Telugu Global
Sports

త్రీ-ఇన్-వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా!

భారత సూపర్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 35వ పడిలోకి అడుగుపెట్టాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ స్పిన్ ఆల్ రౌండర్ గా వెలిగిపోతున్నాడు.

త్రీ-ఇన్-వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా!
X

భారత సూపర్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 35వ పడిలోకి అడుగుపెట్టాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ స్పిన్ ఆల్ రౌండర్ గా వెలిగిపోతున్నాడు..

భారత క్రికెట్ కు గత దశాబ్దకాలంగా అసమాన సేవలు అందిస్తున్న ఆల్ -ఇన్- వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 35వ పడిలోకి ప్రవేశించాడు. క్రికెట్ మూడు ( టెస్టు, వన్డే, టీ-20 )ఫార్మాట్లలో భారత్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా నిలవడం లోనూ, ఐపీఎల్ లో చెన్నై ఫ్రాంచైజీ అత్యధిక టైటిల్స్ నెగ్గడంలోనూ రవీంద్ర జడేజా తనకు తానే సాటిగా నిలిచాడు.

2009 నుంచి 2023 వరకూ....

సౌరాష్ట్ర్ర నుంచి భారత క్రికెట్లోకి జూనియర్ స్థాయిలోనే దూసుకొచ్చిన రవీంద్ర జడేజా ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్..విభాగం ఏదైనా అత్యుత్తమంగా రాణించడం, అద్భుతాలు చేయటం, తనజట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించడంలో జడేజాకు జడేజా మాత్రమే సాటి. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా నీరాజనాలు అందుకొంటున్న జడేజా ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి నానాపాట్లు పడి క్రికెటర్ గా ఎదుగుతూ వచ్చాడు.

అండర్ -19 ప్రపంచకప్ లో సత్తా చాటుకోడం ద్వారా ..ఐపీఎల్ ప్రారంభ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా జడేజా మెరుపులు మెరిపించాడు. తొలిసీజన్లోనే ఐపీఎల్ చాంపియన్ జట్టులో కీలక సభ్యుడిగా నిలిచాడు.

14 ఏళ్ళుగా జడేజా జోరు....

2009లో భారత సీనియర్ జట్టులో సభ్యుడిగా తన తొలి అంతర్జాతీయమ్యాచ్ ఆడిన రవీంద్ర జడేజా..గత 14 సంవత్సరాలుగా ఒకేతీరుగా రాణిస్తూ వస్తున్నాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్...ఇలా ఫార్మాట్ ఏదైనా భారత్ ను విజేతగా నిలపడంలో రవీంద్ర జడేజా తరువాతే ఎవరైనా.

కీలక సమయాలలో క్యాచ్ లు పట్టడం, వికెట్లు పడగొట్టడం, కష్టసమయంలో బ్యాటు ఝళిపిస్తూ పరుగులు సాధించడంలో జడేజాది అందివేసిన చేయి.

అర్థశతకం లేదా శతకం సాధించిన తరువాత తన బ్యాటును కత్తిలా తిప్పుతూ అభివాదం చేయటం జడేజా ప్రత్యేకత.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 67 టెస్టుల్లో 36.41 సగటుతో 2804 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి. 175 పరుగుల నాటౌట్ స్కోరు జడేజా అత్యుత్తమ టెస్టు వ్యక్తిగత స్కోరుగా నమోదయ్యింది.

సాంప్రదాయ లెఫ్టామ్ స్పిన్నర్ గా జడేజా టెస్టుల్లో ఇప్పటి వరకూ 275 వికెట్లతో 24.04 సగటుతో, 59.4 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. రెండుసార్లు 10 వికెట్లు, 12సార్లు 5 వికెట్ల రికార్డు నమోదు చేశాడు. అత్యుత్తమంగా 42 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు.

2021, 2023 ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ లో భారతజట్టులో సభ్యుడిగా ఆడటంతో పాటు రన్నరప్ గా నిలిచిన ఘనత సైతం జడేజాకు ఉంది.

వన్డేలలోనూ తిరుగులేని జడేజా...

