Telugu Global
Sports

నేడే రెండో టీ-20..విరాట్ రికార్డుకు సూర్య గురి!

ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో వరుసగా రెండోవిజయానికి టాప్ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది.

నేడే రెండో టీ-20..విరాట్ రికార్డుకు సూర్య గురి!
X

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల ఐదుమ్యాచ్ ల టీ-20 సర్కస్ విశాఖ నుంచి తిరువనంతపురానికి చేరింది. ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో వరుసగా రెండోవిజయానికి టాప్ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ ముగిసిందో లేదో...మరి కొద్దిమాసాలలో జరిగే ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు టాప్ ర్యాంకర్ భారత్ సన్నాహాలను జోరుగా మొదలు పెట్టింది.

టీ-20 ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 4వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో పాంచ్ పటాకా సిరీస్ ను గెలుపుతో ప్రారంభించిన భారత్ వరుసగా రెండో విజయానికి గురిపెట్టింది.

అందరి చూపు సూర్య పైనే.....

విశాఖ వేదికగా ముగిసిన సూపర్ థ్రిల్లర్ తొలి పోరులో ఆతిథ్య భారత్ మరో బంతి మిగిలి ఉండగానే 2 వికెట్ల హైస్కోరింగ్ విజయం సాధించడం ద్వారా 1-0 ఆధిక్యం సంపాదించడంతో ఈరోజు జరిగే రెండో మ్యాచ్ రెండుజట్లకూ కీలకంగా మారింది.

సిరీస్ పై పట్టు బిగించాలంటే భారత్ ఈ సూపర్ సండే పోరులోనూ విజేతగా నిలువాల్సి ఉంది. మరోవైపు..దూకుడుగా ఆడినా తొలిపోరులో పరాజయం పాలు కావడంతో కంగారూజట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

పేస్, స్వింగ్ బౌలర్ల స్వర్గం గ్రీన్ ఫీల్డ్....

ప్రస్తుత ఈ సిరీస్ లోని రెండోమ్యాచ్ కు వేదికగా నిలిచిన తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియానికి పేసర్లతో పాటు స్లోబౌలర్లకు అనుకూలించే వికెట్ గా పేరుంది.

50వేల సీటింగ్ కెపాసిటీతో, పచ్చటి దుప్పటి కప్పినట్లుగా ఉండే గ్రీన్ ఫీల్డ్ స్టేడియం అవుట్ ఫీల్డ్ ఫీల్డర్లపాలిట స్వర్గంకానుంది.

2017లో తొలిసారిగా ఓ అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఆరేళ్ల విరామం తరువాత తిరిగి మరో అంతర్జాతీయమ్యాచ్ కు వేదికగా నిలిచింది.

గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత స్వింగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ చెలరేగిపోయాడు. సఫారీ టీమ్ 9 పరుగులకే 5వికెట్లు నష్టపోయి కకావికలయ్యింది.

అంతేకాదు..ఇటీవలే జరిగిన వన్డే ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ లో ఆస్ట్ర్రేలియా పేసర్ మిషెల్ మార్ష్ హ్యాట్రిక్ సైతం నమోదు చేయడం చూస్తే పేస్, స్వింగ్ బౌలర్లకు చేతినిండా పనేనని చెప్పక తప్పదు.

పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో కంగారూలు...

మాథ్యూ వేడ్ నాయకత్వంలోని ఆస్ట్ర్రేలియాజట్టు పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో భారత్ కు మరోసారి సవాలు విసురుతోంది. తొలిసమరంలో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ 47బంతుల్లోనే మెరుపు శతకం బాదినా, 208 పరుగుల భారీస్కోరు సాధించినా 2 వికెట్ల ఓటమి ఎదురుకావడంతో నిరాశకు గురయ్యింది.

అయితే..రెండోపోరులో ఆరునూరైనా నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉంది. సర్వశక్తులూ కూడదీసుకొని భారతబౌలర్ల పనిపట్టాలన్న కసితో ఉంది. అయితే డెత్ ఓవర్లలో భారత స్వింగ్ బౌలర్ ముకేశ్ కుమార్ యార్కర్లను ఎలా తిప్పికొట్టాలో తెలియక సతమతమవుతోంది.

సూపర్ ఫామ్ లో సూర్య, ఇషాన్....

ఇషాన్, సూర్య , రింకూ సింగ్ బ్యాటింగ్ పవర్ తో తొలి టీ-20లో 2 వికెట్లవిజయం సాధించిన భారత్ అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. అయితే..ఓపెనింగ్ జోడీ యశస్విజైశ్వాల్, రుతురాజ్ గయక్వాడ్ అందించే ఆరంభం కీలకం కానుంది. తొలిమ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన వైస్ కెప్టెన్ రుతురాజ్ భారీస్కోరు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

వన్ డౌన్ ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ మెరుపు హాఫ్ సెంచరీలు సాధించిన ఫామ్ ను రెండోమ్యాచ్ లోనూ కొనసాగించనున్నారు. మిడిలార్డర్లో తిలక్ వర్మ భారీస్కోరుకు బాకీ ఉన్నాడు. ఫినిషర్ గా రింకూసింగ్ నిలకడగా రాణించడం భారత్ కు అదనపు బలంగా మారింది.

అత్యంత వేగంగా 2వేల పరుగులరికార్డుకు...

టీ-20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరిన ఆటగాడి రికార్డు విరాట్ కొహ్లీ పేరుతో ఉంది. ఆ రికార్డును ప్రస్తుత సిరీస్ లోనే సూర్యకుమార్ తిరగరాసే అవకాశం ఉంది. ప్రస్తుత సిరీస్ లోని మిగిలిన నాలుగుమ్యాచ్ ల్లో సూర్య మరో 79 పరుగులు సాధించగలిగితే అత్యంత వేగంగా ..అతితక్కువ ఇన్నింగ్స్ లో 2వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.

33 సంవత్సరాల సూర్యకు గత 51 ఇన్నింగ్స్ లో 3 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలతో 1921 పరుగులు సాధించిన రికార్డు ఉంది. 46.02 సగటుతో 172.70 స్ట్ర్రయిక్ రేట్ సైతం సూర్యాకు మాత్రమే సొంతంగా ఉంది.

రెండుజట్లకూ బౌలర్లే కీలకం...

తొలి టీ-20లో గతి తప్పిన అర్షదీప్, రవి బిష్నోయ్, ఆవేశ్ ఖాన్ స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితేనే సూపర్ హిట్టర్లతో కూడిన కంగారూ బ్యాటింగ్ ను కట్టడి చేసే అవకాశం భారత్ కు ఉంటుంది.

ఆస్ట్ర్రేలియా సైతం..భారత కెప్టెన్ సూర్య దూకుడుకు ఏవిధంగా పగ్గాలు వేయాలో తెలియక తలపట్టుకొంటోంది. స్లో బౌలర్లకు తోడు పేస్ బౌలర్లు అత్యుత్తమంగా రాణించిన జట్టు తిరువనంతపురం పోరులో విజేత కాగలుగుతుంది.

టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచనలేకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని..చేజింగ్ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ కు వర్షంతో ఏమాత్రం అంతరాయం ఉండబోదని వాతావరణశాఖ చెప్పకనే చెబుతోంది.

ఆరేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ కు భారీసంఖ్యలో అభిమానులు పోటెత్తనున్నారు.

First Published:  26 Nov 2023 3:00 AM GMT
Next Story