Telugu Global
Sports

ఇటు ఫెదరర్, అటు జులన్..రిటైర్మెంట్ అంటే ఇదేరా!

విశ్వక్రీడారంగంలో గత మూడురోజుల్లో రెండు అసాధారణ, అరుదైన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, భారత మహిళా క్రికెట్ గ్రేట్ జులన్ గోస్వామిల వీడ్కోలు, నిష్క్ర్రమణ గొప్పగా జరిగింది. రిటైర్మెంట్ అంటే ఇదేరా! అనుకొనేలా చేసింది..

ఇటు ఫెదరర్, అటు జులన్..రిటైర్మెంట్ అంటే ఇదేరా!
X

విశ్వక్రీడారంగంలో గత మూడురోజుల్లో రెండు అసాధారణ, అరుదైన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, భారత మహిళా క్రికెట్ గ్రేట్ జులన్ గోస్వామిల వీడ్కోలు, నిష్క్ర్రమణ గొప్పగా జరిగింది. రిటైర్మెంట్ అంటే ఇదేరా! అనుకొనేలా చేసింది....

రంగం ఏదైనా ఆది, అంతం, ఆరంభం, ముగింపు అనేవి ఉంటాయి.చివరకు మానవజీవితానికి సైతం అది తప్పదు. దానికి క్రీడారంగం సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

తమతమ క్రీడల్లో దశాబ్దాల తరబడి అత్యుత్తమంగా రాణించడం ద్వారా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్న మేరునగధీరులు, గొప్పగొప్ప క్రీడాకారులకు సైతం

ఎదో ఒకరోజు రిటైర్మెంట్ తప్పదు, అనివార్యం కూడా.

భావోద్వేగాల మహాభినిష్క్ర్రమణం....

క్రీడారంగం అనేది నిరంతరం గలగలా పారే సెలయేరు లాంటిది. కొత్తనీరు వస్తుంటే..పాతనీరూ పోతూ ఉంటుంది. ఎందరో క్రీడాకారులు ఎప్పుడు వచ్చారో..ఎప్పుడు పోయారో కూడా చాలామందికి తెలియదు. అయితే..గొప్ప ఆరంభం..అంతే గొప్పగా తమతమ కెరియర్లకు ముగింపు పలికిన అరుదైన క్రీడాకారులు చరిత్రలో అతికొద్దిమంది మాత్రమే కనిపిస్తారు.

తాజాగా ఆకోవలో చేరినవారే టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్, భారత మహిళా క్రికెట్ ఎవర్ గ్రీన్ పేస్ బౌలర్ జులన్ గోస్వామి. ఇటు ఫెదరర్, అటు జులన్ గోస్వామి ఇద్దరూ...తమ నిష్క్ర్రమణకు, వీడ్కోలుకు లండన్ నగరాన్నే వేదికగా చేసుకోడం యాధృచ్చికం మాత్రమే కాదు..విశేషం కూడా.

ఫెదరర్ కన్నీటిమున్నీటి వీడ్కోలు.....

రోజర్ ఫెదరర్ 24 సంవత్సరాల టెన్నిస్ ప్రస్థానంలో లండన్ వేదికగా జరిగిన 2022 లేవర్ కప్ టోర్నీ ఆఖరి అంకంగా మిగిలింది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో 1500 మ్యాచ్ లు ఆడి..103 ఏటీపీ టూర్ టైటిల్స్ తో పాటు..20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన మొనగాడు రోజర్ ఫెదరర్. కేవలం టెన్నిస్ కోసమే పుట్టిన ఆటగాడు ఫెదరర్.

తన ఆటతీరు, విలక్షణ వ్యక్తిత్వంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్న ఘనుడు ఫెదరర్. చివరకు ప్రత్యర్థులు సైతం ఫెదరర్ కు అభిమానులుగా మారిపోవాల్సిందే.

24 సంవత్సరాల తన టెన్నిస్ జీవితం 24 రోజుల్లా గడచిపోయిందంటూ ఫెదరర్ మురిసిపోతున్నాడు. యూరోప్, రెస్టాఫ్ వరల్డ్ జట్ల మధ్య రాడ్ లేవర్ కప్ కోసం లండన్ వేదికగా జరిగిన టోర్నీనే తన జీవితంలో చివరి టెన్నిస్ టోర్నీ అని ఫెదరర్ గతవారమే ప్రకటించాడు.

