Telugu Global
Sports

ఒలింపిక్స్ విజేతకు యూఎస్ ఓపెన్ పరీక్ష!

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కింగ్, పారిస్ ఒలింపిక్స్ విజేత నొవాక్ జోకోవిచ్ రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు.

ఒలింపిక్స్ విజేతకు యూఎస్ ఓపెన్ పరీక్ష!
X

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కింగ్, పారిస్ ఒలింపిక్స్ విజేత నొవాక్ జోకోవిచ్ రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు.

ఆధునిక టెన్నిస్ దిగ్గజం,సెర్బియన్ సూపర్ స్టార్ నొవాక్ జోకోవిచ్ 37 సంవత్సరాల వయసులో ఓ అరుదైన రికార్డుకు గురిపెట్టాడు. మరికొద్దిగంటల్లో ప్రారంభంకానున్న 2024 గ్రాండ్ స్లామ్ సీజన్ ఆఖరి టోర్నీ అమెరికన్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా అరుదైన ఘనత సాధించాలని ఉవ్విళూరుతున్నాడు.

ఒలింపిక్స్ స్వర్ణం జోష్ తో....

ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ బంగారు పతకం సాధించడం ద్వారా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చిన జోకోవిచ్...యూఎస్ ఓపెన్ టైటిల్ ను మరోసారి నెగ్గడం ద్వారా 25 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

రెండుదశాబ్దాల తన టెన్నిస్ ప్రస్థానంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో సహా మొత్తం 72 అంతర్జాతీయ టోర్నీలలో విజేతగా నిలిచిన జోకోవిచ్ పేరుతో పలు గ్రాండ్ స్లామ్ రికార్డులు ఉన్నాయి.

అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్, రెండుసార్లు కెరియర్ గ్రాండ్ స్లామ్, ఓ సారి గోల్డెన్ స్లామ్ ( నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తోపాటు ఒలింపిక్స్ బంగారు పతకం ) ఘనతలు జోకోవిచ్ కు మాత్రమే సొంతం.

నవతరం ఆటగాళ్ల నుంచి పోటీ....

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో కొద్ది సంవత్సరాల క్రితం వరకూ సమకాలీనులు ఫెదరర్ , నడాల్ ల నుంచి మాత్రమే ప్రధానంగా పోటీ ఎదుర్కొన్న వెటరన్ జోకోవిచ్..గత సీజన్ నుంచి నవతరం ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నాడు.

తనముందు టెన్నిస్ ఓనమాలు దిద్దుకొన్న కార్లోస్ అల్ కరాజ్, యానిక్ సిన్నర్ లాంటి ఆటగాళ్ల నుంచి జోకోవిచ్ కు అసలు సిసలు సవాలు ఎదురుకానుంది.

2017 సీజన్ తరువాత నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటూ వస్తున్న జోకోవిచ్..తన కెరియర్ ఆఖరి ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా పుంజుకోగలిగాడు.

అదేజోరుతో యూఎస్ ఓపెన్ టైటిల్ ను నిలుపుకోవాలని భావిస్తున్నాడు.

2024 గ్రాండ్ స్లామ్ సీజన్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో యానిక్ సిన్నర్ చేతిలోనూ, వింబుల్డన్ ఫైనల్లో అల్ కరాజ్ చేతిలోనూ పరాజయాలు పొందిన జోకో..గాయంతో ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ దశ నుంచే ఉపసంహరించుకొన్నాడు.

2010 సీజన్ తరువాత....

ప్రస్తుత సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ లో జోకోవిచ్ విఫలమైతే..2010 సీజన్ రికార్డే పునరావృత్తం కానుంది. పదేళ్ల క్రితం నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో విఫలమైన తరువాత జోకోవిచ్..2011 సీజన్ నుంచి ఒకటి లేదా రెండు టైటిల్స్ నెగ్గుతూ వచ్చాడు. అయితే..ప్రస్తుత సీజన్ మొదటి మూడుటోర్నీలలో కనీసం ఒక్కటైటిల్ దక్కించుకోలేని జోకోవిచ్..అమెరికన్ ఓపెన్ లో తీవ్రఒత్తిడి నడుమ బరిలోకి దిగనున్నాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పురుషుల విభాగంలో అత్యధికంగా 24 టైటిల్స్ నెగ్గిన ఏకైక ఆటగాడిగా ఉన్న జోకోవిచ్..మహిళల విభాగంలో ఆల్ టైమ్ గ్రేట్ మార్గారెట్ కోర్ట్ సాధించిన 25 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేయాలన్న పట్టుదలతో పోటీకి సిద్ధమయ్యాడు.

పురుషుల గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక వారాలు నంబర్ వన్ ర్యాంకర్ గా నిలిచిన జోకోవిచ్ 2017 సీజన్ నుంచి ఏదో ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గుతూ తన ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నాడు.

అపారఅనుభవం కలిగిన జోకోవిచ్..తన వయసులో సగం లేని నవతరం ఆటగాళ్ల జోరును తట్టుకొని 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ తో సరికొత్త చరిత్ర సృష్టించగలడో .లేదో తెలుసుకోవాలంటే..సెప్టెంబర్ 8 వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  25 Aug 2024 9:17 AM GMT
Next Story