Telugu Global
Sports

సానియా రిటైర్మెంట్ తో భారత మహిళా టెన్నిస్ లో శూన్యం!

భారత మహిళా టెన్నిస్ కు గత రెండుదశాబ్దాలుగా అసమాన సేవలు అందించిన సానియా మీర్జా నిష్క్ర్రమణతో అంతులేని వెలితి ఏర్పడింది. అంతర్జాతీయంగా భారత మహిళా టెన్నిస్ ఉనికిని చాటేది ఎవరు అన్న అంశంపై చర్చకు తెరలేచింది.

సానియా రిటైర్మెంట్ తో భారత మహిళా టెన్నిస్ లో శూన్యం!
X

భారత మహిళా టెన్నిస్ కు గత రెండుదశాబ్దాలుగా అసమాన సేవలు అందించిన సానియా మీర్జా నిష్క్ర్రమణతో అంతులేని వెలితి ఏర్పడింది. అంతర్జాతీయంగా భారత మహిళా టెన్నిస్ ఉనికిని చాటేది ఎవరు అన్న అంశంపై చర్చకు తెరలేచింది.

అసాధారణ ప్లేయర్ సానియా...

14 సంవత్సరాల చిరుప్రాయంలో టెన్నిస్ రాకెట్ చేతపట్టి..16 ఏళ్లవయసులో ప్రొషెషనల్ టెన్నిస్ జీవితం ప్రారంభించిన సానియా 36 సంవత్సరాల వయసు వరకూ తన ప్రస్థానం కొనసాగించింది.

రెండుదశాబ్దాల తన టెన్నిస్ జీవితంలో సానియా సాధించిన ఘనతలు, అపూర్వ విజయాలు గతంలో ఏ భారత మహిళా టెన్నిస్ ప్లేయర్ సాధించలేదన్నది నిర్వివాదాంశం.

ప్రపంచ మహిళా టెన్నిస్ డబుల్స్ లో నంబర్ వన్ ర్యాంక్ సాధించిన భారత తొలి మహిళగా, డబ్లుటిఏ టైటిల్ నెగ్గిన భారత ఒకే ఒక్క ప్లేయర్ గా, అరడజను గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు 43 కెరియర్ టైటిల్స్ నెగ్గిన దిగ్గజ ప్లేయర్ గా, మహిళల సింగిల్స్ లో మొదటి 30 మంది అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించడం సానియాకు మాత్రమే సాధ్యమైంది.

2023 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ లో చివరిసారిగా పాల్గొని మిక్సిడ్ డబుల్స్ రన్నరప్ ట్రోఫీ అందుకొన్న సానియా..2023 దుబాయ్ డ్యూటీ ఫ్రీ డబ్లుటీఏ మహిళల డబుల్స్ తొలి రౌండ్ ఓటమితో తన టెన్నిస్ జీవితానికి స్వస్తి పలికింది.

తన తర్వాత భారత టెన్నిస్ పతాకాన్ని మోసేది ఎవరన్న అంశంపై తనకే స్పష్టత లేదని, అగమ్యగోచరంగా ఉందని సానియా వాపోయింది.

సానియా వారసురాలు ఎవరో?

భారత మహిళా టెన్నిస్ లో సానియాకు ముందు నిరుపమ మన్కడ్ లాంటి ఒకరిద్దరు అంతర్జాతీయ ప్లేయర్ల పేర్లు మాత్రమే వినిపించేవి. 2003 నుంచి భారత టెన్నిస్ లో కేవలం సానియా పేరు మాత్రమే అంతర్జాతీయంగా మార్మోగిపోయింది.

ఒలింపిక్స్ పతకం, గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ మినహా మిగిలిన గొప్పగొప్ప విజయాలు సాధించిన సానియా వారసత్వాన్ని కొనసాగించే మరో భారత మహిళా టెన్నిస్ స్టార్ పుట్టుకు రావాలంటే దశాబ్దాల కాలం పాటు వేచిచూడక తప్పదని టెన్నిస్ పండితులు చెబుతున్నారు.

టెన్నిస్ నే కెరియర్ గా చేసుకొని నిరంతరం శ్రమించడానికి నేటితరం భారత యువతులు అంతగా ఆసక్తి చూపడం లేదని, తనలాగా విజయాలు సాధించిన మరో భారత మహిళా టెన్నిస్ స్టార్ ను రానున్నకాలంలో చూడటం అసాధ్యమేనని స్వయంగా సానియానే చెబుతోంది.

తాను సాధించిన విజయాలు, ఘనతలను అధిగమించే క్రీడాకారిణి భారత మహిళా టెన్నిస్ కు లభించాలని తాను కోరుకొంటున్నానని, మహిళా టెన్నిస్ పరంపర తనతోనే ఆగిపోకూడదని సానియా అంటోంది.

ప్రపంచ టెన్నిస్ లో భారత్ ఎక్కడ?

ప్రపంచ మహిళా టెన్నిస్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే..మహిళల సింగిల్స్ లో 30 సంవత్సరాల అంకిత రైనా 245వ ర్యాంక్, కర్మన్ థండీ 265ల్లో కొనసాగుతున్నారు.

రానున్న దశాబ్దకాలంలో ప్రపంచ మహిళా టెన్నిస్ మొదటి 200 ర్యాంకుల్లో నిలువగల భారత మహిళా ప్లేయర్లు లభించడం అంత తేలికకాదని, ఏదైనా అద్భుతం జరిగితేనే అదిసాధ్యమని సానియా జోస్యం చెప్పింది.

భారత మహిళా టెన్నిస్ బాగు కోసం ప్రణాళికబద్ధంగా దశాబ్దాకాలం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకొంటేనే ఆశించిన ఫలితాలు సాధించగలమని లేకుంటే..హాప్ మన్ కప్ లాంటి టోర్నీలలో పాల్గొనటానికి భారత మహిళా జట్టు అనేది లేకుండా పోతుందని సానియా ఆందోళన వ్యక్తం చేసింది.

భవిష్యత్ తరాల ప్లేయర్లను తయారు చేయటానికి హైదరాబాద్ లో తాను నిర్వహిస్తున్న అకాడమీ ద్వారా కృషి చేస్తానని సానియా ప్రకటించింది. రానున్న మహిళా ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సానియా మెంటార్ గా వ్యవహరించనుంది.

గత రెండుదశాబ్దాల కాలంగా తాను ఎదుర్కొన్న భిన్నరకాల పరిస్థితులు, మానసిక ఒత్తిడి, తన అనుభవాలను స్మృతి మందన నాయకత్వంలోని బెంగళూరు ఐపీఎల్ మహిళాజట్టుతో పంచుకొంటానని, స్ఫూర్తి నింపడానికి తనవంతుగా ప్రయత్నిస్తానని తెలిపింది.

First Published:  26 Feb 2023 8:12 AM GMT
Next Story