Telugu Global
Sports

టెస్టు చరిత్రలో ఇద్దరూ ఇద్దరే!

రాజకోట నిరంజన్ షా స్టేడియం వేదికగా జరిగే మూడోటెస్టులో భారత స్పిన్ జాదూ, ఇంగ్లండ్ స్వింగ్ కింగ్ సరికొత్త రికార్డులకు ఉరకలేస్తున్నారు.

టెస్టు చరిత్రలో ఇద్దరూ ఇద్దరే!
X

రాజకోట నిరంజన్ షా స్టేడియం వేదికగా జరిగే మూడోటెస్టులో భారత స్పిన్ జాదూ, ఇంగ్లండ్ స్వింగ్ కింగ్ సరికొత్త రికార్డులకు ఉరకలేస్తున్నారు. ప్రతిభకు వయసు ఏమాత్రం అవరోధం కాదని చెప్పకనే చెబుతున్నారు...

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్ -ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రాజకోట వేదికగా ఈరోజు ప్రారంభమయ్యే మూడోటెస్టులో ఓ అపురూప ఘట్టం, అరుదైన రికార్డులు చోటు చేసుకోనున్నాయి.

37 సంవత్సరాల భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 500వ వికెట్ తో పాటు పలు సరికొత్త రికార్డులకు ఉరకలేస్తుంటే... 41 సంవత్సరాల ఇంగ్లండ్ 'స్వింగ్ కింగ్' జేమ్స్ యాండర్సన్ 700 వికెట్ మైలురాయి చేరటానికి ఉబలాట పడుతున్నాడు.

2011 నుంచి 2024 వరకూ....

భారత క్రికెట్ కు గత దశాబ్దకాలంగా ఎనలేని సేవలు అందిస్తూ వస్తున్న వెటరన్ ఆఫ్ స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది.

ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ గా భారత్ కు ఎన్నో అరుదైన టెస్టు సిరీస్ విజయాలు అందించిన ఘనత అశ్విన్ కు మాత్రమే దక్కుతుంది. ఆఫ్ బ్రేక్, క్యారమ్ బాల్, దూస్రా లాంటి విలక్షణ అస్త్రాలతో ఇప్పటికే 97 టెస్టుల్లో 499 వికెట్లు పడగొట్టిన అశ్విన్ ప్రస్తుత 3వ టెస్టులో 500 వికెట్ల రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత 500 టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా అశ్విన్ నిలువనున్నాడు.

స్వదేశంలో తిరుగులేని బౌలర్...

స్వదేశీ పిచ్ ల పైన తిరుగులేని స్పిన్నర్ గా పేరున్న అశ్విన్ అనీల్ కుంబ్లే పేరుతో ఉన్న 350 వికెట్ల రికార్డుకు కేవలం 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. భారతగడ్డపై జరిగిన టెస్టుల్లో అనీల్ కుంబ్లే 63 మ్యాచ్ లు ఆడి 350 వికెట్లు సాధించాడు. ఇందులో 25సార్లు 5 వికెట్లు, 7సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు.

అయితే..అశ్విన్ మాత్రం కేవలం 57 టెస్టుల్లోనే 346 వికెట్లు పడగొట్టాడు. 26సార్లు 5 వికెట్లు, ఆరుసార్లు 10 వికెట్ల రికార్డు సైతం అశ్విన్ కు ఉంది. ప్రస్తుత రాజకోట టెస్టులో అశ్విన్ మరో 5 వికెట్లు పడగొట్టగలిగితే కుంబ్లే రికార్డును అధిగమించగలుగుతాడు.

స్వదేశీ పిచ్ లపైన అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ ప్రపంచ రికార్డు ముత్తయ్య మురళీధరన్ పేరుతో ఉంది. శ్రీలంక వేదికగా ఆడిన 73 టెస్టుల్లో మురళీధరన్ 493 వికెట్లు సాధించాడు. ఇందులో 45సార్లు 5 వికెట్లు, 15 సార్లు 10 వికెట్లు చొప్పున పడగొట్టాడు.

ఇంగ్లండ్ పై 100 వికెట్ల రికార్డుకు గురి....

