Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ లో నేడు టైటిల్ సమరం!

తొలి మహిళా ఐపీఎల్ టైటిల్ సమరానికి ముంబైలో రంగం సిద్ధమయ్యింది.

మహిళా ఐపీఎల్ లో నేడు టైటిల్ సమరం!
X

తొలి మహిళా ఐపీఎల్ టైటిల్ సమరానికి ముంబైలో రంగం సిద్ధమయ్యింది. సూపర్ సండే ఫైట్ గా జరిగే ఫైనల్లో హాట్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ తో లీగ్ టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.

భారత మహిళా క్ర్రికెట్ చరిత్తలోనే సరికొత్త అధ్యాయంగా ప్రారంభమైన మొట్టమొదటి మహిళా ఐపీఎల్ పతాకస్థాయికి చేరింది. ముంబై వేదికగా గత 21 రోజులుగా సాగిన ఐదుజట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో ఆఖరిమ్యాచ్ గా ఈరోజు జరిగే టైటిల్ సమరానికి ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

ఈ రోజు రాత్రి జరిగే ఆఖరాటలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ తో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

హాట్ ఫేవరెట్ గా ముంబై ఇండియన్స్....

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ లీగ్ దశ నుంచి ఎలిమినేటర్ రౌండ్ వరకూ నిలకడగా రాణిస్తూ సత్తా చాటుకోడం ద్వారా

అలవోకగా ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

ఎనిమిదిరౌండ్ల లీగ్ పోరులో వరుసగా ఐదు విజయాలు, ఆ తర్వాత రెండుమ్యాచ్ ల్లో పరాజయాలు పొందిన ముంబై ఆఖరి రౌండ్ పోరులో కీలక విజయం సాధించడం ద్వారా 12 పాయింట్లతో లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది. ప్లే-ఆఫ్ రౌండ్లో యూపీ వారియర్స్ ను 72 పరుగులతో చిత్తు చేయడం ద్వారా టైటిల్ సమరంలో అడుగుపెట్టింది.

ఆల్ రౌండ్ పవర్ తో ముంబై జోరు...

ఎక్కువ మంది ఆల్ రౌండర్లతో ..సమతూకంతో కూడిన ముంబైజట్టు హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. హేలీ మాథ్యూస్, యాస్తిక భాటియా, నటాలియా సీవర్ బ్రంట్, అమెలియా కేర్, పూజా వస్త్రకర్, యాస్తికా భాటియా, ఇసబెల్లా వాంగ్, సైకా ఇషాక్ లతో దూకుడుమీద కనిపిస్తోంది.

హేలీ మాథ్యూస్, సీవర్ బ్రంట్, సైకా ఇషాక్ తమ ఆల్ రౌండ్ ప్రతిభతో ముంబై జట్టుకి కొండంత అండగా ఉన్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సైతం నిలకడగా రాణిస్తూ పరుగుల మోత మోగించడం ముంబైకి కలిసిరానుంది.

యూపీతో ముగిసిన ఎలిమినేటర్ రౌండ్ పోరులో హ్యాట్రిక్ నమోదు చేసిన మీడియం పేసర్ ఇసాబెల్లా వాంగ్..ఫైనల్లో సైతం కీలకపాత్ర పోషించనుంది.లీగ్ దశలో

ఢిల్లీతో ముగిసిన మ్యాచ్ ల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన ముంబై...టైటిల్ సమరంలోనూ అదేజోరు కొనసాగించడం ద్వారా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది.

యువక్రికెటర్లతో ఢిల్లీ హుషారు...

మరోవైపు.. రౌండ్ రాబిన్ లీగ్ రెండో అంచెలో కీలక విజయాలు సాధించడం ద్వారా ముంబైనే అధిగమించి..లీగ్ టేబుల్ టాపర్ గా నేరుగా ఫైనల్లో అడుగుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ అపారఅనుభవం కలిగిన మెగ్ లానింగ్, యువ క్రికెటర్లు షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగేజ్ లాంటి ప్లేయర్లతో కేరింతలు కొడుతోంది. టైటిల్ సమరంలో ముంబైని ఢీ కొనటానికి సిద్ధమని చెప్పకనే చెప్పింది.

ఆస్ట్ర్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ తోపాటు మరిజానే కాప్, ఆలీస్ కాప్సే, జెసియా అక్తర్, జెస్ జోనాస్సెన్, తారా నోరిస్ లాంటి విదేశీ క్రికెటర్లు, దేశీ క్రికెటర్లు జెమీమా, షెఫాలీ, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ లతో కలగలిపిన చక్కటి జట్టుగా రూపుదిద్దుకొంది.

ముంబై లాంటి అత్యంత ప్రమాదకరమైన జట్టుతో జరిగే ఈ పోరులో ఢిల్లీ విజేతగా నిలవాలంటే..ఓపెనర్ కమ్ కెప్టెన్ మెగ్ లానింగ్ తో పాటు..యువజోడీ షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగేజ్ అత్యుత్తమస్థాయిలో రాణించి తీరక తప్పదు.

బ్రబోర్న్ లో హైస్కోరింగా..లోస్కోరింగ్ ?

టైటిల్ సమరానికి ఆతిథ్యమిస్తున్న ముంబై బ్రబోర్న్ స్టేడియంలోనే సగం డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు నిర్వహించడంతో వికెట్లలో తాజాదనం లోపించి...బ్యాటింగ్ కు అనుకూలిస్తుందో ..లేక బౌలింగ్ కు అనువుగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.

టాస్ నెగ్గినజట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన 180కి పైగా స్కోరు సాధించగలిగితేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కప్పు కొడితే 6 కోట్ల ప్రైజ్ మనీ...

ఐపీఎల్ విజేత జట్ల కోసం నిర్వాహక సంఘం 10 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని కేటాయించింది. విన్నర్ గా నిలిచిన జట్టుకు 6 కోట్ల రూపాయలు, రన్నరప్ గా నిలిచిన జట్టుకు 3 కోట్ల రూపాయలు, మూడవస్థానం సాధించిన జట్టుకు కోటిరూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు.

లీగ్ దశ మ్యాచ్ లకు 5 నుంచి 7 వేల వరకూ మాత్రమే అభిమానులు హాజరవుతూ వచ్చారు, అయితే..సూపర్ సండే టైటిల్ ఫైట్ గా జరిగే ఫైనల్స్ కు 15 నుంచి 20 వేల వరకూ హాజరుకాగలరని భావిస్తున్నారు.

మహిళా తొలి ఐపీఎల్ టైటిల్ ను ముంబై సొంతం చేసుకొంటుందా? ఢిల్లీ క్యాపిటల్స్ అందుకొంటుందా?..తెలుసుకోవాలంటే మరికొద్దిగంటలపాటు వేచి చూడక తప్పదు.

First Published:  26 March 2023 3:39 AM GMT
Next Story