Telugu Global
Sports

ఫలించిన జోకోవిచ్ న్యాయపోరాటం!

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జోకోవిచ్ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కరోనా వాక్సినేషన్ లేకుండానే 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో పాల్గొనటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

ఫలించిన జోకోవిచ్ న్యాయపోరాటం!
X

ఫలించిన జోకోవిచ్ న్యాయపోరాటం!

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జోకోవిచ్ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కరోనా వాక్సినేషన్ లేకుండానే 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో పాల్గొనటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది...

సెర్బియన్ థండర్, పురుషుల టెన్నిస్ దిగ్గజం నొవాక్ జోకోవిచ్ టెన్నిస్ కోర్టుల్లో మాత్రమే కాదు...న్యాయపోరాటంలోనూ విజేతగా నిలువగలనని చాటి చెప్పాడు.

కరోనా వ్యాక్సిన్ ధృవపత్రం లేకుండా మెల్బోర్న్ వేదికగా జరిగే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో పాల్గొనటానికి ఆస్ట్ర్రేలియాతోనే అత్యున్నత స్థాయిలో న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు సఫలమయ్యాడు.

2023 టోర్నీకి లైన్ క్లియర్...

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను రికార్డుస్థాయిలో తొమ్మిదిసార్లు నెగ్గిన మొనగాడు నొవాక్ జోకోవిచ్. అయితే..కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

కరోనా వ్యాక్సిన్ పత్రం సమర్చించకుండా పోటీలలో పాల్గొనటానికి జోకోవిచ్ చేసిన ప్రయత్నాలను ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ నిర్వాహక సంఘం అడ్డుకొంది. వ్యాక్సిన్ వేయించుకోకుండా పోటీలలో పాల్గొనటానికి అనుమతించేది లేదంటూ మూడేళ్ల నిషేధం విధించింది.

కరోనా వ్యాక్సిన్ పై నమ్మకం లేని జోకో..

కరోనా మహమ్మారి భయంతో ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వ్యాక్సిన్ వేయించుకొంటే...జోకోవిచ్ మాత్రం తనకు వ్యాక్సిన్ పైన నమ్మకంలేదంటూ ప్రకటించాడు.

తాను వ్యాక్సిన్ తీసుకోకుండానే ప్రపంచ వ్యాప్తంగా జరిగే టెన్నిస్ టోర్నీలలో పాల్గొంటానని మంకుపట్టు పట్టాడు. అయితే...ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ నిర్వాహక సంఘం మాత్రం తాము విధించిన నిబంధనలను పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తూచతప్పక పాటించి తీరాల్సిందేనంటూ స్పష్టం చేసింది.

తాము వీసా జారీ చేయాలంటే కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని సమర్పించి తీరాల్సిందేనని హుకుం జారీ చేసింది. జోకోవిచ్ మాత్రం అందుకు ససేమిరా అనడంతో ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.

దీంతో ..జోకోవిచ్ ఆస్ట్ర్రేలియా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అప్పటి ప్రధాని సైతం జోకోవిచ్ కు ప్రతికూలంగా నిర్ణయిం తీసుకోడంతో..పోటీలలో పాల్గొనకుండా, మెల్బోర్న్ లో విమానం దిగకుండానే జోకోవిచ్ ను గతంలో వెనక్కు పంపారు.

ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయి ఆంటోనీ అల్బెనీస్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి...జోకోవిచ్ పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని ఉపసంహరించుకొంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో 2023 జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనటానికి జోకోవిచ్ కు వీసా జారీ చేసినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

జోకోవిచ్ ఖుషీ...

ఆస్ట్ర్రేలియా ప్రభుత్వం తనపైన విధించిన మూడేళ్ల నిషేధాన్ని ఉపసంహరించుకొన్న వార్తను విని జోకోవిచ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ట్యూరిన్ వేదికగా జరిగిన ఏటీపీ టూర్ ఫైనల్స్ లో యాండ్రీ రుబ్లేవ్ ను జోకోవిచ్ చిత్తు చేసిన మరుక్షణమే ఆస్ట్ర్రేలియన్ వీసా సమాచారం అందటం విశేషం.

జోకోవిచ్ కు మాత్రమే కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకుండా ప్రత్యేక వీసా జారీ చేసినట్లు ఆస్ట్ర్రేలియా మీడియా తెలియచేసింది.

గ్రాండ్ స్లామ్ సీజన్లో తొలి టోర్నీగా జరిగే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ చరిత్రలోనే అత్యధికంగా తొమ్మిదిసార్లు విజేతగా నిలిచిన ఘనత, అసాధారణ రికార్డు జోకోవిచ్ కు మాత్రమే ఉన్నాయి.

First Published:  17 Nov 2022 11:57 AM GMT
Next Story