Telugu Global
Sports

దక్షిణాఫ్రికాతో నేడే భారత తొలి టీ-20 పోరు

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టాప్ ర్యాంకర్ భారత్, మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది. తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ రెండుజట్ల తొలిపోరు ప్రారంభమవుతుంది.

దక్షిణాఫ్రికాతో నేడే భారత తొలి టీ-20 పోరు
X

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టాప్ ర్యాంకర్ భారత్, మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది. తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ రెండుజట్ల తొలిపోరు ప్రారంభమవుతుంది...

టీ-20 ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ భారత్ సన్నాహాలు తుదిదశకు చేరాయి. ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ రెండోవారంలో ప్రారంభంకానున్న ఈటోర్నీలో పాల్గొనటానికి ముందు భారత్, దక్షిణాఫ్రికాజట్లు తమ ఆఖరి సన్నాహక సిరీస్ లో ఢీ కొనబోతున్నాయి.

మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఈరోజు తిరువనంతపురం వేదికగా జరిగే తొలి టీ-20 సమరానికి రెండుజట్లూ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

టాప్ గేర్ లో భారత్, దక్షిణాఫ్రికా..

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం టీ-20ల్లో భారత్ టాప్ ర్యాంకర్ గా ఉంటే...దక్షిణాఫ్రికా మూడోర్యాంకర్ గా కొనసాగుతోంది. గత ఏడాది కాలంలో అత్యధిక టీ-20 విజయాలు సాధించిన జట్లుగా భారత్, దక్షిణాఫ్రికా నిలిచాయి.

ఆస్ట్ర్రేలియాతో కొద్దిరోజుల క్రితమే ముగిసిన టీ-20 సిరీస్ ను 2-1తో నెగ్గడం ద్వారా తన టాప్ ర్యాంక్ ను భారత్ నిలుపుకొంటే..ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లతో ఇటీవలే ముగిసిన సిరీస్ ల్లో సఫారీటీమ్ తిరుగులేని విజయాలు సాధించింది.

దక్షిణాఫ్రికాజట్టు ఆడిన గత 18 మ్యాచ్ ల్లో 13 విజయాలు నమోదు చేసింది. ఓపెనర్ టెండు బవుమా నాయకత్వంలోని సఫారీజట్టులో క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టుబ్స్, వెయిన్ పార్నెల్, రబడా, నోర్జే, తబ్రిజ్ షంషీ లాంటి ప్రపంచ మేటి టీ-20 ఆటగాళ్లున్నారు.

భువీ, పాండ్యాలకు విశ్రాంతి..

ఆస్ట్ర్రేలియాతో సిరీస్ లో పాల్గొన్న స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాలకు భారత టీమ్ మేనేజ్ మెంట్ విశ్రాంతి నిచ్చి..తుదిజట్టులోకి శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్ లకు చోటు కల్పించారు.

రాహుల్, రోహిత్, విరాట్, సూర్యకుమార్ యాదవ్ లతో భారత టాపార్డర్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్ గా దినేశ్ కార్తీక్ నే కొనసాగించనున్నారు.

బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ , యజువేంద్ర చహాల్, అక్షర్ పటేల్ స్పెషలిస్ట్ బౌలర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. స్వింగ్ బౌలింగ్ ఆల్ రౌండర్ దీపక్ చహార్ ను తుదిజట్టులోకి తీసుకొన్నా ఆశ్చర్యం లేదు.

సఫారీలపై భారత్ దే పైచేయి...

భారత్, దక్షిణాఫ్రికాజట్లు ఇప్పటి వరకూ 20సార్లు టీ-20 మ్యాచ్ ల్లో తలపడితే భారత్ 10- 9 విజయాల రికార్డుతో ఉంది. తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇప్పటి వరకూ రెండంటే రెండు మాత్రమే అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు నిర్వహిస్తే..పూర్తి 20 ఓవర్లతో ఓమ్యాచ్ మాత్రమే ముగిసింది.

ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీకి వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం ఏమాత్రం లేదని వాతావరణశాఖ ప్రకటించింది. అయితే..మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.

పవర్ ఫుల్ బౌలింగ్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికాను పదునైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన గలదో ప్రస్తుత సిరీస్ ద్వారా తేలిపోనుంది. సుదీర్ఘవిరామం తర్వాత తిరువనంతపురం వేదికగా ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న కారణంగా గ్రీన్ ఫీల్డ్ స్టేడియం కిటకిటలాడనుంది.

First Published:  28 Sep 2022 3:51 AM GMT
Next Story