Telugu Global
Sports

అవి పతకాలు కావు..దేశ గౌరవ చిహ్నాలు!

లైంగిక వేధింపుల పై పోరాడుతున్న భారతరెజ్లర్లకు 1983 ప్రపంచకప్ జట్టు సభ్యులు మద్దతు పలికారు. దేశానికి తాము సాధించి పెట్టిన పతకాలను గంగలో కలిపే ఆలోచనను విరమించుకోవాలని కోరారు.

అవి పతకాలు కావు..దేశ గౌరవ చిహ్నాలు!
X

అవి పతకాలు కావు..దేశ గౌరవ చిహ్నాలు!

లైంగిక వేధింపుల పై పోరాడుతున్న భారతరెజ్లర్లకు 1983 ప్రపంచకప్ జట్టు సభ్యులు మద్దతు పలికారు. దేశానికి తాము సాధించి పెట్టిన పతకాలను గంగలో కలిపే ఆలోచనను విరమించుకోవాలని కోరారు.

న్యూఢిల్లీలో గత కొద్దివారాలుగా నిరసనదీక్ష పాటిస్తున్న భారత రెజ్లర్లకు 1983 ప్రపంచకప్ చాంపియన్ జట్టు సభ్యులు మద్దతు పలికారు. తమ స్వేదాన్ని చిందించి దేశానికి పతకాలు సాధించిపెట్టిన మహిళావస్తాదుల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు ఏమాత్రం సమర్థనీయం కాదని, తమకు తీవ్రమైన బాధ కలిగించిందని ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.

రెజ్లర్లకు క్రికెట్ దిగ్గజాల అండ!

జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను గత పదేళ్ల కాలంగా లైంగికంగా వేధించారంటూ ఓమైనర్ బాలికతో సహా మొత్తం ఏడుగురు మహిళావస్తాదులు ఫిర్యాదు చేశారు.

అంతర్జాతీయ వస్తాదులు, ఒలింపిక్స్, ఆసియా, ప్రపంచ కుస్తీ విజేతలు సాక్షి మాలిక్, వినేశ్ పోగట్ తో సహా మొత్తం ఏడుగురు మహిళా వస్తాదులు గత ఐదువారాలుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనదీక్షను కొనసాగిస్తున్నారు. అయితే..ఢిల్లీ పోలీసులు కొద్దిరోజుల క్రితమే దీక్షా శిబిరాన్ని తొలగించి, మహిళావస్తాదుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం తీవ్రవిమర్శలకు దారితీసింది. అంతర్జాతీయంగా కూడా భారత క్రీడారంగ ప్రతిష్ట మంటగలిసింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు తమ పార్టీకి చెందిన ఎంపీ కావడంతో చర్యలు తీసుకోకుండా మోడీ సర్కార్ మీనమేషాలు లెక్కపెడుతోంది.

జాతీయ, అంత్జాతీయస్థాయిల్లో తీవ్రనిరసన వ్యక్తమవుతున్నా..బ్రిజ్ భూషణ్ పక్షానే నిలిచింది.

అదేమంటే తాము వేసిన విచారణ సంఘం తన నివేదికను సమర్పించేవరకూ వేచిచూడాలని సుద్దులు చెబుతోంది.

ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ, ఢిల్లీపోలీసుల విచారణ పట్ల తమకు నమ్మకం ,విశ్వాసం లేవని..తమను పలువిధాలుగా వేధించిన బ్రిజ్ భూషణ్ ను తక్షణమే అరెస్టు చేయాలంటూ మహిళా వస్తాదులు డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీ పోలీసులు తమ పట్ల వ్యవహరించిన తీరుతో తీవ్రమనస్థాపానికి గురైన రెజ్లర్లు..దేశానికి తాము సాధించి పెట్టిన పతకాలను గంగానదిలో కలిపేస్తామంటూ

హరిద్వార్ కు చేరుకొన్నారు. అయితే ..పతకాలను గంగలో పడవేయవద్దని, కొద్దిరోజులపాటు వేచిచూడాలని కిసాన్ సమితి అద్యక్షుడు తికాయత్ సలహా ఇవ్వటంతో రెజ్లర్లు తమ మనసు మార్చుకొన్నారు.

నిరాశలో ఆవేశపూరిత చర్యలు వద్దు...

తమ కుటుంబసభ్యుల త్యాగాలకు..స్వేదాన్ని జతచేసి..ఏళ్ళ తరబడి చేసిన సాధనకు ప్రతిఫలంగా వచ్చినవే పతకాలని..దేశగౌరవానికి ప్రతీకగా నిలిచే పతకాలను

గంగలో కలిపే ఆలోచనను రెజ్లర్లు విరమించుకోవాలని 1983 ప్రపంచకప్ హీరోలు తమ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆవేశంలో ఎలాంటి అనుచిత నిర్ణయాలు తీసుకోవద్దని సలహా ఇచ్చారు.

దేశానికి ఖ్యాతి తెచ్చిన క్రీడాకారుల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు తమకు అంతులని బాధను, ఆవేదనను కలిగించాయని తమ ప్రకటన ద్వారా వివరించారు.

ఈ రోజు కాకపోయినా..రేపైనా రెజ్లర్లకు న్యాయం జరిగిన తీరుతుందని, కొద్దిరోజులపాటు ఓపిక పట్టి చూడాలని కోరారు.

మనదేశంలోని న్యాయవ్యవస్థే తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.

రెజ్లర్లకు మద్దతుగా చేసిన సంయుక్త ప్రకటనపై 1983 జట్టు కెప్టెన్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మొహిందర అమర్ నాథ్, కృష్ణమాచారీ శ్రీకాంత్, సయ్యద్ కిర్మానీ, మదన్ లాల్, బల్విందర్ సింగ్ సంధూ, సందీప్ పాటిల్, కీర్తి అజాద్ ఉన్నారు.

అయితే..ఈ సంయుక్త ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని 1983 ప్రపంచకప్ జట్టులోని మరో కీలక సభ్యుడు, బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రకటించారు.

స్వతహాగా వివాదాలకు దూరంగా ఉండే రోజర్ బిన్నీ..ఈ వివాదాన్ని సంబంధిత అధికారులు, సంస్థలే పరిష్కరిస్తాయని, పరిష్కారం దొరికేవరకూ అందరూ సంయమనం పాటించాలంటూ కోరారు.

ఆందోళనకు దిగిన రెజ్లర్లకు ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా, టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, భారత మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లేతో పలువురు క్రీడాదిగ్గజాలు మద్దతు పలికారు. అయితే..మేరీ కోమ్, పీటీ ఉష లాంటి దిగ్గజాలు మాత్రం..ప్రభుత్వం వైపే మాట్లాడుతున్నారు.

Next Story