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 100 వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్ రికార్డు సైతం అశ్విన్ కు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకోట టెస్టులో అశ్విన్ మరో 3 వికెట్లు పడగొట్టగలిగితే 100 వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచిపోతాడు.

భారత్- ఇంగ్లండ్ జట్ల ద్వైపాక్షిక సిరీస్ ల్లో 100 వికెట్లు పడగొట్టిన రికార్డు ఇంగ్లండ్ స్వింగ్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ పేరుతో ఉంది. 2011 నవంబర్ లో టెస్టు అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకూ ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 97 వికెట్లు సాధించాడు.

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో అశ్విన్ కు 9 వికెట్లు మాత్రమే దక్కాయి.

ఎవర్ గ్రీన్ పేసర్ జేమ్స్ యాండర్సన్....

టెస్టు క్రికెట్లో ఫాస్ట్ లేదా స్వింగ్ బౌలర్ల కెరియర్ ఐదు లేదా పదేళ్లకే ముగిసిపోడం సాధారణ విషయం. అయితే..ఇంగ్లండ్ స్వింగ్ కింగ్ జేమ్స్ యాండర్సన్ మాత్రం 41 సంవత్సరాల లేటు వయసులోనూ ఇంగ్లండ్ తురుపుముక్కగా , ప్రధాన అస్త్రంగా ఉన్నాడు.

కుదురైన బౌలింగ్ తో ఇన్, అవుట్ స్వింగర్లతో వికెట్ వెంట వికెట్ పడగొడుతూ వచ్చిన యాండర్సన్ ప్రస్తుత సిరీస్ ద్వారా 700 వికెట్ల రికార్డును అందుకోనున్నాడు.

తన సుదీర్ఘ కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 184 టెస్టుల్లో 695 వికెట్లు సాధించాడు.

2003 మే నెలలో జింబాబ్వే ప్రత్యర్థిగా లండన్ లోని లార్డ్స్ వేదికగా టెస్టు అరంగేట్రం చేసిన యాండర్సన్ ప్రస్తుత సిరీస్ లోని విశాఖపట్నం టెస్టు వరకూ రికార్డుస్థాయిలో 184 మ్యాచ్ లు ఆడాడు. టెస్టు చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన తొలి ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ 343 ఇన్నింగ్స్ లో 32సార్లు 5 వికెట్లు, 3సార్లు 10 వికెట్ల రికార్డులు నమోదు చేశాడు. 71 పరుగులిచ్చి 11 వికెట్లు పడగొట్టడం ద్వారా అత్యుత్తమ వ్యక్తిగత టెస్టు గణాంకాలు సాధించగలిగాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ తరువాత అత్యధిక టెస్టులు ఆడిన మొనగాడిగా నిలిచిన యాండర్సన్ ఇప్పటికే రికీ పాంటింగ్, స్టీవ్ వాల రికార్డును అధిగమించాడు. 185వ టెస్టు మ్యాచ్ కు సిద్ధమయ్యాడు.

క్రికెట్ కెరియర్ లో 900 వికెట్ల మొనగాడు...

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 900 వికెట్ల మైలురాయిని చేరిన అరుదైన స్వింగ్ బౌలర్ రికార్జు జేమ్స్ యాండర్సన్ సాధించాడు.

క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితా చూస్తే.. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 1,347 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ (1,001 వికెట్లు), భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (956), ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (949), పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ (916) టాప్-5లో కొనసాగుతున్నారు. తాజాగా ఆరో బౌలర్/ మూడో పేసర్‌గా జేమ్స్ అండర్సన్ (900) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

విశాఖపట్నం వేదికగా ముగిసిన ప్రస్తుత సిరీస్ 2వ టెస్టులో 6వికెట్లు పడగొట్టిన యాండర్సన్ ..రాజకోట టెస్టులో ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో వేచిచూడాల్సిందే.

ఇద్దరు అసాధారణ బౌలర్లు రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పలు అపూర్వ రికార్డులు నెలకొల్పిన టెస్టుగా రాజకోట మ్యాచ్ నిలిచిపోనుంది.

First Published:  15 Feb 2024 3:30 AM GMT
Next Story