Telugu Global
Sports

అప్పుడూ..ఇప్పుడూ మ్యాచ్ విన్నర్ అశ్వినే!

బంగ్లాదేశ్ తో ముగిసిన టెస్టు సిరీస్ లో భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ మ్యాచ్ విన్నర్ గా మరోసారి సత్తా చాటుకొన్నాడు

అప్పుడూ..ఇప్పుడూ మ్యాచ్ విన్నర్ అశ్వినే!
X

బంగ్లాదేశ్ తో ముగిసిన టెస్టు సిరీస్ లో భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ మ్యాచ్ విన్నర్ గా మరోసారి సత్తా చాటుకొన్నాడు. బంతితో మాత్రమే కాదు..బ్యాట్ తోనూ

తానేమిటో నిరూపించుకొన్నాడు.....

రవిచంద్రన్ అశ్విన్...అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విలువైన, తెలివైన, గౌరవం కలిగిన ఆటగాడు. ఫార్మాట్ ఏదైనా జట్టుకు కీలక ఆటగాడు. జాదూ ఆఫ్ స్పిన్ బౌలర్ గా, లోయర్ ఆర్డర్లో అత్యంత ప్రభావశీలమైన ఆటగాడిగా నిరూపించుకొన్న మొనగాడు. 36 సంవత్సరాల వయసులో సైతం తనజట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో నేనున్నానంటూ ముందుకు వచ్చి జట్టును విజయపథంలో నడిపిస్తున్న ధీరుడు.

సిడ్నీ టు మీర్పూర్....

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో భారతజట్టును కష్టాల నుంచి ఎన్నోసార్లు గట్టెక్కించిన క్రికెటర్ గా రవిచంద్రన్ అశ్విన్ కు తిరుగులేని రికార్డే ఉంది. ఫాస్ట్ బౌలర్ల అడ్డా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన కీలక టెస్టుమ్యాచ్ లో హనుమ విహారీతో జంటగా కలసి కంగారూ బౌలర్లను నిలువరించడమే కాదు..మ్యాచ్ ను డ్రాగా ముగించిన వీరుడు అశ్విన్.

ఇక...మెల్బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన 2022 టీ-20 ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ ను సైతం తన విన్నింగ్ బౌండ్రీతో భారత్ ను విజేతగా నిలిపిన మొనగాడు అశ్విన్. నరాలు తెగే ఉత్కంఠతో సాగే పోరులో కూల్ కూల్ గా , సమయోచితంగా, తెలివిగా ఆడటంలో అశ్విన్ తర్వాతే ఎవరైనా. క్రికెట్ వర్గాలలో అశ్విన్ కు సైటింస్ట్ గా, థింకింగ్ క్రికెటర్ గా పేరు మాత్రమే కాదు..ముద్దుపేర్లు సైతం ఉన్నాయి.

మీర్పూర్ టెస్టులో అశ్విన్ షో...

బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మీర్పూర్ నేషనల్ స్టేడియం వేదికగా ..ఆఖరి పరుగు వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ ను ఓటమి అంచుల నుంచి బయటపడేసి 3 వికెట్ల విజయం అందించడంలో శ్రేయస్ అయ్యర్ తో కలసి అశ్విన్ కీలకపాత్ర పోషించాడు.

టాపార్డర్ లోని మొదటి 7మంది బ్యాటర్లు కలసి 74 పరుగులు చేయటానికి నానాతంటాలు పడితే...శ్రేయస్ అయ్యర్ తో కలసి 8వ వికెట్ కు 71 పరుగుల అజేయభాగస్వామ్యంతో భారత్ ను విజేతగా నిలిపాడు. రెండో ఇన్నింగ్స్ లో బౌలర్ గా 4 వికెట్లు పడగొట్టడమే కాదు...బ్యాటర్ గా 42 పరుగుల నాటౌట్ స్కోరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం సొంతం చేసుకోగలిగాడు.

9వ స్థానంలో అశ్విన్ సరికొత్త రికార్డు...

మీర్పూర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 42 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా అశ్విన్ సరికొత్త టెస్టు రికార్డు నెలకొల్పాడు. గ‌తంలో ఈ రికార్డు వెస్టిండీస్‌ పేస్ ఆల్ రౌండర్ విన్స్‌ట‌న్ బెంజ‌మిన్‌ పేరిట ఉంది. 1990 దశకంలో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బెంజమిన్ 40 పరుగుల నాటౌట్‌ స్కోరుతో తన జ‌ట్టును గెలిపించాడు.

మీర్పూర్ టెస్టులో బౌలర్ గా 6 వికెట్లు పడగొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్ గా కీలక భూమిక పోషించాడు. శ్రేయాస్ అయ్య‌ర్‌తో కలసి 71 ప‌రుగులు జోడించి జ‌ట్టుని గెలిపించాడు.

8వ వికెట్‌కు అత్య‌ధిక భాగ‌స్వామ్యం

ఈ కీలకటెస్టులో అశ్విన్-అయ్య‌ర్ జోడీ భార‌త జ‌ట్టు త‌ర‌ఫున‌ 8వ వికెట్‌కు రెండో అత్య‌ధిక భాగ‌స్వామ్యం న‌మోదు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో ఈ జోడీ 71 ప‌రుగులతో అజేయంగా నిలిచింది.

1932 లో భారత జోడీ అమ‌ర్ సింగ్ - లాల్ సింగ్ జోడీ అత్యధిక భాగస్వామ్యంతో తొలి స్థానంలో ఉంది. ఈ జంట క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో జరిగిన భారత అరంగేట్రం టెస్టు మ్యాచ్ లో 8వ వికెట్‌కు 74 ప‌రుగులు జోడించారు. మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ – ఎల్ శివ‌రామ‌కృష్ణ‌న్ జోడీ మూడో స్థానంలో ఉంది. 1985లో శ్రీ‌లంక‌తో కొలంబోలో జ‌రిగిన టెస్టులో కపిల్ జంట 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

88 టెస్టుల్లో 5 సెంచరీలు, 3వేల పరుగులు.

ప్రస్తుత 2022 బంగ్లా సిరీస్ వరకూ అశ్విన్ మొత్తం 88 టెస్టులు ఆడి ..5 శతకాలతో సహా 3వేల పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు. బౌలర్ గా 349 వికెట్ల దగ్గర నిలిచిపోయాడు. మరో వికెట్ పడగొట్టగలిగితే..టెస్టుల్లో 3వేల పరుగులు 450 వికెట్లు పడగొట్టిన ఆల్ రౌండర్ గా నిలిచిపోతాడు.

.గతంలో ఇదే ఘనత సాధించిన దిగ్గజ ఆల్ రౌండర్లలో కపిల్ దేవ్, షేన్ వార్న్, రిచర్డ్ హాడ్లీ, షాన్ పోలాక్ ఉన్నారు. వీరి సరసన అశ్విన్ రానున్న ఆస్ట్ర్రేలియా సిరీస్ ద్వారా నిలిచిపోనున్నాడు.

ఏది ఏమైనా..భారత జట్టులో అసలు సిసలు మ్యాచ్ విన్నర్, గొప్పఫినిషర్ ఎవరంటే అశ్విన్ మాత్రమే అని చెప్పక తప్పదు.

First Published:  26 Dec 2022 3:42 AM GMT
Next Story