Telugu Global
Sports

నేడు 35వ పుట్టినరోజు.. విరాట్ కొహ్లీకి భలేమంచిరోజు!

భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ తన 35వ పుట్టినరోజునాడే వన్డేలలో 49వ శతకానికి ఉరకలేస్తున్నాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎటాక్ ను ఎదుర్కోనున్నాడు.

నేడు 35వ పుట్టినరోజు.. విరాట్ కొహ్లీకి భలేమంచిరోజు!
X

భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ తన 35వ పుట్టినరోజునాడే వన్డేలలో 49వ శతకానికి ఉరకలేస్తున్నాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎటాక్ ను ఎదుర్కోనున్నాడు.

భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ 35వ పడిలో ప్రవేశించాడు. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు దక్షిణాఫ్రికాతో జరిగే ప్రపంచకప్ మ్యాచ్ ఆడటం ద్వారా స్టేడియంలోని వేలాదిమంది అభిమానుల సమక్షంలో పుట్టినరోజును జరుపుకోనున్నాడు.

అరుదైన అవకాశం.......

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో ఒకటైన కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో...అదీ 80వేల మంది అభిమానుల సమక్షంలో ప్రపంచకప్ శతకంతో ప్రపంచ రికార్డును సమం చేసే అరుదైన అవకాశం విరాట్ కొహ్లీని ఊరిస్తోంది.

తన వన్డే క్రికెట్ కెరియర్ లో ఇప్పటికే 48 శతకాలు బాది మాస్టర్ సచిన్ టెండుల్కర్ తరువాతి స్థానంలో ఉన్న విరాట్ మరొక్క సెంచరీ సాధించగలిగితే 49 సెంచరీల ప్రపంచ రికార్డున సమం చేయగలుగుతాడు.

ముంబైలో చేజారినా..కోల్ కతాలో చాన్స్...

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ 7వ రౌండ్ మ్యాచ్ లోనే 49వ శతకంతో మాస్టర్ సచిన్ ప్రపంచ రికార్డును సమం చేయాలని విరాట్ భావించాడు. అయితే ..రికార్డు శతకం చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోయినా..మరో సువర్ణ అవకాశం విరాట్ కోసం సిద్ధంగా ఉంది. తన 35వ పుట్టినరోజునాడే..కోల్ కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే 8వ రౌండ్ పోరులో మూడంకెల స్కోరు సాధించే అరుదైన అవకాశం ఎదురుచూస్తోంది.

2008 నుంచి 2023 వరకూ గత 15 సంవత్సరాల కాలంలో వన్డేలలో విరాట్ సాధించిన మొత్తం 48 సెంచరీలలో నవంబర్ నెలలో రెండు శతకాలు మాత్రమే ఉన్నాయి. తన పుట్టినరోజునాడు గతంలో టీ-20, టెస్టుమ్యాచ్ లు ఆడిన విరాట్ తొలిసారిగా వన్డే మ్యాచ్ ఆడనున్నాడు.

ఈడెన్ గార్డెన్స్ లో అసాధారణ ఏర్పాట్లు.....

విరాట్ కొహ్లీ 35వ పుట్టినరోజు వేడుకలకు భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వినూత్నంగా ముస్తాబయ్యింది. నిర్వాహక బెంగాల్ క్రికెట్ సంఘం విరాట్ కోసం స్పెషల్ కేక్ తో పాటు 70వేల మాస్క్ లను సిద్ధం చేసింది.

గత మూడేళ్లుగా విసుగువిరామం లేకుండా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడేస్తూ వస్తున్న విరాట్ కు పుట్టినరోజు వేడుకలను ప్రపంచకప్ మ్యాచ్ ల నడుమ జరుపుకోడం ఓ అలవాటుగా మారింది.

2021లో దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ తో జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతూ తన 33వ పుట్టినరోజును జరుపుకొన్న విరాట్ ..ఆ తర్వాతి (34వ) పుట్టినరోజును ఆస్ట్ర్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రీడాపాత్రికేయుల సమక్షంలో జరుపుకొన్నాడు.

ఈరోజు వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతూ కోల్ కతాలోని వేలాదిమంది అభిమానుల సమక్షంలో 35వ పుట్టినరోజును వేడుకగా జరుపుకోడానికి విరాట్ సిద్ధమయ్యాడు..

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికాజట్ల నడుమ జరిగే 8వ రౌండ్ మ్యాచ్ రోజునే విరాట్ కొహ్లీ 35వ పుట్టినరోజు కావడంతో నిర్వాహక బెంగాల్ క్రికెట్ సంఘం పనిలోపనిగా అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది.

ప్రస్తుత వన్డే ప్రపంచకప్ లో కళ్లు చెదిరే విజయాలతో నాకౌట్ రౌండ్ కు చేరిన మొదటి రెండుజట్లుగా నిలిచిన భారత్- దక్షిణాఫ్రికాజట్ల బ్లాక్ బస్టర్ ఫైట్ ను చూడటానికి 80వేల నుంచి లక్షమంది వరకూ అభిమానులు తరలి రానున్నారు.

స్టేడియంలోని అభిమానుల్లో 70వేలమందికి విరాట్ కొహ్లీ మాస్క్ లను అందచేయనున్నారు. కొహ్లీ కోసం బెంగాల్ క్రికెట్ సంఘం ప్రత్యేకంగా తయారు చేసి బహుకరించనుంది.

2009లో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకపై విరాట్ కొహ్లీ తన తొలి అంతర్జాతీయ శతకం సాధించాడు. ఇన్నింగ్స్ కు ఇన్నింగ్స్ కు నడుమ విరాట్ పుట్టినరోజు వేడుకను నిర్వహించనున్నారు. ఆ తర్వాత బాణసంచాను కాల్చనున్నారు.

తన 35వ పుట్టినరోజునాడే..పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాపై విరాట్ కొహ్లీ రికార్డుస్థాయిలో 49వ వన్డే శతకం సాధించగలిగితే మాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రపంచ రికార్డును సమం చేయడంతో పాటు అరుదైన ఘనత సాధించినట్లవుతుంది.

భారత, ప్రపంచ క్రికెట్ కు సచిన్ తరువాత అదేస్థాయిలో సేవలు అందిస్తున్న విరాట్ కొహ్లీ 49వ వన్డే శతకం సాధించడం ద్వారా తన 35వ పుట్టినరోజును చిరస్మరణీయం చేసుకోవాలని అభిమానులు, క్రికెట్ ప్రియులు గాఢంగా కోరుకొంటున్నారు.

First Published:  5 Nov 2023 6:36 AM GMT
Next Story