ఇక..లండన్ వేదికగా జరిగిన లేవర్ కప్ డబుల్స్ మ్యాచ్ లో నడాల్ తో జంటగా కలసి తన చిట్టచివరి ప్రోమ్యాచ్ లో ఫెదరర్ పాల్గొనడంతో రిటైర్మెంట్ అంకం ముగిసింది.

ఫెదరర్ రిటైర్మెంట్ క్షణాలు భావోద్వేగాలతో నిండిపోయాయి. ఓ పక్కన ఫెదరర్, అతని కుటుంబసభ్యలు, అభిమానులు...మరోవైపు ఫెదరర్ ప్రధాన ప్రత్యర్థులు రాఫెల్ నడాల్,

జోకోవిచ్ లాంటి ఆటగాళ్లు కన్నీరుమున్నీరయ్యారు.

ఫెదరర్ తో టెన్నిస్ కోర్టులో పలు గొప్పగొప్ప పోరాటాలు చేసిన నడాల్..వీడ్కోలు మ్యాచ్ లో జంటగా డబుల్స్ మ్యాచ్ లో పాల్గొన్నాడు. ఓవైపు ఫెదరర్..ఆ పక్కనే కూర్చున్న నడాల్ కన్నీరుమున్నీరైన దృశ్యం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులకు కలకాలం గుర్తుండిపోతుంది.

ఓ ఆటగాడి కోసం నడాల్ లాంటి ప్రత్యర్థి క్రీడాకారులు కన్నీరుమున్నీరు కావడం చూస్తే...41 సంవత్సరాల ఫెదరర్ ది ఎంత గొప్పవ్యక్తిత్వమో మరి చెప్పాల్సిన పనిలేదు.

జులన్ కోసం హర్మన్ కంటతడి...

భారత మహిళా క్రికెట్ కు రెండుదశాబ్దాలపాటు అలుపెరుగని సేవలు అందించిన స్వింగ్ బౌలర్ జులన్ గోస్వామి 39 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ ప్రకటించింది.

ఇంగ్లండ్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీసే తన వీడ్కోలు సమరమని ముందుగానే తెలిపింది.

భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ నుంచి తన ప్రస్థానం ప్రారంభించిన జులన్ ప్రపంచ క్రికెట్ మక్కా లండన్ లార్డ్స్ వేదికగా ముగించడం గొప్ప ఘనతగా మిగిలిపోతుంది.

ఇంగ్లండ్ తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ ఆఖరి వన్డే మ్యాచ్ లో...జులన్ బ్యాటింగ్ కు దిగిన సమయంలో రెండుజట్ల ప్లేయర్లూ..గౌరవ సూచకంగా గార్డ్ ఆఫ్ హానర్ తో

గౌరవించారు. స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు ఇంగ్లండ్ పై 3-0తో నెగ్గడం ద్వారా సిరీస్ స్వీప్ ను జులన్ కు వీడ్కోలు కానుకగా మిగిల్చింది.

ఇక..భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్..గత కొద్దిసంవత్సరాలుగా తనకు పెద్దదిక్కుగా నిలిచిన జులన్ రిటైర్మెంట్ తో చలించిపోయింది. తన కెరియర్ లో ఆఖరిమ్యాచ్ ఆడుతున్న జులన్ ను హత్తుకొని కన్నీరుమున్నీరయ్యింది. జులన్ గుండెల్లో పసిపాపలా ఓదిగిపోడం ఓ గొప్పవీడ్కోలు దృశ్యంగా మిగిలిపోతుంది.

క్రీడాజీవితమైనా...ఉద్యోగమైనా రిటైర్మెంట్ అపూర్వంగా ఉండాలి, వీడ్కోలు మహాగొప్పగా ఉండాలి, మనకోసం కన్నీరుమున్నీరయ్యే అభిమానులు, సహక్రీడాకారులు, సహోద్యోగులు ఉండితీరాలి. అలాంటి మహాభినిష్క్ర్రమణం సచిన్, ఫెదరర్ లాంటి అతికొద్ది మందికి మాత్రమే సాధ్యం.

రిటైర్ అవుతున్నామంటే..ఓ దరిద్రం వదిలింది అనుకొనేలా ఉండకూడదు, ఓ గొప్పసహచరుణ్ణి, మార్గదర్శిని, స్ఫూర్తిమంతుడిని కోల్పోతున్నామన్న బాధతో కన్నీటిభాష్పాలు రాల్చేవారు ఉండాలి. అసలు సిసలు రిటైర్మెంట్ అంటే అదే మరి.!



First Published:  25 Sep 2022 5:47 AM GMT
Next Story