Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ కు ముహూర్తం కుదిరింది!

గత కొద్ది సంవత్సరాలుగా ఇదిగో, అదిగో అంటూ వస్తున్న మహిళా ఐపీఎల్ కు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. 2023 మార్చి నెలలో ఈ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

మహిళా ఐపీఎల్ కు ముహూర్తం కుదిరింది!
X

గత కొద్ది సంవత్సరాలుగా ఇదిగో, అదిగో అంటూ వస్తున్న మహిళా ఐపీఎల్ కు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. 2023 మార్చి నెలలో ఈ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.....

గత 15 సీజన్లుగా వార్షిక ఐపీఎల్ లీగ్ నిర్వహిస్తూ వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తూ వచ్చిన బీసీసీఐ ఇప్పుడు మహిళలకు సైతం ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయించింది. గత కొద్ది సంవత్సరాలుగా మహిళలకు సైతం ఐపీఎల్ నిర్వహిస్తామని చెబుతూ వచ్చిన భారత క్రికెట్ నియంత్రణమండలి ఎట్టకేలకు కార్యాచరణ కార్యక్రమం సిద్ధం చేసింది.

2023 మార్చి నెలలో నిర్వహిస్తామంటూ కార్యక్రమ వివరాలను తన అనుబంధ క్రికెట్ సంఘాలకు బీసీసీఐ పంపింది.

ఐదుజట్లతో ప్రారంభ లీగ్...

వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 26 నుంచి జరిగే మహిళా టీ-20 ప్రపంచకప్ టోర్నీ ముగిసిన వెంటనే మొట్టమొదటి మహిళా టీ-20 లీగ్ ను నిర్వహించాలని బీసీసీఐ ఓ ప్రణాళికను సిద్ధం చేసింది.

మొత్తం ఐదు ఫ్రాంచైజీలకు చెందిన జట్ల మధ్య రెండు వేదికల్లోనే 22 మ్యాచ్ లుగా టోర్నీ నిర్వహించనున్నట్లు బీసీసీఐ తన అనుబంధ సంఘాలకు సమాచారం పంపింది.

ఒక్కో జట్టులో 18 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఆరుగురు మాత్రమే విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఒక్కో జట్టు తరపున ఐదుగురు విదేశీ క్రికెటర్లు పాల్గొనేలా నిబంధనలు ఖరారు చేశారు.

ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వం కలిగిన జట్లకు చెందిన నలుగురు, అసోసియేట్ సభ్యదేశాలకు చెందిన ఒక్కో ప్లేయర్ ను తుదిజట్టులో ఉండటానికి అనుమతిస్తారు.

ఒక్కో వేదికలో 10 మ్యాచ్ లు చొప్పున...రెండు వేదికల్లో 20 మ్యాచ్ లు నిర్వహిస్తారు.

లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా టైటిల్ సమరంలో పాల్గొంటుంది. లీగ్ దశలో రెండు, మూడుస్థానాలలో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ నిర్వహిస్తారు.

ఎమిలినేటర్ రౌండ్లో నెగ్గిన జట్టు ఫైనల్లో తలపడనుంది. 2023 సీజన్లో పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందే మహిళా ఐపీఎల్ ను ముగించేలా కార్యక్రమం రూపొందించారు. మార్చి మాసాంతానికి మహిళా ప్రారంభ ఐపీఎల్ కు తెరపడనుంది.

ముంబై వేదికగా ఈనెల 18న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్యసమావేశంలో మహిళా ఐపీఎల్ నిర్వహణకు ఆమోదం తెలుపనున్నారు.

మహిళా ఐపీఎల్ నిర్వహించడంతో దేశవిదేశాలలోని మహిళా క్రికెటర్లు సైతం కోట్లరూపాయల కాంట్రాక్టులతో లబ్ది పొందనున్నారు. మహిళా క్రికెట్ స్థితిగతులను మహిళా ఐపీఎల్ సమూలంగా మార్చినా ఆశ్చర్యంలేదు.

First Published:  13 Oct 2022 10:04 AM GMT
Next Story