Telugu Global
Sports

నాజట్టు నాఇష్టం- హార్థిక్ పాండ్యా!

న్యూజిలాండ్ తో ముగిసిన టీ-20 సిరీస్ లో సంజు శాంసన్ ను డగౌట్ కే పరిమితం చేయడం పై విమర్శలు వెల్లువెత్తడం పై కెప్టెన్ హార్థిక్ పాండ్యా తనదైన శైలిలో స్పందించాడు. నాజట్టు, నాఇష్టం అంటూ విమర్శకులకు బదులిచ్చాడు.

నాజట్టు నాఇష్టం- హార్థిక్ పాండ్యా!
X

నాజట్టు నాఇష్టం- హార్థిక్ పాండ్యా!

న్యూజిలాండ్ తో ముగిసిన టీ-20 సిరీస్ లో సంజు శాంసన్ ను డగౌట్ కే పరిమితం చేయడం పై విమర్శలు వెల్లువెత్తడం పై కెప్టెన్ హార్థిక్ పాండ్యా తనదైన శైలిలో స్పందించాడు. నాజట్టు, నాఇష్టం అంటూ విమర్శకులకు బదులిచ్చాడు...

భారత క్రికెట్లో అత్యంత ప్రతిభావంతులైన యువక్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొన్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ కు తగిన అవకాశాలు ఇవ్వకుండా పదేపదే డగౌట్ కే పరిమితం చేయడం పై అభిమానులు మండిపడుతున్నారు. పరిమిత ఆవకాశాలు దొరికిన ప్రతిసారీ అత్యుత్తమంగా రాణిస్తూ వచ్చిన సంజు శాంసన్ ను ఎంతకాలం జట్టుకు దూరంగా ఉంచుతారంటూ నిలదీస్తున్నారు.

ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ-20 ప్రపంచకప్ లో సంజు ను కాదని వెటరన్ దినేశ్ కార్తీక్, ఫెయిల్యూర్ హీరో రిషభ్ పంత్ ను ఆడించడం, అదీ చాలదన్నట్లుగా న్యూజిలాండ్ తో ముగిసిన తీన్మార్ సిరీస్ లో కనీసం ఒక్క అవకాశం ఇవ్వకపోడాన్ని తప్పు పడుతున్నారు.

రిషభ్ పంత్ కు అలా..సంజూకు ఇలా..

కేవలం టెస్టు క్రికెట్లో మాత్రమే రాణిస్తూ...వన్డే, టీ-20 ఫార్మాట్లలో వరుసగా విఫలమవుతూ వచ్చిన రిషభ్ పంత్ కే టీమ్ మేనేజ్ మెంట్ ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం

చర్చనీయాంశంగా మారింది. భారత్ తరపున ఇప్పటి వరకూ 65కు పైగా మ్యాచ్ లు ఆడిన రిషభ్ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదంటూ అభిమానులు మండిపడుతున్నారు. అంతేకాదు..అదే సంజు శాంసన్ కు అరకొర అవకాశాలు లభించినా మ్యాచ్ విన్నర్ గా నిలుస్తూ..మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకొంటున్నా పక్కన పెడుతున్నారంటూ క్రికెట్ పండితులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కివీస్ తో సిరీస్ లోనూ అదే సీన్...

న్యూజిలాండ్ తో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ కు రిషభ్ పంత్ ను వైస్ కెప్టెన్ గానూ, సంజు శాంసన్ ను వికెట్ కీపర్ బ్యాటర్ గాను ఎంపిక చేశారు. అయితే...సంజును డకౌట్ కు పరిమితం చేసి..రిషబే్ పంత్ ను రెండుమ్యాచ్ లు ఆడిస్తే..రెండు ఇన్నింగ్స్ లో కలసి రిషభ్ 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పైగా తనజట్టుకు శుభారంభాన్ని ఇవ్వడంలో దారుణంగా విఫలమయ్యాడు.

