Telugu Global
Sports

స్వదేశంలో పులి..బంగ్లాదేశ్!

వన్డే క్రికెట్లో ప్రపంచ 7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ స్వదేశీ సిరీస్ ల్లో తిరుగులేని విజయాలతో..ఇంట్లో పులి అన్నసామెతను నిజం చేస్తోంది. 4వ ర్యాంకర్ భారత్ పై మొదటి రెండువన్డేలలో సంచలన విజయాలు సాధించడం ద్వారా 2022 సిరీస్ ఖాయం చేసుకొంది.

స్వదేశంలో పులి..బంగ్లాదేశ్!
X

వన్డే క్రికెట్లో ప్రపంచ 7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ స్వదేశీ సిరీస్ ల్లో తిరుగులేని విజయాలతో..ఇంట్లో పులి అన్నసామెతను నిజం చేస్తోంది. 4వ ర్యాంకర్ భారత్ పై మొదటి రెండువన్డేలలో సంచలన విజయాలు సాధించడం ద్వారా 2022 సిరీస్ ఖాయం చేసుకొంది...

అంతర్జాతీయ క్రికెట్లో ర్యాంకులకు..విజయాలకు ఏమాత్రం పొంతన ఉండదని బంగ్లాదేశ్ మరోసారి చాటి చెప్పింది. వన్డేలలో ప్రపంచ 4వ ర్యాంకర్ భారత్ ను మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండువన్డేలలో చిత్తు చేయడం ద్వారా 7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ సిరీస్ కైవసం చేసుకొంది.

స్లో పిచ్ లపై బంగ్లా భళా!

భారత ఉపఖండ దేశాలలోనే అత్యంత స్లో క్రికెట్ పిచ్ లు ఎక్కడ ఉంటాయంటే..బంగ్లాదేశ్ అన్న సమాధానమే వస్తుంది. బ్యాటర్లు, ప్రధానంగా స్ట్ర్రోక్ మేకర్ల సహనానికి బంగ్లాదేశ్ పిచ్ లు పరీక్షగా నిలుస్తాయి.

మీర్పూర్ లోని షేరే నేషనల్ స్టేడియం, చిట్టగాంగ్ లోనూ జుహూర్ చౌదరీ స్టేడియం, ఖుల్నా స్టేడియం...ఇలా..బంగ్లాదేశ్ లోని ఏ క్రికెట్ పిచ్ ను చూసినా మందకొడిగా, చాలా స్లోగా ఉంటాయి. దూకుడుగా ఆడే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి బ్యాటర్లకు ఏమాత్రం అనుకూలంగా ఉండవు. ఎక్కడలేని ఓర్పుతో..ఆచితూచి ఆడుతూ క్రీజుకే అంటిపెట్టుకొని ఆడే ఆటగాళ్లు మాత్రమే రాణించగలగడం విశేషం.

భారత్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా బంగ్లాదేశ్ తో ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ తీన్మార్ వన్డే సిరీస్ లో తలపడుతోంది.

మీర్పూర్ వేదికగా ముగిసిన లోస్కోరింగ్ తొలివన్డేలో వికెట్ తేడాతో నెగ్గిన బంగ్లాజట్టు..అదే వేదికగా జరిగిన రెండోవన్డేలో సైతం 5 పరుగుల విజయంతో సంచలనం సృష్టించింది.

7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ కొట్టిన దెబ్బ మీద దెబ్బతో 4వ ర్యాంకర్ భారత్ ఒక్కసారిగా డీలా పడిపోయింది.

ముగ్గురు ఆటగాళ్లు అవుట్...

బంగ్లాతో వన్డే సిరీస్ ముగియక ముందే భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ దీపక్ చహార్, యువఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. రెండోవన్డేలో స్లిప్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్ ఎడమచేతి బొటనవేలికి గాయమయ్యింది. దీంతో నిపుణులతో చికిత్స కోసం ఢాకా నుంచి ముంబైకి తిరిగి వచ్చాడు.

స్వింగ్ బౌలర్ దీపక్ చాహర్ పాతగాయం తిరగబెట్టటం, కుల్దీప్ సేన్ వెన్నెముక నొప్పి కారణాలతో బంగ్లా సిరీస్ ముగియకుండానే పోటీనుంచి తప్పుకోడం భారతజట్టును గట్టి దెబ్బే కొట్టింది.

అప్పుడు ధోనీ...ఇప్పుడు రోహిత్..

బంగ్లాదేశ్ ను బంగ్లాగడ్డపై ఓడించడం ద్వారా గతంలో మూడుసార్లు వన్డే సిరీస్ నెగ్గిన రికార్డు భారత్ కు ఉంది. అయితే..2015- 16 సిరీస్ లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారతజట్టు 1-2తో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి బంగ్లాగడ్డపై భారత్ కు వన్డే సిరీస్ విజయమే లేకుండాపోయింది. ప్రస్తుత సిరీస్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టుకు మరోసారి అదే అనుభవం ఎదురయ్యింది. పసలేని బౌలింగ్ తో సతమతమవుతున్న భారత్..శనివారం చోటాగ్రామ్ వేదికగా జరిగే ఆఖరివన్డేలో ఎంత వరకూ విజయం సాధించగలదన్నది అనుమానమే.

బంగ్లా విజయపరంపర..

స్వదేశీ వన్డే సిరీస్ ల్లో 2016 సీజన్ నుంచి బంగ్లాదేశ్ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. తమ దేశంలోని స్లో పిచ్ లపై బంగ్లా బ్యాటర్లకు, బౌలర్లకు సమయానుకూలంగా చెలరేగిపోవటం మామూలు విషయమే.

వెస్టిండీస్, అఫ్ఘనిస్థాన్, శ్రీలంక జట్లపైన సిరీస్ విజయాలు సాధించిన బంగ్లాదేశ్ కు జింబాబ్వే చేతిలో మాత్రం ఓటమి తప్పలేదు. అయితే..ప్రస్తుత సిరీస్ లో భారత్ పై సాధించిన విజయాలు బంగ్లాదేశ్ కు సరికొత్త శక్తినే ఇస్తాయి. భారత్ ప్రత్యర్థిగా ఆడిన గత 38 వన్డేలలో బంగ్లాకు కేవలం 8 విజయాలు మాత్రమే ఉన్నాయి. అయితే..గత రెండువన్డేలలో భారత్ పై వెంట్రుకవాసి విజయాలు సాధించిన ఘనత, అదృష్టం బంగ్లాజట్టుకు మాత్రమే ఉన్నాయి.

స్వదేశీ పిచ్ లపై చెలరేగి పోయే బంగ్లాదేశ్ విదేశీ సిరీస్ ల్లో మాత్రమే విఫలమవుతూ వస్తోంది. స్వదేశంలో పులి, విదేశాలలో పిల్లి అన్నమాట బంగ్లాటైగర్స్ కు అతికినట్లు సరిపోతుంది.

First Published:  9 Dec 2022 5:45 AM GMT
Next Story