Telugu Global
Sports

టైమ్డ్‌ ఔట్‌.. క్రికెట్‌ చరిత్రలో ఫస్ట్ టైమ్‌..!

టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. 25వ ఓవర్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ సదీర సమరవిక్రను బంగ్లా కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ అవుట్ చేశాడు.

టైమ్డ్‌ ఔట్‌.. క్రికెట్‌ చరిత్రలో ఫస్ట్ టైమ్‌..!
X

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా క్రికెట్‌ క్యాచ్‌ అవుట్‌, రనౌట్‌, LBW, బౌల్డ్, హిట్ వికెట్‌ వంటి డిస్మిసల్స్ చూస్తుంటాం. కానీ, ఈ మ్యాచ్‌లో క్రికెట్‌ చరిత్రలోనే ఫస్ట్‌ టైం టైమ్డ్‌ ఔట్ నమోదైంది. క్రీజులోకి ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌గా ప్రకటించారు అంపైర్లు. ఈ చెత్త రికార్డును శ్రీలంక ఆల్‌ రౌండర్‌ మాథ్యూస్‌ తన పేరిట రాసుకున్నాడు.

అసలేం జరిగిందంటే..! టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. 25వ ఓవర్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ సదీర సమరవిక్రను బంగ్లా కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ అవుట్ చేశాడు. తర్వాతి బ్యాటర్‌గా మాథ్యూస్‌ క్రీజులోకి రావాల్సి ఉంది. అయితే హెల్మెట్‌ బాగా లేకపోవడంతో కాస్త ఆలస్యంగా క్రీజులోకి వచ్చాడు మాథ్యూస్‌. అదే సమయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్‌ అవుట్‌ కోసం అప్పీల్ చేశాడు. దీంతో గైడ్‌లైన్స్ ప్రకారం మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు అంపైర్లు. మాథ్యూస్‌ ఏం జరిగిందనే విషయాన్ని షకీబ్‌కు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ అతను తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోలేదు. దీంతో మాథ్యూస్‌ క్రీజులోకి రాకుండానే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.

వికెట్ పడిన తర్వాత త‌ర్వాతి బ్యాటర్‌ రెండు నిమిషాల్లోగా క్రీజులో ఉండాలని MCC క్రికెట్‌ నిబంధనలు చెప్తున్నాయి. కాగా, మాథ్యూస్‌ క్రీజులోకి రావడానికి మూడు నిమిషాల టైమ్‌ తీసుకున్నాడు. దీంతో అంపైర్లు అతడిని అవుట్‌గా ప్రకటించారు. క్రికెట్‌ చరిత్రలో ఈ రకంగా ఔటైన మొదటి బ్యాట్స్‌మెన్‌గా మాథ్యూస్‌ రికార్డులకెక్కాడు.

First Published:  6 Nov 2023 12:07 PM GMT
Next Story