రిషభ్ పంత్ వరుసగా విఫలమవుతూ వస్తున్నా..పదే పదే ఎందుకు ఆడిస్తున్నారు...సంజు వరుసగా సఫలమవుతూ వస్తున్నా తుదిజట్టుకు దూరంగా ఎందుకు ఉంచుతున్నారంటూ అభిమానుల గోల ఎక్కువయ్యింది.

కనీసం 10 మ్యాచ్ లు ఆడించండి- రవిశాస్త్రి

సంజు శాంసన్ లాంటి అత్యంత ప్రతిభావంతుడైన బ్యాటర్ ను తుదిజట్టుకు దూరంగా ఉంచడంలో అర్థం లేదని, జట్టుకు ఎంపిక చేయడం, తుదిజట్టుకు దూరంగా ఉంచడం భారత క్రికెట్ కు మేలు చేయదని మాజీ శిక్షకుడు, విఖ్యాత కామెంటీటర్ రవిశాస్త్రి అంటున్నారు. ఒకటి రెండు అవకాశాలకు బదులు..వరుసగా 10 మ్యాచ్ లు ఆడించిన తర్వాతే సంజును పక్కన పెట్టాలని సూచించారు.

సంజుకు చోటు లేకపోడం బాధాకరం పాండ్యా...

న్యూజిలాండ్ తో సిరీస్ లో సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వకపోడాన్ని భారత స్టాండిన్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా గట్టిగా సమర్థించుకొన్నాడు. తుదిజట్టును ఎంపిక చేసే అధికారం కేవలం కోచ్, కెప్టెన్ లకు మాత్రమే ఉంటుందని, మూడుమ్యాచ్ ల సిరీస్ లో జట్టులో మార్పులు చేయటానికి తాను వ్యతిరేకమని పాండ్యా స్పష్టం చేశాడు.

జట్టు కూర్పుపై బయటవారు చేసే విమర్శలను తాను ఏమాత్రం పట్టించుకోనని, సంజు శాంసన్ లాంటి ఆటగాడికి తుదిజట్టులో చోటు ఇవ్వలేకపోడం నిజంగా దురదృష్టమేనని చెప్పుకొచ్చాడు.

అంతర్జాతీయస్థాయిలో ఇలాంటి పరిస్థితి అనివార్యమని, వచ్చే సిరీస్ ల్లోనూ ఇదే విధానం అనుసరిస్తామని, కోచ్, కెప్టెన్లకు కావాల్సిన ఆటగాళ్లే తుదిజట్టులో ఉంటారని స్పష్టం చేశాడు.

అయితే...కెప్టెన్ గా తమజట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని, సమాచార లోపం లేకుండా చూసుకొంటానని పాండ్యా వివరణ ఇచ్చాడు. పరిస్థితిని అర్ధం చేసుకొనే స్థితిలో తమ ఆటగాళ్లున్నారని, ప్రతిభ ఉండి తగిన అవకాశం దొరకకు డగౌట్ కే పరిమితం కావడం ఎంత కష్టమో ఓ ఆటగాడిగా తనకూ తెలుసునని హార్థిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మూడుమ్యాచ్ ల సిరీస్ లో అందరికీ అవకాశం దొరకడం కష్టమని..అదే ఐదుమ్యాచ్ ల సిరీస్ లో మాత్రమే ఒకటి లేదా రెండు అవకాశాలు ఇవ్వగలమని తెలిపాడు.

ఆటగాళ్లు తమ అభిప్రాయాలను కెప్టెన్ లేదా కోచ్ దగ్గర స్వేచ్ఛగా వ్యక్తం చేసే వాతావరణం తమ టీమ్ మేనేజ్ మెంట్ కల్పిస్తోందని హార్థిక్ పాండ్యా తెలిపాడు.

First Published:  23 Nov 2022 7:57 AM GMT
Next Story