్ ఇగా స్వియాటెక్ టాప్ సీడ్ హోదాలో టైటిల్ వేటకు దిగుతోంది. డబ్లుటిఏ ర్యాంకింగ్స్ లో గత 73 వారాలుగా తిరుగులేని నంబర్ వన్ గా ఉంటూ వస్తున్న స్వియాటెక్ గత ఏడు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో మూడుసార్లు టాప్ సీడ్ గానే టైటిల్స్ సాధించింది.

2022, 2023 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ తో పాటు 2022 యూఎస్ టైటిల్ ను సైతం స్వియాటెక్ గెలుచుకొంది.

అమెరికా ఆశాకిరణం కోకో గాఫ్...

మహిళల సింగిల్స్ లో సబాలెంకా, జెస్సికా పెగ్యులా, ఎలెనా రిబకోవా, ఓన్స్ జబేర్ మొదటి ఐదు సీడెడ్ ప్లేయర్లుగా ఉన్నారు. అమెరికా సంచలనం 20 ఏళ్ళ కోకో గాఫ్ కు 6వ సీడింగ్ దక్కింది. కారోలినా గార్సియా 7, మారియా సక్కరి 8, మార్కెటా వోండ్రుసోవా 9, కారోలినా ముచోవా 10 సీడ్లుగా తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

గత మూడు వారాలలో అమెరికా జోడీ కోకో, పెగ్యులా కలసి మూడు టూర్ టైటిల్స్ నెగ్గడం ద్వారా సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నారు. టాప్ సీడ్ స్వియాటెక్ కు ఈ జోడీనే గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మూడు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో రన్నరప్ గా నిలిచిన ట్యునీసియా థండర్ ఓన్స్ జబేర్ సైతం టైటిల్ రేస్ లో ప్రముఖంగా కనిపిస్తోంది. గతేడాది అమెరికన్ ఓపెన్, ప్రస్తుత సీజన్ వింబుల్డన్ టోర్నీల ఫైనల్స్ చేరినా జబేర్ రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎలీనా స్వితోలినా 26వ సీడ్ గా పోటీకి దిగుతోంది.

మొత్తం 32మంది ప్లేయర్ల మహిళల ప్రధాన డ్రాలో చెక్ రిపబ్లిక్ కు చెందిన వోండ్రుసోవా, ముచోవా, పెట్రా క్విటోవా, బార్బరా క్రెజిసికోవా, కారోలినా ప్లిసికోవా, మేరీ బుజుకోవా చోటు సంపాదించడం సరికొత్త రికార్డుగా నిలిచిపోతుంది.

పురుషుల సింగిల్స్ లో అల్ కరాజ్, జోకోవిచ్ హాట్ ఫేవరెట్లుగా ఉంటే..మహిళల సింగిల్స్ లో ఇగా స్వియాటెక్ తిరుగులేని చాంపియన్ గా ఉంటూ వస్తోంది.

First Published:  23 Aug 2023 6:15 AM GMT
Next Story