Telugu Global
Sports

నేడే భారత్ -న్యూజిలాండ్ రెండో టీ-20

ప్రపంచకప్ సెమీఫైనలిస్టులు భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ లోని రెండోఆటకు బే ఓవల్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది.

నేడే భారత్ -న్యూజిలాండ్ రెండో టీ-20
X

ప్రపంచకప్ సెమీఫైనలిస్టులు భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ లోని రెండోఆటకు బే ఓవల్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. వరుణుడు కరుణిస్తే..

భారత కాలమానం ప్రకారం ఉదయం 12 గంటలకు ప్రారంభమవుతుంది....

పేస్-స్వింగ్ బౌలర్ల స్వర్గం న్యూజిలాండ్ గడ్డపై ప్రస్తుత సీజన్లో తొలి టీ-20 సిరీస్ విజయానికి హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని భారతజట్టు ఉరకలేస్తోంది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా వెలింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలిపోరు ఒక్కబంతీ పడకుండానే వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిపోడంతో ...ఈ రెండో మ్యాచ్ రెండుజట్లకూ కీలకంగా మారింది.

భారతజట్టుకు యువరక్తం..

ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన టీ-20 ప్రపంచకప్ లో భారత్ కు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, వెటరన్ స్పిన్నర్ అశ్విన్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, ఓపెనర్ కెఎల్ రాహుల్ లాంటి పలువురు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే న్యూజిలాండ్ తో సిరీస్ కు భారత్ సిద్ధమయ్యింది.

యువఆటగాళ్లు శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, దూకుడుగా ఆడటానికి మరో పేరైన శ్రేయస్ అయ్యర్, మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రన్ మాలిక్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, డేరింగ్ అండ్ డాషింగ్ హిట్టర్ సంజు శాంసన్ మరోసారి సత్తా చాటుకోడానికి ఎదురుచూస్తున్నారు. హార్థిక్ పాండ్యా సైతం కెప్టెన్ గా తానేమిటో నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

కివీలను కలవర పెడుతున్న సూర్యకుమార్...

మరోవైపు..ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు సైతం ట్రెంట్ బౌల్ట్, మార్టిన్ గప్టిల్ లాంటి సీనియర్లకు విశ్రాంతి నిచ్చి మరీ బరిలోకి దిగుతోంది. కేన్ విలియమ్స్ సన్ కెప్టెన్సీలోని

కివీజట్టులో ఆడం మిల్నీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్, మిషెల్ సాంట్నర్, సూపర్ హిట్టర్లు ఫిన్ అలెన్, డేవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిషెల్, జేమ్స్ నీషమ్ లతో

సమతూకంతో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. స్వదేశీ వాతావరణంలో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా పేరున్న న్యూజిలాండ్ ను కంగుతినిపించాలంటే భారతయువజట్టు స్థాయికి తగ్గట్టుగా రాణించక తప్పదు.

అత్యధిక వికెట్ల రికార్డుకు భువీ రెడీ...

న్యూజిలాండ్ లోని ఎముకలు కొరికే చలి వాతావరణం, గ్రీన్ టాప్ పిచ్ లు..స్వింగ్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. కుదురైన లైన్ -లెంగ్త్ కు ఇన్,అవుట్ స్వింగర్లను జోడిస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో భువీ తర్వాతే ఎవరైనా.

భారత పేస్ బౌలింగ్ విభాగానికి ప్రస్తుత సిరీస్ లో పెద్దదిక్కుగా ఉన్న భువనేశ్వర్ కుమార్ తన టీ-20 కెరియర్ లో ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ సెమీఫైనల్స్ వరకూ భారత్ తరపున ఆడిన 85 మ్యాచ్ ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. వీటిలో సగానికి పైగా వికెట్లు పవర్ ప్లే ఓవర్లలో పడగొట్టినవే కావడం మరో రికార్డు.

ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటి వరకూ 30 మ్యాచ్ ల్లో 36 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి రెండుమ్యాచ్ ల్లో భువీ మరో నాలుగు వికెట్లు పడగొట్టగలిగితే..ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ పేరుతో ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును అధిగమించగలుగుతాడు.

2022 టీ-20 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ నమోదు చేసిన ఇద్దరు బౌలర్లలో ఒకడిగా నిలిచిన జోషువా లిటిల్ 39 వికెట్లతో బౌలర్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.

36 వికెట్లతో భువీ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

సూర్యకుమార్ తహతహ...

ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన టీ-20 ప్రపంచకప్ లోని ఫాస్ట్ -బౌన్సీ పిచ్ లపై తన 360 డిగ్రీల బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్ కివీల్యాండ్ లోని సీమ్- స్వింగ్ పిచ్ లపైన ఏ రేంజ్ లో రాణించగలడన్నది ఆసక్తికరంగా మారింది. సూర్య నిలదొక్కుకొంటే..చిన్న బౌండ్రీ లైన్లతో కూడిన కివీ పిచ్ లపైన సిక్సర్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక.. యువఓపెనర్ శుభమన్ గిల్ భారత తరపున టీ-20ల్లో ఈరోజు అరంగేట్రం చేయనున్నాడు. మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రన్ మాలిక్ జులై తరువాత తన తొలి అంతర్జాతీయమ్యాచ్ కు సిద్ధమయ్యాడు.

హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని భారతజట్టు సభ్యుల్లో రిషభ్ పంత్, శుభ్ మన్ గిల్, ఇశాంత్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

భారతజట్టు చీఫ్ కోచ్ గా వీవీఎస్...

భారతజట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సహాయక బృందం సైతం బ్రేక్ తీసుకోడంతో జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ తన సహయక బృందంతో న్యూజిలాండ్ పర్యటన బాధ్యతలు నిర్వర్తించనున్నారు..

ఈరోజు జరిగే రెండో మ్యాచ్ కు సైతం వానతో అంతరాయం కలిగే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఇటు నిర్వాహక సంఘం, అటు రెండుజట్ల ఆటగాళ్లు, అభిమానులు కలవర పడుతున్నారు.

వరుణుడు కరుణిస్తే మాత్రం ఈ సమఉజ్జీల సూపర్ సండే సమరం రంజుగా, రసపట్టుగా సాగడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత కాలమానం ప్రకారం ఉదయం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

First Published:  20 Nov 2022 5:39 AM GMT
Next Story