50 ఓవర్ల వన్డే ఫార్మాట్లో భారత్ తరపున 197 మ్యాచ్ లు ఆడిన జడేజా 2వేల 756 పరుగులు సాధించాడు. 32.42 సగటుతో, 87 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. బౌలర్ గా 220 వికెట్లు పడగొట్టాడు. 36.07 సగటుతో 44.3 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. అత్యుత్తమంగా 33 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.

2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలవడం లో ప్రధానపాత్ర వహించిన జడేజా 12 వికెట్లతో అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. 36 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన రికార్డును సైతం సాధించాడు.

2015, 2019 ప్రపంచకప్ టోర్నీలలో సెమీస్ చేరిన భారతజట్లలోనూ, 2023 ప్రపంచకప్ టోర్నీ రన్నరప్ గా నిలిచిన భారతజట్టులోనూ జడేజా కీలక ఆల్ రౌండర్ గా ఉన్నాడు.

21 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ల్లో 11 ఇన్నింగ్స్ లో 254 పరుగులు సాధించడంతో ాటు 21 మ్యాచ్ ల్లో 27 వికెట్లు పడగొట్టాడు.

టీ-20ల్లో టాప్ గేర్.....

భారత్ తరపున తన కెరియర్ లో 64 టీ-20 మ్యాచ్ లు ఆడిన జడేజా 457 పరుగులతో 24.05 సగటు నమోదు చేశాడు. 46 పరుగుల నాటౌట్ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. మొత్తం 51 వికెట్లుపడగొట్టాడు. 15 పరుగులకే 3 వికెట్లు అత్యుత్తమ రికార్డుగా ఉంది.

2016 టీ-20ప్రపంచకప్ సెమీస్ , 2014 ప్రపంచకప్ ఫైనల్స్ చేరినజట్లలో జడేజా సభ్యుడిగా ఉన్నాడు. 2022 ప్రపంచకప్ కు గాయంతో అందుబాటులో లేకుండా పోయాడు.

మొత్తం 22 టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడిన జడేజా 95 పరుగులు సాధించడంతో పాటు 21 వికెట్లు పడగొట్టాడు.

మూడు ఫార్మాట్లలో 328 మ్యాచ్ లు..

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ తన 14 సంవత్సరాల కెరియర్ లో 328 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన జడేజా 6017 పరుగుల సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలతో 33.24 సగటు నమోదు చేశాడు.

బౌలర్ గా 546 వికెట్లు సాధించాడు. 29.32 సగటుతో 50 స్ట్ర్రయిక్ రేట్ సైతం సాధించాడు. భారత క్రికెట్ మిస్టర్ డిపెండబుల్ ప్లేయర్ గా జడేజా గుర్తింపు సంపాదించుకొన్నాడు.

ఐపీఎల్ లో అదరహో.....

2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, కొచ్చి టస్కర్స్ జట్లకు ఆడిన జడేజా నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగలిగాడు.

రాజస్థాన్ రాయల్స్ తరపున ఓ సారి, చెన్నై సూపర్ కింగ్స్ తరపున మూడుసార్లు ఐపీఎల్ విజేతగా నిలువగలిగాడు.

గత ( 223 ) సీజన్ వరకూ 226 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన జడేజా 27 సగటుతో 2692 పరుగులు సాధించాడు. ఇందులో 62 పరుగుల అత్యుత్తమ నాటౌట్ స్కోరుతో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

బౌలర్ గా 152 వికెట్లతో 29.57 సగటు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున 134 వికెట్లు పడగొట్టిన ఘనత జడేజాకు ఉంది.

సీజన్ కు 15 కోట్ల రూపాయల వరకూ ఐపీఎల్ ద్వారా ఆర్జిస్తున్న 35 సంవత్సరాల జడేజా..క్రికెట్ కోటీశ్వరుల జాబితాలో ఎప్పుడో చేరిపోయాడు. ఎంతసాధించినా ..ఇంకా ఏదో సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమించే జడేజా నిగర్వికూడా.

మరో 7 మాసాలలో జరిగే 2024 టీ-20 ప్రపంచకప్ లో భారత్ ను విజేతగా నిలుపగలిగితే జడేజా కెరియర్ పరిపూర్ణమవుతుంది.

First Published:  6 Dec 2023 12:00 PM GMT
Next Story